తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టిపెట్టండి


ఒంగోలు: జిల్లా వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో చాలా గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంది. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో పరిస్థితి దారుణంగా ఉంది..కనుక ప్రత్యేక దృష్టి సారించి తాగునీటి సమస్య లేకుండా చూడాలని జిల్లా అధికారులను జెడ్పీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ ఆదేశించారు. జెడ్పీ కార్యాలయంలోని తన చాంబర్‌లో మంగళవారం రాత్రి ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో ఆయన సమీక్షించారు.



సీపీడబ్ల్యూఎస్ స్కీముల పరిస్థితిపై ఆరా తీశారు. ఎన్‌టీఆర్ సుజల పథకం కింద 847 ఆవాస గ్రామాల్లో మినరల్ వాటర్ పంపిణీ చేసేందుకు పథకం సిద్ధం చేశామన్నారు. పాఠశాలల పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్వహణపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. దీనికోసం మండల స్థాయిలో ఎంపీడీవో, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ, రాజీవ్ విద్యామిషన్ అధికారులు, ఎంఈవోతో ఓ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ చాలాచోట్ల మురుగునీటి పారుదల నిలిచిపోవడానికి ప్రధానంగా ప్లాస్టిక్ వస్తువులు అడ్డుపడడమే కారణమని పేర్కొన్నారు.  ప్లాస్టిక్‌ను నిషేధించేందుకు దృష్టి సారించాలని కోరారు.



దీనిపై ప్రత్యేక డ్రైవ్ ద్వారా జిల్లాలో ప్లాస్టిక్‌పై నిషేధం విధించేందుకు సిద్ధమయ్యారు. తాగునీరు వృథా కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని నిర్ణయించారు. వ్యక్తిగత మరుగుదొడ్లకు సంబంధించి తమకు ప్రభుత్వం గత ఏడాది 2.18 లక్షల నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించింద ని, ఇప్పటి వరకు 32 వేల నిర్మాణాలు పూర్తయ్యాయని అధికారులు పేర్కొన్నారు. ఇక నుంచి ఏడాదికి లక్ష చొప్పున నిర్మాణాలు పూర్తిచేయాలని నిర్ణయించామన్నారు.



 ఆర్‌వో ప్లాంట్ల పేరుతో ఎవరైనా నాణ్యతలేని నీటిని పంపిణీ చేస్తుంటే అటువంటివారు ఆ నీటిని తమ వద్దకు తెస్తే దానిని పరీక్షకు పంపించి తదుపరి చర్యలు తీసుకునేందుకు నిర్ణయించినట్లు అధికారుల సమావేశం అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ చెప్పారు. సమీక్షలో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ యూఎన్‌ఎస్ మూర్తి, ఒంగోలు ఈఈ షేక్ మద్దన్‌ఆలీ, డీఈ లతీఫ్, ఏఈ రమణ, జేఈ శ్రీనివాసులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top