త్రైమాసిక పరీక్షలు మరోసారి వాయిదా?


 శ్రీకాకుళం: జిల్లాలో త్రైమాసిక పరీక్షలు మరోసారి వాయిదా పడే అవకాసం కనిపిస్తోంది. అక్టోబర్ 2 నుంచి 20 వరకు జరగనున్న ‘జన్మభూమి-మన ఊరు’ కార్యక్రమంలో ఉపాధ్యాయులను భాగస్వామ్యులను చేసిన నేపథ్యంలో ప్రభుత్వం పరీక్షలను వాయిదా వేయాలని యోచిస్తోంది. దసరా సెలవులు ముందే పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే,  1 నుంచి 8వ తరగతి వరకు ఆర్‌వీఎం పరీక్ష పత్రాలను ముద్రించాల్సి ఉంటుంది. ఆ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్కూల్ కాంప్లెక్స్ ఉపాధ్యాయులకు ముద్రణా బాధ్యతలను అప్పగించారు. నూతనంగా ప్రవేశపెట్టిన సమ్మెటివ్ విధానం ప్రకారం ప్రశ్న పత్రంతో పాటు జవాబులు రాసేందుకు బుక్‌లెట్ తరహాలో ప్రశ్నపత్రాలను తయారు చేయాల్సి ఉంటుంది. ఒక్కో తరగతికి ఆరు ప్రశ్నపత్రాలను తయారు చేసేందుకు రెండున్నర రూపాయలను మాత్రమే మంజూరు చేయడంతో స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ప్రశ్నపత్రాలు తయారు చేయలేక చేతులెత్తేశారు.

 

 ఎన్నో రకాలుగా ప్రయత్నించినా వారు ముందుకు రాకపోగా ఉపాధ్యాయ సంఘాలు సైతం ఆందోళనకు సిద్ధమయ్యాయి. ఇలాంటి తర్జనభర్జనల నేపథ్యంలో పరీక్షలను దసరా సెలవుల తరువాతకు మార్పు చేసి ఈ నెల 9 నుంచి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. స్కూల్‌కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు బదులుగా ఆర్‌వీఎం అధికారులే రంగంలోకి దిగి ఓ ప్రింటర్‌ను బ్రతిమలాడి రెండున్నర రూపాయలకే ప్రశ్నపత్రాన్ని ముద్రిస్తున్నారు. తరగతి వారీగా చూస్తే 1వ తరగతికి తొమ్మిది పేజీలు, రెండో తరగతికి 10 పేజీలు, 3, 4, 5 తరగతులకు 16 పేజీలు, 6వ తరగతికి 36 పేజీలు, 7కు 38 పేజీలు, 8కు 42 పేజీలు ఆరు సబ్జెక్టులకుగానూ అందించాల్సి ఉంటుంది. వీటికి 4.48 రూపాయలు ఖర్చు అవుతుందని లెక్కకట్టి రాష్ట్ర అధికారులకు నివేదించినా వారు రెండున్నర రూపాయలకు మించి ఇచ్చేది లేదని చెప్పడంతో జిల్లా అధికారులు ఓ ముద్రణాలయ యజమానిని ఆ మేరకే ఒప్పించగలిగారు.

 

 అయితే ఆ యజమాని ఎటువంటి కాగితాన్ని వినియోగిస్తారా అన్నదే ప్రస్తుతం అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న. ఇదిలా ఉంటే 9,10 తరగతుల ప్రశ్నపత్రాల ముద్రణ విషయం ఈ సారి ఎలాగోలా గట్టెక్కినా అర్ధసంవత్సరం పరీక్షలు వచ్చేసరికి దీనిలో కూడా గందరగోళం నెలకొని ఉంది. ఈ ప్రశ్నపత్రాలను విద్యాశాఖ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు ద్వారా ముద్రింపజేస్తోంది. ఇటీవల ఈ బోర్డును రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేస్తున్నట్టు ఉత్తర్వులు పంపించడంతో అర్ధసంవత్సర పరీక్షల పేపర్లను ముద్రించే అవకాశం లేదు. అటువంటప్పుడు 1 నుంచి 8 తరగతులకు ఇచ్చిన రేట్లనే 9,10 తరగతుల వారికి కూడా మంజూరు చేస్తే ప్రశ్నపత్రాలు ముద్రించేవారే కరువవుతారు. ఇలా నిధులు మంజూరు చేయడం కంటే రాష్ట్ర స్థాయిలోనే ముద్రించి ప్రశ్నపత్రాలను పంపిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. లేనిపక్షంలో టెండర్ విధానం ద్వారా ముద్రణా బాధ్యతలను అప్పగించేందుకు ప్రభుత్వమే రేట్లను నిర్ధేశించి అనుమతివ్వాలని ఉపాధ్యాయులు, అధికారులు అంటున్నారు. ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి మరి.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top