నాణ్యతకు పాతర

నాణ్యతకు పాతర

  • పీలేరు నియోజకవర్గంలో నాసిరకంగా సీసీ రోడ్ల నిర్మాణం

  •  ఏడాదిలోపే మారిన రూపురేఖలు

  •  రూ.122.75 కోట్ల ప్రజాధనం మట్టిపాలు

  • పీలేరు: పీలేరు నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి హయూంలో నిర్మించిన సీసీ రోడ్లలో నాణ్యతకు పాతర వేశారు. ఫలితంగా ఆ రోడ్లు నిర్మించిన ఏడాదికే రూపురేఖలు కోల్పోయూయి. కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో పీలేరు నియోజకవర్గంలో ఏడు విడతల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.122.75 కోట్ల నిధులు మంజూరు చేశారు. రెండేళ్ల క్రితం ‘పడా’ ఆధ్వర్యంలో సీసీ రోడ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. ఏమైందో ఏమో ఆ టెండర్లను రద్దు చేసి నామినేషన్ ప్రాతిపదికన హేబిటేషన్ కమిటీల పేరిట పనులు కేటాయించారు. రూ.122 కోట్లకు పైగా సీసీ రోడ్లు నిర్మించారు.

     

    పనులకు నిబంధనలివీ..



    రూ.5 లక్షల లోపు నామినేషన్ పనులు చేపట్టడానికి ఐదుగురు సభ్యులతో హేబిటేషన్ కమిటీని ఏర్పాటు చేయాలి. ఏ ప్రాంతంలో సీసీరోడ్డు నిర్మిస్తామో అక్కడి ప్రజలతో కూడా కమిటీ ఏర్పాటు చేయూలి. అనంతరం పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ ఆమోదంతో ఆ శాఖ జేఈ, డీఈలు ఆ పని మంజూరు కోసం ఈఈకి ప్రతి పాదనలు పంపాలి. ఈఈ హేబిటేషన్ కమిటీ సిఫార్సు చేసిన ఒక వ్యక్తి పేరిట పనులు చేపట్టడానికి వర్క్ ఆర్డర్ ఇస్తారు.

     

    నిబంధనలకు నీళ్లు..



    సీసీ రోడ్ల నిర్మాణంలో నిబంధనలకు నీళ్లు వదిలారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. శాఖాపరంగా కాంట్రాక్టర్‌కు 14 శాతం ఆదాయం ఉంటుందని, అయితే నిబంధనల ప్రకారం పనులు చేపట్టకపోవడంతో ఎక్కువగా లబ్ధిపొందారని విమర్శలున్నాయి. అప్పట్లో అధికార పార్టీకి చెందిన ఓ కీలక వ్యక్తి ఆదేశాల మేర కే ఈ మేరకు పనులు జరిగాయన్న ఆరోపణలున్నాయి.

     

    కనిపించని ఎం20 కాంక్రీట్..



    టెండర్లు లేకుండా జరిగే సీసీ రోడ్లను ఎం20 కాంక్రీట్‌తో నిర్మించాల్సి ఉంది. ఈ నిబంధన మేరకు ఒక క్యూబిక్ మీటర్‌కు 330 కిలోల సిమెంట్, 45 క్యూబిక్ మీటర్ల ఇసుక, 9 క్యూబిక్ మీటర్ల కంకరతో నిర్మాణ పనులు చేపట్టాలి. నిర్మాణం పూర్తయిన 21 రోజులపాటు నీటితో క్యూరింగ్ చేయాలి. పనుల్లో ఎక్కడా ఎం20 కాంక్రీట్ వేయడం లేదనే ఆరోపణలున్నాయి.

     

    తూతూమంత్రంగా తనిఖీలు

     

    క్వాలిటీ కంట్రోల్ అధికారులు సీసీ రోడ్ల పనులను తూతూమంత్రంగా తనిఖీలు చేస్తున్నారు. పనులు పూర్తయిన అనంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇందులో రోడ్డుకు చివరిలో కొలతలు మాత్రమే చూపుతున్నారనే ఆరోపణ లున్నాయి. పీలేరు నియోజకవర్గంలో భారీ స్థాయిలో సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతున్నా ఒక డీఈనే పనులను పర్యవేక్షించడంపై ఆరోపణలు గుప్పుమన్నాయి. ధనార్జనే ధ్యేయంగా ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన రియల్ ఎస్టేట్ భూముల్లో సీసీ రోడ్లు వేశారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

     

     నాణ్యత లో రాజీలేదు

     సీసీ రోడ్ల నిర్మాణంలో భాగంగా నాణ్యతా ప్రమాణాలు పాటించడంలో ఎక్కడా రాజీపడలేదు.  నియోజకవర్గంలో దాదాపు రూ.80 కోట్లతో సిమెంట్ రోడ్లు నిర్మించాం. సకాలంలో పనులు ప్రారంభించక రూ.42 కోట్లు వెనక్కిపోయాయి. ఒకటి రెండు చోట్ల నాణ్యత లోపించి ఉంటే తక్షణం పరిశీలించి చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ నిబంధనల మేరకు హేబిటేషన్ కమిటీ ఆధ్వర్యంలోనే పనులన్నీ చేపట్టాం.

     -రమణయ్య, పీలేరు పంచాయతీరాజ్ డీఈ

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top