జగడమే..!

జగడమే..!


 ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల నడుమ అగాధం

 ఇరు రాష్ట్రాల మధ్య తీవ్రమవుతున్న కయ్యాలు

 పీపీఏల రద్దు నుంచి ఎమ్మెల్యే క్వార్టర్ల వరకు లొల్లే

 నువ్వా.. నేనా అన్నట్లు వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రులు

 కీలకాంశాలపై ఎవరి వాదన వారిదే.. రాజీకి ససేమిరా

 ఉభయతారక పరిష్కారాలపై కేంద్రమూ వెనుకంజ


 

 సాక్షి ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్

 రోజురోజుకీ రెండు రాష్ట్రాల మధ్య ముదురుతున్న వివాదాలకు ఇవే నిదర్శనం. ఇవి కూడా మచ్చుకు కొన్నే! తెలుగు బంధాన్ని పంచుకుంటున్న ఇరు రాష్ట్రాలు.. ఇప్పుడు తగువులాడుకుంటున్నాయి. ప్రతి విషయంలోనూ నువ్వా నేనా అనుకుంటూ కయ్యానికి కాలుదువ్వుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య పేచీల జాబితా అంతకంతకూ పెరుగుతోంది. ఎవరి వాదనలు వారు వినిపిస్తూ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఏ ఒక్కరూ మెట్టు దిగడం లేదు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని పరిష్కరించుకోవాలని ఓ సలహా ఇవ్వడమే తప్ప ఈ వివాదాల్లో పెద్దన్న పాత్ర పోషించేందుకు కేంద్రం విముఖంగా ఉంది. ఇప్పటికే విద్యుత్ వివాదంలో జోక్యం చేసుకున్నా ఫలితం లేకుండాపోయింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏలు) రద్దు విషయంలో కేంద్రం ఓ కమిటీని నియమించినా పరిస్థితిలో మార్పు లేదు. మరోవైపు ఈ జగడాలపై సయోధ్య సాధించే దిశగా చర్చలు జరిపేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా చొరవ కనిపించడం లేదు. పెద్ద పెద్ద అంశాలు మొదలుకుని చివరకు ఎమ్మెల్యే క్వార్టర్స్ కేటాయింపు వంటి విషయాల్లోనూ కీచులాటలు చోటుచేసుకుంటున్నాయి. తమ నిర్ణయాలు, వాదనల పట్ల పట్టువిడుపులు ప్రదర్శించని రాష్ట్ర ప్రభుత్వాల ధోరణి చివరకు ప్రజలనే ఇబ్బందులకు గురిచేస్తోంది.

 

 పీపీఏల రద్దుతో మొదలు..: రాష్ర్ట విభజన జరిగిన కొత్తలోనే ఆంధప్రదేశ్ ప్రభుత్వం జెన్‌కో పీపీఏలను రద్దు చేయడంతో ఇరు రాష్ట్రాల మధ్య లొల్లి మొదలైంది. అసలే  విభజన కారణంగా కరెంటు లోటు ఏర్పడిన తమకు పీపీఏల రద్దు నిర్ణయంతో మరింత నష్టం వాటిల్లుతోందని తెలంగాణ సర్కారు రుసరుసలాడింది. దీనిపై కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ(సీఈఏ) జోక్యం చేసుకుని ఉన్నతాధికారులతో భేటీ నిర్వహించినా అంతిమంగా అదేమీ సత్ఫలితాలనివ్వలేదు. ఈలోపు సీలేరు విద్యుత్ కేంద్రం సహా పోలవరం ముంపు ప్రాంతాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతూ కేంద్రం చట్ట సవరణ చేపట్టడం.. ఇరు రాష్ట్రాల మధ్య దూరాన్ని మరింత పెంచింది.

 

 కౌన్సిలింగ్‌పై గందరగోళం

 

 తెలంగాణ అభ్యంతరాలు చెబుతున్నా.. ఉన్నత విద్యా మండలి బుధవారం ఇంజనీరింగ్ ప్రవే శాల కౌన్సిలింగ్‌కు నోటిఫికేషన్ జారీచేసింది. ఈ అంశం సుప్రీం విచారణలో ఉందని, తమ ప్రమేయం లేకుండా నిర్ణయం తీసుకోవడం తగదని అసహనం వ్యక్తం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. తాజా నోటిఫికేషన్‌ను పట్టించుకోకూడదని నిర్ణయించింది. తమ కౌన్సిలింగ్‌ని తామే నిర్వహించుకుంటామని ఆ రాష్ర్ట విద్యా శాఖ మంత్రి ప్రకటించారు. ఏపీ సీఎం చంద్రబాబు, ఉన్నత విద్యా మండలి చైర్మన్ కలిసి  నాటకాలాడుతున్నారని విరుచుకుపడ్డారు. జేఎన్‌టీయూ వీసీని కూడా రంగంలోకి దింపి.. కాలేజీలకు అసలు అఫిలియేషన్లే లేవన్న కొత్త మెలిక పెట్టారు. అన్ని ప్రమాణాల మేరకు నడుస్తున్న కాలేజీలకే అఫిలియేషన్లు ఇస్తామని టీ-సర్కారు పేర్కొంది. అఫిలియేషన్లు లేని కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ ఎలా నిర్వహిస్తారంటూ తన వాదనను తెరపైకి తీసుకొచ్చింది. నిజానికి పదేళ్ల పాటు ఉమ్మడి అడ్మిషన్లు ఉండాలని విభజన చట్టం పేర్కొంటోంది. అడ్మిషన్లు ఆలస్యమై పిల్లలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారని ఏపీ ప్రభుత్వం వాదిస్తుండగా.. తమ ప్రమేయం లేకుండా విధాన నిర్ణయాలేమిటంటూ తెలంగాణ ప్రభుత్వం గుర్రుమంటోంది. మరోవైపు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు కనీసం హెల్ప్‌లైన్ సెంటర్లు కూడా తెరవబోమని తెలంగాణ  పాలిటెక్నిక్ లెక్చరర్ల సంఘం బుధవారం ప్రకటించింది. దీంతో అయోమయంలో పడటం విద్యార్థులు, తల్లిదండ్రుల వంతైంది. విడివిడిగా అడ్మిషన్ల ప్రక్రియ ఎలా సాధ్యమో తెలియక గందరగోళ పరిస్థితి నెలకొంది.

 

 రవాణా వాహనాలపై పన్ను వివాదం

 

 ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే రవాణా వాహనాలపై చెక్‌పోస్టుల వద్ద పన్ను విధించాలని తెలంగాణ రవాణా శాఖ తాజాగా నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదమైంది. దీనిపై ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. టీ-సర్కారు ఆదేశాలపై స్టే విధిస్తూ.. ఉమ్మడి రాష్ర్టంలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఏప్రిల్ 2015 వరకూ వసూలు చేయొద్దని కోర్టు తీర్పునిచ్చింది. ఇక జాతీయ నిర్మాణ సంస్థ(నాక్) డెరైక్టర్ జనరల్(డీజీ) నియామకంపైనా రెండు రాష్ట్రాల మధ్య వివాదం మొదలైంది. ఆర్ అండ్ బీ ఈఎన్‌సీని నాక్ డీజీగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నియమించింది. నాక్ భవనంలో ఒక ఫ్లోర్‌ను కూడా తీసేసుకుంది. అయితే, విభజన చట్టం ప్రకారం.. ప్రైవేటు సొసైటీగా ఏర్పాటైన నాక్‌కు ఏపీ సీఎం చైర్మన్‌గా వ్యవహరిస్తారు. నాక్ డీజీని ఏపీ సీఎం నియమించాల్సి ఉంటుంది. ఇందుకు అనుగుణంగానే బుధవారం నాక్ డీజీగా ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి శ్యాంబాబ్‌ను నియమిస్తూ చంద్రబాబు ఉత్తర్వులిచ్చారు. అయితే ఆయనను బాధ్యతలు చేపట్టనివ్వబోమని తెలంగాణ ఉద్యోగులు భీష్మించుకున్నారు.              

     

 స్థానికత చిచ్చు

 

 1956 సంవత్సరం కన్నా ముందు నుంచి తెలంగాణలో ఉంటున్న వారినే స్థానికులుగా పరిగణిస్తామని, వారికి మాత్రమే ఫీజుల చెల్లింపు పథకాన్ని(ఫాస్ట్) వర్తింపజేస్తామని టీ-సర్కారు ప్రకటించడం, ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు కూడా జారీచేయడం ఇరు రాష్ట్రాల మధ్య చిచ్చు రేపింది. ఈ ప్రాతిపదికపై హైదరాబాద్‌లో ఏళ్లుగా జీవిస్తున్న సీమాంధ్రులతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇప్పటికే దీన్ని వ్యతిరేకిస్తూ ఏపీ సర్కారు ఆధ్వర్యంలో ఓ అఖిలపక్ష బృందం ఢిల్లీకి వెళ్లివచ్చింది. తెలంగాణ సర్కారు నిర్ణయం ఇన్నాళ్లూ స్థానికతను నిర్ధారిస్తున్న రాష్ర్టపతి ఉత్తర్వులకు వ్యతిరేకమని, 1956 ప్రామాణికతను ప్రస్తుతం ఫీజులకే పరిమితం చేసినా.. భవిష్యత్తులో విద్య, ఉద్యోగాల విషయంలోనూ వర్తింపజేసే ప్రమాదముందని ఏపీ ప్రభుత్వ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం తన నిర్ణయానికే కట్టుబడుతూ ఉత్తర్వులు జారీచేయడంతో.. వెంటనే కోర్టుకు వెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కారు సిద్ధమైంది. దీనిపై ఏజీతో సంప్రదింపులు కూడా మొదలెట్టింది. !

 

 క్వార్టర్లపైనా రచ్చ రచ్చ!

 

 తమ ఎమ్మెల్యేలకు కేటాయించిన క్వార్టర్లను వెంటనే ఖాళీ చేయాలని తెలంగాణ ఎమ్మెల్యేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. ఈ నేపథ్యంలో తమకు కేటాయించిన క్వార్టర్లను ఏపీ ఎమ్మెల్యేలు వారం రోజుల్లో ఖాళీ చేయాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి బుధవారం డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నీరు, విద్యుత్ సరఫరాను నిలిపేస్తామని బుధవారం హెచ్చరించారు.

 

 వివాదాల జాబితా ఇంకెంతో..

 

 - డెల్టా తాగునీటి అవసరాల కోసం 10 టీఎంసీల కృష్ణా జలాలను విడుదల చేయాలని కృష్ణా బోర్డు నిర్ణయిస్తే, వాటిని నారుమళ్లకు వాడేస్తారంటూ తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది. తర్వాత బోర్డు జోక్యం చేసుకుని విడతల వారీగా నీటిని విడుదల చేయించింది.

 - ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలను కృష్ణా ట్రిబ్యునల్ తాజాగా తేల్చాల్సి ఉంది. కానీ తమకు బచావత్ ట్రిబ్యునల్ నుంచీ అన్యాయమే జరుగుతోందని, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ కోణంలో ఎప్పుడూ వాదించలేదని, అందుకని అన్ని రాష్ట్రాల వాదనలు విని కొత్తగా వాటాలను పునఃకేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ లేవనెత్తింది.

 - తుంగభద్రపై ఉన్న రాజోలిబండ డైవర్షన్ కెనాల్ ఎత్తు పెంపు వ్యవహారం కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల రైతుల మధ్య కొట్లాటగా మొదలై.. ఇప్పుడు రెండు రాష్ట్రాల నడుమ వివాదంగా మారింది. పోలీస్ బందోబస్తుతో పనుల్ని త్వరగా చేయించాలని కర్ణాటకపై తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తోంది.

 - గోదావరి ప్రాజెక్టులకు సాగునీటి అపెక్స్ కౌన్సిల్ అనుమతులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం మరో వివాదానికి తెరలేచింది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు అపెక్స్ కౌన్సిల్ అనుమతులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. ఈ ధోరణి సరికాదంటూ కేంద్రానికి లేఖ రాయనుంది.

 - ఉమ్మడి రాజధానిలో గవర్నర్‌కు విశేషాధికారాల్ని కల్పించాలని, ఈ మేరకు ప్రభుత్వ బిజినెస్ రూల్స్ సవరించాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది. దీన్ని ఆంధ్రప్రదేశ్ సమర్థిస్తోంది. గవర్నర్‌కు విశేషాధికారాలు కల్పించాల్సిన అవసరం లేదని వాదిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. ఈ ముసుగులో రాజధానిని రాష్ట్రపతి పాలన కిందకు తీసుకొస్తున్నారని మండిపడుతోంది.

 - రాష్ట్ర స్థాయి పోస్టుల్లో ఉన్న ఉద్యోగుల పంపకంపై కసరత్తు చేస్తున్న కమలనాథన్ కమిటీ పూర్తిగా ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారులు చెబుతున్నట్లే వ్యవహరిస్తోందని, ఆ దిశలోనే మార్గదర్శకాల్లో 18ఎఫ్ పేరాను పొందుపరిచిందని తెలంగాణ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top