చెప్పుతో కొట్టుకొని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే నిరసన!




టీడీపీ దౌర్జన్యంపై తీవ్ర ఆగ్రహం.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా



ఆయన ఓ ప్రజాప్రతినిధి.. ఎమ్మెల్యే. పట్టపగలు ప్రజాస్యామ్యాన్ని ఖూనీ చేస్తుంటే తట్టుకోలేకపోయారు. అధికార పార్టీ నేతలు, అధికారులు అంతా కలిసి వ్యవస్థను నాశనం చేస్తుంటే.. తీవ్ర ఆగ్రహానికి, ఆవేదనకు గురయ్యారు. ఈ దుర్మార్గాన్ని ఆపేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. అధికారుల తీరుపై మండిపడ్డారు. ఈ దుర్మార్గాన్ని ఖండిస్తూ తనను తాను చెప్పుతో కొట్టుకొని నిరసన తెలిపారు. ఆయనే ప్రొద్దుటూరు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి. ప్రొద్దుటూరు మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికను వాయిదా వేయడానికి మరోసారి టీడీపీ డ్రామా ఆడటం, అధికారులు అందుకు వత్తాసు పలుకడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల దౌర్జన్యానికి అధికారులు లొంగిపోవడాన్ని తప్పుబట్టారు.



పోలీసులు, అధికారుల తీరును తప్పుబడుతూ.. తనను తాను చెప్పుతో కొట్టుకొని నిరసన తెలిపారు. ప్రొద్దుటూరు మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికలో ప్రభుత్వ కుటిల ప్రయత్నాలను తీవ్రంగా ఎండగట్టిన ఆయన.. ఈ ఎన్నిక నిర్వహించకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. టీడీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆయన మండిపడ్డారు. చైర్మన్‌ పదవికి కావాల్సిన మెజారిటీ వైఎస్‌ఆర్‌సీపీకి ఉన్నా కావాలనే ఎన్నికను టీడీపీ వాయిదా వేయించిందని ఆరోపించారు. టీడీపీ నేతల కుట్రలకు అధికారులు మద్దతు పలుకడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గెలిచే దమ్ములేకే టీడీపీ రౌడీయిజానికి దిగిందని మండిపడ్డారు. తమకు 26మంది కౌన్సిలర్ల బలముందని తెలిపారు. ‘అసలు మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా మారారు.. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేశారు’ అని ఆయన మండిపడ్డారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top