దుంగలు తరలిస్తూ పట్టుబడ్డ ప్రొటెక్షన్ వాచర్

దుంగలు తరలిస్తూ పట్టుబడ్డ ప్రొటెక్షన్ వాచర్ - Sakshi


బద్వేలు అర్బన్‌ః

 ద్విచక్రవాహనంలో ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ప్రొటెక్షన్ వాచర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక అర్బన్ స్టేషన్‌లో సీఐ వెంకటప్ప వివరాలు వెళ్లడించారు. ముందస్తు సమాచారం మేరకు  ఎస్‌బి ఎస్‌ఐ రామాంజ నేయుడు, అర్బన్, రూరల్ ఎస్‌ఐలు నాగమురళి, నరసింహారెడ్డి, సిబ్బంది కలసి మైదుకూరు రోడ్డులోని గుంతపల్లె క్రాస్‌రోడ్డు దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా గుంతపల్లె  వైపు నుంచి ఏపీ04 ఏఎఫ్3752 నంబరు గల ద్విచక్రవాహనంలో ఇద్దరు వ్యక్తులు వస్తూ పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు.



అనుమానంతో వారిని వెంబడించి పట్టుకుని తనిఖీ చేయగా వారి దగ్గర ఉన్న బ్యాగులో ఐదు ఎర్రచందనం దుంగలు ఉన్నాయి. అరెస్టు అయిన వారిలో బి.కోడూరు మండలం తంగేడుపల్లెకు చెందిన చెల్లా గురుప్రసాద్ అలియాస్ ప్రసాద్, నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలానికి చెందిన పత్తిరత్నం ఉన్నారు. వీరిలో గురుప్రసాద్ బద్వేలు రేంజ్ పరిధిలోని లక్కవారిపల్లె బీటులో 2013 నుంచి ప్రొటెక్షన్ వాచర్‌గా పనిచేస్తున్నాడు.



ఎర్రచందనం అక్రమ రవాణాకు అలవాటుపడిన గురుప్రసాద్, రత్నం అనే వ్యక్త్తితో కలసి ఎర్రచందనం అక్రమ రవాణా సాగిస్తుండేవాడు. రత్నంపై ఇది వరకే  నెల్లూరు జిల్లా మర్రిపాడు పోలీసుస్టేషన్‌లో ఎర్రచందనం అక్రమ రవాణా కేసు నమోదైనట్లు సీఐ తెలిపారు. దుంగలతో పాటు అక్రమ రవాణాకు ఉపయోగించిన ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.



 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

 లక్కిరెడ్డిపల్లె మండలంలోని పాళెంగొల్లపల్లె పంచాయతీ పరిధిలో శుక్రవారం తెల్లవారు జామున పోలీసులు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పోలీసులకు అందిన సమాచారం మేరకు ఎస్‌ఐ హుస్సేన్ వారి సిబ్బందితో కలసి దాడులు నిర్వహించారు. దుంగలు స్వాధీనం చేసుకొని  నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిసింది. ఇందులో ఒకరు అదుపులో ఉన్నట్లు తెలిసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top