టీచర్లకు ఆన్‌లైన్ తిప్పలు!

టీచర్లకు  ఆన్‌లైన్ తిప్పలు!


విద్యార్థులపై రూ.25 లక్షల భారం

ఖర్చుపై స్పష్టతనివ్వని  {పభుత్వం


 

 

విశాఖపట్నం :  పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే వారి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడానికి టీచర్లు కుస్తీలు పడుతుండగా, విద్యార్థులకు ఖర్చు భారమవుతోంది. ప్రభుత్వం మునుపెన్నడూ లేనివిధంగా ఈ ఏడాది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలన్న నిబంధన విధించింది. ఇందులోభాగంగా మాన్యువల్‌లో నామినల్ రోల్సు, తర్వాత ఐసీఆర్ షీట్లు రాయాలి. వీటి ఆధారంగా ఆన్‌లైన్‌లో బీఎస్‌ఈఏపీ.ఇన్‌లోకి వెళ్లి అప్లికేషన్ తెరవాలి. అందులో విద్యార్థి, తండ్రి పేరు, పుట్టిన తేది, కులం, పుట్టుమచ్చలు తదితర వివరాలతో పాటు విద్యార్థి ఫొటో, సంతకం అప్‌లోడ్ చేయాలి. దీనిని సబ్‌మిట్ చేశాక ప్రింటవుట్ తీసుకోవాలి. వెబ్‌సైట్ తెరవడానికి ఆయా హైస్కూళ్లకిచ్చిన యూజర్ నంబరును పాస్‌వర్డ్‌గా ఉపయోగించి లాగిన్ అవ్వాలి. ప్రింటవుట్ (డిక్లరేషన్)పై విద్యార్థి, హెడ్మాస్టర్ల సంతకాలతో అధికారులకు సమర్పించాలి. నెట్ సెంటర్లలో ఇదంతా ఆన్‌లైన్‌లో నమోదుకు రూ.10లు, విద్యార్థి ఫొటో, సంతకం స్కానింగ్‌కు కనీసం రూ.10లు తీసుకుంటున్నారు. ఇలా ఒక్కో విద్యార్థికి అర్బన్‌లో రూ.30లు, పల్లెల్లో రూ.50ల వరకు భారమవుతోంది. కొంతమంది టీచర్లు ఇదే అదనుగా దనంగా పిల్లల నుంచి వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ స్కూళ్లలో చదివే వారిలో అత్యధికులు పేద, మధ్య తరగతి వారే. వీరిపై ప్రభుత్వం ఆన్‌లైన్ పేరిట అదనపు భారం మోపుతోంది.



నెట్ సెంటర్ల చుట్టూ ప్రదక్షిణలు : మరోవైపు పూర్తిచేసిన అప్లికేషన్లతో టీచర్లు నెట్  సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. పట్టణాలో ఇంటర్నెట్ సెంటర్లు అందుబాటులో ఉంటున్నాయి. కానీ గ్రామీణ ప్రాంతాల  వారికి మాత్రం చుక్కలు కనబడుతున్నాయి. ఏజెన్సీలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అవి ఎప్పుడు పనిచేస్తాయో, ఎప్పుడు పనిచేయవో దేవుడికే ఎరుక. నెట్ సెంటర్లున్నా నెట్ కనెక్టవడం లేదు. దీంతో ఎక్కడకెళ్లాలో తెలియడం లేదు. అలాంటి చోట్ల ‘ఈ ఆన్ లైన్’ తతంగం పెద్ద ప్రహసనంగా మారింది. పది రోజుల నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతోంది. డిసెంబర్ మూడులోగా ఆన్‌లైన్ ప్రక్రియను పూర్తిచేసి డీఈవో కార్యాలయానికి  సమర్పించాల్సి ఉంది.

 పడకేసిన కంప్యూటర్లు : జిల్లాలోని 497 హైస్కూళ్లకు రూ.కోట్లు వెచ్చించి గతంలోనే కంప్యూటర్లు మంజూరు చేశారు. కొన్ని స్కూళ్లకు ప్రింటర్లు, యూపీఎస్‌లూ ఇచ్చారు. చాలా చోట్ల అవి పడకేశాయి. పైగా వీటికి నెట్ సదుపాయం కల్పించలేదు. దీంతో అవి విద్యార్థులకు అక్కరకు రాక బయట నెట్ సెంటర్లను ఆశ్రయించాల్సి వస్తోంది. జిల్లాలో ప్రభుత్వ స్కూళ్లలో దాదాపు 60 వేల మంది పిల్లలు పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నారు. ఈ లెక్కన వీరిపై రూ.25 నుంచి 30 లక్షల వరకు ‘ఆన్‌లైన్’ భారం పడుతుందని అంచనా.

 

ఆఫ్‌లైనూ ఉంది

 టెన్త్ పిల్లలు ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం వీలు కల్పించింది. ఆన్‌లైన్ భారం అనుకున్న వారు ఈ నెల 30లోగా ఆఫ్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విషయాన్ని హెడ్మాస్టర్లు, ఎంఈవోలకు స్పష్టం చేశాం. ఆన్‌లైన్‌కయ్యే ఖర్చుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. అందువల్ల భారమైనా ఆ ఖర్చును విద్యార్థులు భరించక తప్పదు.

 - ఎం.వి.కృష్ణారెడ్డి, డీఈవో

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top