ఆయకట్టు.. తీసికట్టు..


 రోజురోజుకు కుంచించుకుపోతున్న చెరువులు

 చెరువులు, చెక్‌డ్యాంలు, కుంటల్లో పేరుకుపోతున్న కంపచెట్లు

 కొన్నిచోట్ల చెరువులు తెగిపోయినా ఇప్పటికీ నిర్మించని వైనం

 అవసరంలేని చోట నీరు - చెట్టు పనులు చేపడుతూ నిధుల దుర్వినియోగం

 వర్షాకాలం రానున్న తరుణంలో అధికారులు మేల్కొంటేనే మేలు


 

కడప : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రాజెక్టులకు సంబంధించి దాదాపు 90 శాతం పనులు పూర్తయినా.. కేవలం 10 శాతం పనులు చేయడంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైఎస్‌ఆర్ సంకల్పించిన ప్రాజెక్టులు, కాలువల పనులను పూర్తి చేసి ఉంటే అన్నదాతకు కష్టాలు ఉండేవి కావు. ప్రతి ఏడాది సాగునీటి కోసం రైతులు సమరం సాగిస్తూనే ఉన్నారు. అటు కేసీ కెనాల్, ఇటు పీబీసీ, మైలవరానికి తుంగభద్ర నీరు రాక రైతులు అవస్థలు పడుతూనే ఉన్నారు. చివరకు చెరువుల ఆయకట్టు కూడా రోజు రోజుకు తీసికట్టుగా మారుతోంది. చెరువుల్లో కంపచెట్లతోపాటు పూడికలు పెరిగిపోవడంతో.. చెరువుల్లో సక్రమంగా నీరు నిలబడక ఆయకట్టుకు నీరు అందని పరిస్థితి నెలకొంటోంది. దీంతో ప్రధానంగా చెరువుల కింద కనీసం ఒక్క పంట పండించుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోతోంది. ఒకప్పుడు రాజులు మహోన్నత ఆశయంతో చెరువులు నిర్మించినా.. పురాతన కాలం నాటి చెరువులకు కనీస మరమ్మతులు కూడా చేయకపోవడంతో చెరువుల్లో నీటి నిల్వకు సంకటం ఏర్పడుతోంది. ఒకప్పుడు కళకళలాడిన పంట పొలాలు.. నేడు చెరువులు, కుంటల పరిధిలో కూడా వెలవెలబోతుండడం ఆందోళన కలిగించే పరిణామం.



తెగిపోయిన చెరువులకు మరమ్మతులు ఏవీ..?

జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో పాటు అంతకుమునుపు కురిసిన వర్షాలకు చాలా చోట్ల చెరువు కట్టలు తెగిపోయాయి. కొన్నిచోట్ల చెరువులకు, కట్టలకు గండ్లు ఏర్పడి వరదనీరు వంక పాలైంది.  తొండూరు చెరువు ఏడాది క్రితం తెగిపోయినా పట్టించుకొనే నాథుడే లేరు. ఇప్పటికే దాదాపు చెరువు కట్ట రెండుసార్లు తెగిపోయినట్లు తెలుస్తోంది. ఇదొక్కటే కాదు.. జిల్లాలో ఇలాంటివి పెద్ద సంఖ్యలోనే ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా జిల్లాలో 140 నుంచి 160 మధ్య చెరువులకు మరమ్మతులు చేయాల్సి ఉంది. వర్షాకాలం రానున్న నేపథ్యంలోనైనా అధికారులు యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేపడితే కొంతైనా ప్రయోజనం ఉంటుంది.



 నీరు - చెట్టుతో నిధులు వృథా..

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీరు - చెట్టు పథకంలో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. చాలా చోట్ల అవసరమైన చోట పనులు చేయకుండా.. అవసరంలేనిచోట పనులు చేపట్టి అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆర్థిక వనరులు సమకూరుస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. మంచి ఆయకట్టు ఉన్న చెరువుల్లో పూడికతీతతోపాటు కంపచెట్ల తొలగింపు చర్యలు చేపడితే ఉపయోగంగా ఉంటుంది. ఎక్కడ చూసినా చెరువుల్లో లక్షలాది రూపాయలు వెచ్చించి పనులు చేస్తున్నా.. అవి రైతులకు ఉపయోగపడేలా కనిపించడంలేదు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం శ్రద్ధ తీసుకొని చెరువుల్లో పెద్ద ఎత్తున నీరు నిల్వ చేసేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తే బాగుంటుందని పలువురు రైతులు సూచిస్తున్నారు.

 

చెరువుల్లో పెరుగుతున్న కంపచెట్లు

జిల్లాలో సుమారు 1776 చిన్న, పెద్ద చెరువులు ఉన్నా.. వర్షం పడిన సందర్భంలో పూర్తిస్థాయిలో నీరు నిలబడటంలేదు. అందుకు కారణం అన్ని చోట్ల చెరువుల్లో పూడిక పెరగడంతోపాటు కంపచెట్లు, ఇతర పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. ఎక్కడ చూసినా చెరువుల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కొన్నిచోట్ల ఏకంగా చెరువులకు గండ్లు పడి, నెర్రెలు చీలి నీరు వృథా అవుతున్నా.. మరమ్మతులు చేపట్టలేదని పలువురు పేర్కొంటున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top