హవ్వ...నవ్విపోదురుగాక


►  హైస్కూల్‌ తరగతుల్లో

► సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌ ప్రశ్నపత్రాల లీక్‌

► మార్కులకోసం ప్రైవేటు విద్యాసంస్థల కుటిలయత్నాలు

►  చిరువయసులోనే తప్పుడు ఆలోచనలకు బీజం

► పరీక్షకు రెండు రోజు ముందే  బయటకు వస్తున్న  ప్రశ్నపత్రాలు

►  మండలస్థాయి విచారణలో బయటపడని దోషులు

సాలూరు : ఉన్నత పాఠశాల స్థాయిలో ఒకే విధమైన పరీక్ష విధానం అమలు చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌ పేరున నిర్వహిస్తున్న పరీక్షలు అపహాస్యమవుతున్నాయి. అడ్డదారిలో ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో ప్రైవేటు విద్యాసంస్థలు కొన్ని ప్రశ్న పత్రాలను లీక్‌చేస్తూ... పాఠశాల స్థాయిలోనే విద్యార్థులను తప్పుదారి పట్టించడాన్ని అలవాటు చేస్తున్నాయి. దీనివల్ల నిజంగా తెలివైన విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

 

అడ్డదారిలో మార్కులకోసం...

ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో ఒకే రకమైన ప్రశ్న పత్రాలు అం దించి పరీక్షలు నిర్వహించేందుకు 2016–17 విద్యాసంవత్సరం నుంచి ప్రాథమిక, ప్రాథమికోన్నత పరీక్షల విధానంలో మార్పులు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆరోతరగతి నుంచి తొమ్మిదో తరగతివరకూ సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌  విధానంలోనే పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి. ఈ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా విద్యార్థులకు పదోతరగతిలో ప్రత్యేకంగా తరగతికి ఐదు వంతున గ్రేస్‌మార్కులు కలుపుతారు. అందుకోసం ఆరో తరగతినుంచే అత్యధిక మార్కులు సాధించేలా విద్యార్థులను చదివించాల్సింది పోయి అడ్డదారిలో మార్కులు సంపాదించేలా వారిని ప్రోత్సహిస్తున్నారు. పరీక్షలకు ఒకటి, రెండు రోజుల ముందే ఈ ప్రశ్నపత్రాలు సంబంధిత పాఠశాలలకు చేరుతాయి. పాఠశాలల యాజమాన్యాలు అందులోంచి ఒక ప్రశ్న పత్రాన్ని తీసేసి రహస్యంగా జెరాక్స్‌ తీయించి పిల్లలకు అందించి వారిచేత బట్టీ పట్టించి పరీక్షలకు హాజరుపరుస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

 

ప్రైవేటు పాఠశాలలే దీనికి మూలమా?

ఇప్పటివరకూ బట్టీ విధానంలో ప్రైవేటు విద్యాసంస్థలు తమ విద్యార్థులచేత అధిక మార్కులు సాధిస్తుండేవి. ఈ విధానం వల్ల అలాంటి ఫలితాలకు దూరమవుతాయేమోనన్న ఆందోళనతో తమకు ముందుగానే చేరిన ప్రశ్నపత్రాల నుంచి ఒకటిరెండు బయటకు తీసి, జెరాక్స్‌ తీసిన అనంతరం మరలా యథాతథంగా ప్రభుత్వం అందించిన ప్రశ్నపత్రాలలో చేరుస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనివల్లనే పలుప్రైవేటు పాఠశాలల విద్యార్థులతోపాటు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల వద్ద కూడా ప్రశ్నపత్రాల జెరాక్స్‌ కాపీలు ఒకటి రెండు రోజుల ముందే కనిపిస్తున్నాయి. 

 

విచారణ జరిపాం: ఎంఈఓ

ఈ విషయమై మండల విద్యాశాఖ అధికారి బి.గణపతి వద్ద సాక్షి ప్రస్తావించగా... ప్రశ్నపత్రాల లీకేజీ విషయమై తనకు ఇప్పటికే సమాచారం అందిందన్నారు. ఆరోపణలు వస్తున్న స్థానిక ప్రైవేటు పాఠశాలకు శనివారం వెళ్లి విచారణ జరిపామని, కానీ అక్కడ ప్రశ్నపత్రాలు సరిపోయాయన్నారు. 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top