ప్రజాస్వామ్యానికి పాతర..

ప్రజాస్వామ్యానికి పాతర.. - Sakshi


ప్రొద్దుటూరు మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక మళ్లీ వాయిదా

- పథకం ప్రకారం అధికారపార్టీ విధ్వంసం

- అడ్డుకోని పోలీసులు, అధికారులు

- విధ్వంసం సాకు చూసి ఎన్నిక వాయిదా

- ‘పై నుంచి’ ఆదేశాల మేరకే ప్రజాస్వామ్యం ఖూనీ

- వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రాచమల్లు ధ్వజం

- న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వెల్లడి




ప్రొద్దుటూరు టౌన్‌: వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరులో అక్షరాలా ప్రజాస్వామ్యానికి పాతరేశారు. సంఖ్యాబలం లేక ఓడిపోతామన్న భయంతో అధికార తెలుగుదేశం నాయకులు విధ్వంసం సృష్టించి మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక వాయిదాపడేలా చేశారు. టీడీపీ కౌన్సిలర్లు ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేస్తున్నా అక్కడే ఉన్న వందలమంది పోలీసులు ప్రేక్షక పాత్ర వహిం చారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అధి కారులు ఏకపక్షంగా వ్యవహరించి ఎన్నికను వాయిదా వేశారు. ఎన్నికల అధికారి, జమ్మలమడుగు ఆర్డీవో వినాయకం స్వేచ్ఛగా వ్యవహరించకుండా అధికారపార్టీ మనసెరిగి నడుచుకుని ఎన్నిక వాయిదాపడడానికి కారణమయ్యారు.



వైఎస్సార్‌సీపీ మద్దతిచ్చిన అభ్యర్థి మున్సిపల్‌ చైర్మన్‌ కారాదన్న ఒకే ఒక్క కారణంతో.. ఎక్కడో అమరావతిలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైఎస్సార్‌ జిల్లా వ్యవహారాలు చూస్తున్న మంత్రులు, ఎంపీలు ప్రొద్దుటూరు వ్యవహారంలో జోక్యం చేసుకున్నారని, వారి సూచనల మేరకే ఎన్నిక జరగకుండా అధికారులు వాయిదా వేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అధికారులు ముఖ్యమంత్రి తొత్తుల్లా మారారని, ఎన్నికను వాయిదా వేయించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి విమర్శించారు. దీనిపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నామని ఆయన తెలిపారు.



రెండురోజులు అదే తంతు..

ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో మున్సిపల్‌ చైర్మన్‌ ఉండేల గురివిరెడ్డి రాజీనామా అనంతరం రెండో చైర్మన్‌ అభ్యర్థిగా ఉన్న ఆసం రఘురామిరెడ్డికి పోటీగా విఎస్‌ ముక్తియార్‌ నిలబడ్డారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు 15వ తేదీన చైర్మన్‌ ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు ప్రయత్నించారు. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు విధ్వంసం సృష్టించడంతో వాయిదా వేశారు. ఆదివారం ఎన్నికల కమిషన్‌ ఆధ్వర్యంలో ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. 40 మంది కౌన్సిలర్లలో ముక్తియార్‌కి 25 మంది మద్దతు ఉంది. ఉదయం 10 గంటలకు విఎస్‌ ముక్తియార్‌ వర్గ కౌన్సిలర్లు 15 మంది, వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు 9 మంది, ఎక్స్‌ అఫీషియో మెంబర్‌ అయిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి కౌన్సిల్‌ సమావేశానికి వచ్చారు. కొద్ది సేపటికి మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ ఉండేల గురివిరెడ్డి హాజరయ్యారు. టీడీపీ కౌన్సిలర్లు 14 మంది అప్పటికే అక్కడికి చేరుకున్నారు.



పథకం ప్రకారం అధికారపార్టీ విధ్వంసం..

కౌన్సిల్‌ సమావేశానికి వచ్చిన టీడీపీ కౌన్సిలర్లు అకస్మాత్తుగా ఆందోళన మొదలు పెట్టారు. సభ్యుల చుట్టూ వేసిన కంచెను తొలగించాలని, పోలీసులు, ఎన్నికల అ«ధికారి డౌన్‌ డౌన్‌ అని నినాదాలు చేశారు. కుర్చీలను పగులగొట్టారు. టీడీపీ గ్యాలరీలో ఉన్న టేబుళ్లను నేలకు విసిరికొట్టారు. కేకలు వేస్తూ కంచెను తొలగించే ప్రయత్నం చేయడంతో కడప వన్‌టౌన్‌ సీఐ, ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుళ్లు, స్పెషల్‌ పార్టీ పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ గ్యాలరీలోకి మఫ్టీలో ఉన్న పోలీసు అధికారులు వెళ్లడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల అధికారి వినాయకం, అబ్జర్వర్‌ జాయింట్‌ కలెక్టర్‌ శ్వేతతెవతీయ చూస్తూ ఊరుకుండిపోయారు.



బందోబస్తులో ఉన్న డీఎస్పీలు, సీఐలు ఎన్నికల అధికారిని కలిసి మీరు ఆదేశిస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. అయితే ఆయన ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. టీడీపీ గ్యాలరీలో ఉన్న ముక్తియార్‌ వర్గ కౌన్సిలర్లు ఏడుగురిని పోలీసు అధికారులు గ్యాలరీ బయట కూర్చోబెట్టారు. సంఖ్యాబలం ఉన్నవారు ఎన్నికయ్యేలా చూడాలని, ఎన్నిక జరిగేలా చూసి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఎన్నికల అధికారి, అబ్జర్వర్‌కు దండంపెట్టి వేడుకున్నారు. 27 మంది సభ్యులు సంతకాలు పెట్టారని, కోరం ఉన్నా ఎందుకు సమావేశం నిర్వహించరని ప్రశ్నించినా ఎన్నికల అధికారి నుంచి ఎలాంటి సమాధానమూ లేదు. మీరు ఎవరి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నారో తమకు తెలుసునని, సంఖ్యాబలం ఉన్నవారికి అన్యాయం చేస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని ఎమ్మెల్యే హెచ్చరించినా ఆయన స్పందించలేదు.



పై నుంచి వచ్చిన సూచనల మేరకే...

టీడీపీ కౌన్సిలర్లకు అధికార పార్టీ నేతల నుంచి ఫోన్లు వచ్చాయి. విధ్వంసం సృష్టించి అయినా సభను వాయిదా వేయాలని పైనుంచి వారికి సూచనలు అందాయని వినిపిస్తోంది. అప్పుడే జాయింట్‌ కలెక్టర్‌కు కూడా ఫోన్‌ రావడంతో ఆమె  గ్యాలరీ బయటికి వచ్చారు. అప్పటి వరకు కంచెకు అడ్డుగా ఉన్న పోలీసులు ఒక్క సారిగా సమావేశం హాల్‌ నుంచి బయటికి వెళ్లారు. అందరూ చూస్తుండగానే టీడీపీ కౌన్సిలర్లు కంచెను నేలకు తోసేశారు.



కౌన్సిలర్‌ తలారి పుల్లయ్య ఎన్నికల అధికారి, కమిషనర్‌ టేబుళ్లను కిందకు తోసి, మైక్‌ను విరిచారు. మైక్‌కు ఉన్న వైర్‌ను తీసుకుని మెడకు బిగించుకుని వెంటనే సమావేశాన్ని వాయిదా వేయాలని ఎన్నికల అ«ధికారిని చుట్టుముట్టారు. ఒకానొక దశలో ఎన్నికల అధికారిని తోసివేయడం కనిపించింది. అయినా ఆయన పోలీసులకు ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేదు. దీంతో పోలీసులు చూస్తుండిపోయారు. చివరకు ఆయన మైక్‌ను తీసుకుని శాంతి భద్రతల సమస్య ఏర్పడింది, సభను వాయిదా వేస్తున్నామని ప్రకటించారు. దీంతో టీడీపీ కౌన్సిలర్లు చప్పట్లు కొడుతూ ఎన్నికల అ«ధికారికి కృతజ్ఞతలు తెలిపారు.



చెప్పుతో కొట్టుకుని ...

‘‘అధికారులు చేస్తున్న ఈ దుర్మార్గ పనులను చూసి భరించలేను. ఇందుకు మిమ్మల్ని శిక్షించలేక, నన్ను నేను శిక్షించుకుంటున్నా... ఇది నా సంస్కారం. దీన్ని చూసి అయినా మీలో మార్పురావాలి. అందుకే నన్ను నేను చెప్పుతో కొట్టుకుంటున్నా’ అని ఎమ్మెల్యే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చర్యకు పాల్పడటంతో వైఎస్సార్‌సీపీ ఫ్లోర్‌లీడర్‌ మురళీధర్‌రెడ్డితోపాటు ఎమ్మెల్యే సతీమణి రాచమల్లు రమాదేవి, కౌన్సిలర్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనిని చూసిన పోలీసు అధికారులు, ఇతర శాఖల అధికారులు నిశ్చేష్టులయ్యారు.



ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు ఖూనీ చేశారు: రాచమల్లు

వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక రెండో సారి వాయిదా వేసి పట్టపగలే అధికార పార్టీ నాయకులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు ఆదేశాలను చైర్మన్‌ అభ్యర్థి వీఎస్‌ ముక్తియార్‌ పాటించలేదని, మెజారిటీ సభ్యులు 26 మందితో కోరం ఉన్నా చైర్మన్‌ ఎన్నిక వాయిదా వేశారన్నారు. తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు వీధి రౌడీల్లా వ్యవహరిస్తే ఆర్డీఓ, కలెక్టర్, పోలీసులు అందరూ చంద్రబాబు నాయుడు తొత్తులుగా వ్యహరించారన్నారు. ఈ దౌర్భాగ్య ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నంత కాలం రాజకీయాల్లో మనుగడ కొనసాగించడానికి తన మనసు ఇష్టపడటం లేదన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top