భార్య బంధువుల నుంచి రక్షణ కల్పించండి


బనగానపల్లె వాసి ఎస్పీకి వినతి

కర్నూలు: భార్య తరఫు బంధువుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని బనగానపల్లెకు చెందిన నడిపి హుసేన్ ఎస్పీ ఆకే రవికృష్ణను వేడుకున్నారు. సోమవారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు డయల్ యువర్ ఎస్పీ, అనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలో నేరుగా వచ్చి కలసినవారి నుంచి ఎస్పీ వినతులను స్వీకరించారు. సాయంత్రం వరకు పోలీసు ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బనగానపల్లె వాసి నడిపి హుసేని ఎస్పీని కలసి వినతిపత్రం రూపంలో తన సమస్యను చెప్పుకున్నారు.



తన భార్య సక్రమంగా పనిచేయకపోవడం వల్ల కొట్టడం జరిగిందని, అందుకు ఆమె తరపు బంధువులు వచ్చి తనను చితకబాదడంతో తప్పించుకుని పారిపోయానని పేర్కొన్నాడు. రెండు రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఉన్న పట్టాదారు పాసు పుస్తకాలు, కొంత నగదు తీసుకువెళ్లారని ఫిర్యాదు చేశాడు. చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని, వారి నుంచి రక్షణ కల్పించాల్సిందిగా వేడుకున్నాడు.

 

తన కుమారునికి రైల్వే ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి బుక్కాపురం భాస్కర్‌రెడ్డి రూ.లక్ష తీసుకుని మోసం చేశాడని పసుపుల గ్రామానికి చెందిన రాముడు ఫిర్యాదు చేశాడు. వ్యవసాయ కూలీగా పనిచేస్తూ ఇద్దరు పిల్లలను చదివించుకుంటున్నానని, పదో తరగతి పాసైన తన కుమారునికి రైల్వే శాఖలో హెల్పర్ పోస్టు ఇప్పిస్తానని భాస్కర్‌రెడ్డి నమ్మించి రూ.లక్ష తీసుకుని డబ్బులు ఇవ్వడం లేదని, న్యాయం చేయాలని కోరాడు.

     

తన కుమార్తె వివాహం జరిగిన రెండు రోజుల నుంచి అజ్ఞాత వ్యక్తులు ఆమె మొబైల్‌కు వివిధ నెంబర్ల నుంచి ఇబ్బందికరమైన బ్లాక్‌మెయిల్ మెసేజ్‌లు పంపుతూ కుటుంబాన్ని మానసికంగా వేధిస్తున్నారని, వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కర్నూలుకు చెందిన రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి ఫిర్యాదు చేశారు.

     

బంగారు షాపులో పనిచేస్తున్న స్నేహితుడు ఒకరు నా భార్యకు ఫోన్ చేసి ఇబ్బంది ప్రవర్తిస్తున్నాడని డోన్ మండలానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. తరచూ తనతో ఫోన్‌లో మాట్లాడకపోతే నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడని, విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకున్నాడు.

     

బేతంచెర్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొలుములపల్లి గ్రామంలో బెల్టుషాపు ఏర్పాటుతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని, మద్యం సేవించినవారు అల్లర్లు, గొడవలు సృష్టిస్తున్నారని, బెల్టు షాపు నిర్మూలించి ప్రశాంత వాతావరణం నెలకొల్పాలని గ్రామ ప్రజలు ఫిర్యాదు చేశారు.

     

డయల్ యువర్ ఎస్పీ, ప్రజాదర్బార్‌లకు వచ్చిన ఫిర్యాదులన్నిటిపై విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top