బాబూ.. ఇదేమి న్యాయం


కర్నూలు(అర్బన్): అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఎన్నికల ముందు ఊదరగొట్టి..అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా గృహ నిర్మాణ సంస్థలో అవుట్ సోర్సింగ్ పద్ధతిన విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక శ్రీకృష్ణదేవరాయ సర్కిల్ సమీపంలో మంగళవారం రిలే దీక్షలు చేపట్టారు.



ఈ దీక్షలను సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పీఎస్ రాధాక్రిష్ణ ప్రారంభించారు. ఫెడరేషన్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు హెచ్ జాన్, ఎస్ దాస్ అధ్యక్షతన జరిగిన ఈ దీక్ష శిబిరంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేశారని, అధికారంలోకి వచ్చిన తరువాత ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నారన్నారు. ప్రపంచ బ్యాంకు విధానాల్లో భాగంగా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పద్ధతిని ప్రవేశపెట్టింది చంద్రబాబేనని గుర్తు చేశారు. ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. రామన్న మాట్లాడుతూ.. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని చెప్పి.. ప్రస్తుతం వారందరినీ తొలగించడం దారుణమన్నారు.



 అన్ని శాఖల్లోని ఉద్యోగులకు డిసెంబర్ 31వ తేదీ వరకు గడువు ఇచ్చి, హౌసింగ్ ఉద్యోగులకు మాత్రం నెల రోజులు మాత్రమే ఇవ్వడం బాధాకరమన్నారు. తక్షణమే ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తొలిరోజు దీక్షల్లో ఫెడరేషన్ నాయకులు రవిబాబు, ఈశ్వర్, ఆలీ, ప్రహ్లాద్, గంగమ్మ, జ్యోతి, సురేష్, మోహన్, గుర్రప్ప కూర్చున్నారు. వీరికి కార్పొరేషన్ రెగ్యులర్ ఇంజనీర్లు మద్దతు ప్రకటించారు. హౌసింగ్ జేఏసీ అధ్యక్షుడు జయరామాచారి, పబ్లిక్ సెక్టార్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సి. నాగరాజులు సంఘీభావం తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top