పప్పు తిప్పలు

పప్పు తిప్పలు


- అలాట్ మెంట్ ఫుల్...సరుకు నిల్

- సెప్టెంబర్ కోటాలో కందిపప్పు పంపిణీ అరకొరే

ఒంగోలు
: కేటాయింపులు ఫుల్...సరుకు నిల్లు అన్న చందంగా ఉంది జిల్లాలో రేషన్ దుకాణాల  పరిస్థితి. బహిరంగ మార్కెట్లో రోజురోజుకూ కందిపప్పు ధరలు ఆకాశాన్నంటుతుంటే ప్రభుత్వం మాత్రం ధరలు తగ్గించేందుకు చర్యలు చేపట్టకపోగా రెండు నెలలపాటు కందిపప్పును రేషన్ దుకాణాల ద్వారా అందించి చేతులెత్తేసింది. సెప్టెంబర్ మాసంలో కందిపప్పు పంపిణీకి సంబంధించి అలాట్‌మెంట్ ఉత్తర్వలైతే వచ్చాయి కానీ గోదాములలో మాత్రం సరుకులేకపోవడం గమనార్హం.

 

అవసరం 8.31 లక్షల కేజీలు

జిల్లాలో తెల్లరంగు రేషన్ కార్డుదారులు, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులకు సంబంధించి ప్రతినెలా రేషన్ పొందే లబ్ధిదారులు 8,36,061 కుటుంబాలున్నాయి. గతంలో వీరికి బియ్యం కాకుండా ఆరు రకాల సరుకులు ప్రతినెలా కేవలం రూ.185లకే అందేవి. రెండు నెలల క్రితం వరకు పంచదారతోనే సరిపెట్టిన ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు ధరలు పెరగడం చూసి రేషన్ దుకాణాల్లోను పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చింది. టీడీపీ ప్రభుత్వం పాలకపగ్గాలు చేపట్టి ఏడాది దాటినా రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీకి సరైన విధానాన్ని అనుసరించడంలో ఘోరంగా విఫలమైంది.



ఆధార్‌ను అనుసంధానం చేసి అక్రమాలు అరికడతాం...ఈపాస్ ద్వారా అర్హులకే సరుకులు పంపిణీ చేస్తామంటూ ప్రకటనలకే కోట్ల రూపాయలు వ్యయం చేసిన ప్రభుత్వం పేదలను ఆదుకునే విషయంలో మాత్రం వెనుకడుగు వేస్తూనే ఉంది. 8,36,061 కుటుంబాలకు 8,36,061 కేజీల కందిపప్పును పంపిణీ చేయాల్సి ఉండగా రేషన్ దుకాణాల్లో గతం తాలూకా 4812 కేజీలు మిగిలి ఉన్నాయి. అంటే సెప్టెంబర్ మాసంలో కందిపప్పు పంపిణీకి 4812 కేజీలుపోను ఇంకా అదనంగా 8,31,249 కేజీలు అవసరం ఉంది.

 

గోదాముల్లో నిల్వలు ఇలా...

గోదాములను పరిశీలిస్తే జిల్లాలో కేవలం 103 టన్నులు మాత్రమే కందిపప్పు నిల్వలున్నాయి. వాటికి రేషన్ దుకాణాల్లో ఉన్న 4812 కేజీల నిల్వను కలిపితే 1,07,812 కేజీలు కందిపప్పు నిల్వలున్నట్లవుతుంది. అంటే మొత్తం 8,36,061 కార్డుదారులకుగాను  1,07,812 మందికి మాత్రమే పంపిణీ చేయడం సాధ్యమవుతుంది. దీని ప్రకారం సెప్టెంబర్ మాసంలో 7,28,249 మందికి కందిపప్పు పంపిణీచేయడం సాధ్యపడదు. కందిపప్పు పంపిణీకి సంబంధించి కాంట్రాక్టులు కుదుర్చుకున్నవారు బహిరంగ మార్కెట్ ధర రూ.100 నుంచి రూ.110లుండేది. ప్రస్తుతం ధర మరో రూ. 20 పెరిగేసరికి చేతులెత్తేశారు. అయితే దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవల్సిన ప్రభుత్వం కాంట్రాక్టర్ల పట్ల మెతక వైఖరిని అవలంబిస్తూ వచ్చింది.



కనీసం కొత్త టెండర్లు ఖరారయ్యేవరకూ పాత కాంట్రాక్టర్లు పంపిణీ చేయాల్సిందేనంటూ హెచ్చరికలు కూడా చేయకపోవడం గమనార్హం. దీంతో మంగళ, బుధ వారాలలో జరిగే టెండర్ల ప్రక్రియలో ధర ఏమేరకు పలుకుతుందో, ప్రభుత్వం ఏ మేరకు సంబంధిత కాంట్రాక్టర్లకు కట్టబెడుతుందో వేచి చూడాల్సిందే. అయితే అధికారులు మాత్రం ప్రస్తుతం తమ వద్ద 103 టన్నుల నిల్వలున్నాయని, రేషన్ దుకాణాల వద్ద మిగిలి ఉన్న సరుకును కలుపుకొని మొత్తం పాతిక శాతం ఉంటాయంటూ పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ వెంకటేశ్వర్లు పేర్కొంటున్నారు. కార్డుదారులకు రేషియో చొప్పున పంపిణీ చేయాలా లేక కొన్ని దుకాణాలకే వాటిని సర్థాలా అనేదానిపై నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన పేర్కొనడం గమనార్హం.

 

ఎందుకిలా...


బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధర రూ.100 నుంచి రూ.110 ఉన్న సమయంలో కాంట్రాక్టర్లు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రస్తుతం ధర రూ. 20 పెరిగేసరికి చేతులెత్తేశారు. ధరతో సంబంధంలేకుండా పంపిణీ చేయాల్సిన కంట్రాక్టర్‌పై ప్రభుత్వం మెతక వైఖరి అవలంబించడంతో వినియోగదారులకు ఈ దుస్థితి ఏర్పడింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top