గుండ్లమోటుకు నిర్లక్ష్యం గండ్లు

గుండ్లమోటుకు నిర్లక్ష్యం గండ్లు


- రూ.కోట్లు వెచ్చించినా ప్రయోజనం శూన్యం

- అధికారుల నిర్లక్ష్యానికి బీడువారుతున్న పంట పొలాలు

- భూగర్భ జలాలు అడుగంటి తాగునీటికి తంటా    

గిద్దలూరు:
గుండ్లమోటు ప్రాజెక్టు పనుల్లో నిర్లక్ష్యం ఆవహించింది. దీంతో పశ్చిమ ప్రకాశంలో ఇటు సాగు నీరుకు, అటు తాగునీరుకు కటకట ప్రారంభమయింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం చేపట్టాక మార్కాపురం డివిజన్‌లోని కొన్ని ప్రాంతాలకైనా తాగు, సాగు నీరు వస్తుందని రైతులు, ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూశారు. 1980లో కొట్టుకుపోయిన గుండ్లమోటు ప్రాజెక్టుకు వై.ఎస్. హయాంలో నిధుల మంజూరయ్యాయి. కంభం చెరువు అభివృద్ధికి జపాన్ నిధుల మంజూరుకు కృషి చేశారు. ఆయన మరణానంతరం వచ్చిన పాలకుల నిర్లక్ష్యానికి పరుగులు తీయాల్సిన ప్రగతి పడకేసింది. దీంతో గత ఆరు సంవత్సరాలుగా నిర్మాణ పనులు సాగుతూ...నే ఉన్నాయి. కంభం చెరువు అభివృద్ధి, గుండ్లమోటు ప్రాజెక్టు పూర్తయితే వేల ఎకరాలకు నీరందే అవకాశం ఉంది. దీంతోపాటు భూగర్భ జలాలు అభివృద్ధి చెంది తాగునీటికి ఇబ్బందులు లేకుండా ఉంటుంది.

 

2009లో శ్రీకారం...

గిద్దలూరు మండలంలోని వెంకటాపురం సమీపంలోని అటవీ ప్రాంతంలో ఎనుమలేరు వాగుపై 1975వ సంవత్సరంలో పనుల చేస్తున్న సమయంలోనే అధిక వర్షాలకు కట్ట తెగిపోయింది. దీంతో తాత్కాలిక పనులు చేపట్టారు. తిరిగి 1980 నుంచి 2000 సంవత్సరం వరకు కురిసిన భారీ వర్షాలకు వచ్చిన నీటి ఉధృతిలో అలుగు, తూముతోపాటు, అప్రాన్, పికప్ ఆనకట్టలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఎలాంటి నిధులూ విడుదల చేయలేదు. 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం మొదట రూ.7 కోట్లు నిధులు విడుదల చేసింది. అనంతరం రిజర్వాయర్ డిజైన్ మార్పుల కోసం అదనంగా మరో రూ.4.63 కోట్లను విడుదల చేసింది. పనులు దక్కించుకున్న ఎంఆర్‌కేఆర్ కనస్ట్రక్షన్ సంస్థ ప్రతినిధులు వెంటనే పనులు ప్రారంభించినా అటవీశాఖ అనుమతులు లేకపోవడంతో పనులు అర్థ్ధంతరంగా ఏడాదిన్నరపాటు నిలిచిపోయాయి. అటవీశాఖ అనుమతులు తీసుకుని తిరిగి పనులు ప్రారంభించారు. ఐదు సంవత్సరాలపాటు కేవలం 140 మీటర్ల పొడవున్న అలుగు మాత్రమే పూర్తిచేశారు. చెరువు కట్టను ఆనుకుని కరకట్ట నిర్మించేందుకు 8 అడుగుల లోతు వరకు గుంత తీసినా గట్టితనం రాలేదు. దీంతో పనులను పర్యవేక్షించేందుకు వచ్చిన జియాలజిస్టులు గట్టితనం వచ్చే వరకు గుంత తీయాలని చెప్పడంతో లోతుగా గుంత తీస్తే కట్ట తూలిపడుతుందని పనులను నిలిపేశారు. ఇలా గత రెండేళ్లుగా పనులు ఆగిపోయాయి.

 

గడువులు పెంచుకోవడంతోనే సరిపెడుతున్నారు...

ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు కాంట్రాక్టరు గడువు మీద గడువు పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పటికే నాలుగుసార్లు పెంచారు. గతేడాది డిసెంబరులో తీసుకున్న గడువు ముగియడంతో ఇటీవల చీఫ్ ఇంజినీర్లు పనుల పురోగతిని పరిశీలించి అనుమతులిచ్చారు. అయినా నేటికీ పనులు ప్రారంభం కాలేదు. వర్షాలు కురవక ముందే ప్రారంభించి ఉంటే వర్షపు నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉండేదని రైతులు భావించారు. పనులు చేయించడంలో ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పనులు నెమ్మదిగా సాగుతున్నాయని ఆరోపిస్తున్నారు.

 

పూర్తయితే...

ఈ ప్రాజెక్టు పూర్తయితే సుమారు 15 వందల ఎకరాలకు సాగునీరు అందుతుంది. దీంతోపాటు గిద్దలూరు నగర పంచాయతీతో పాటు 14 గ్రామాల ప్రజలకు తాగునీరు అందించే భైరేనిగుండాల ప్రాజెక్టుకు నీరు పుష్కలంగా చేరే అవకాశం ఉంది. చుట్టు పక్కలున్న చెరువులు, కుంటల్లోనూ నీరు చేరుతుంది

 

గడువులోగా పనులు పూర్తి చేస్తాం: నాగార్జునరావు, డీఈ, కంభం

గుండ్లమోటు ప్రాజెక్టు పనులు గడువులోగా పూర్తి చేయడానికి తనవంతు కృషి చేస్తాను. సాంకేతిక కారణాలతో పనులు ఆపేశారు. కాంట్రాక్టరు పనులు నిలిపారని నోటీసులు జారీ చేశా. ఇటీవల చీఫ్ ఇంజినీరు, ఎస్‌ఈ వచ్చి పనులను పరిశీలించారు. ఎలాంటి అడ్డంకులూ లేకుండా అనుమతులొచ్చాయి. వెంటనే పనులు ప్రారంభించి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top