వెట్టిచాకిరి నుంచి విముక్తి


గూడూరు/చిల్లకూరు: వెట్టిచాకిరిలో మగ్గుతున్న గిరిజనులను అధికారుల కాపాడారు. ఈ ఘటన చిల్లకూరు మండలం నర్రవారిపాళెంలో చోటుచేసుకుంది. కొన్నేళ్ల నుంచి ఓ భూస్వామి ఆ గ్రామంలోని గిరిజన కుటుంబాలను బెదిరిస్తూ వెట్టిచాకిరి చేయించుకుంటున్నాడు. ఆ కుటుంబంలోని ఓ బాలికను లైంగిక వేధింపులకు గురిచేశాడు. ఆ బాధలు భరించలేని బాలిక గూడూరులో దిక్కుతోచక తిరుగుతుండటం గమనించిన ఏఆర్డీ సంస్థకు చెందిన కేర్‌టేకర్ హైమావతి చేరదీసి విషయం ఆరా తీశారు.

 

  యానాది సమాఖ్య కార్యకర్త బండి పుట్టయ్య ద్వారా ఏఆర్డీ సంస్థ నిర్వాహకుడు బషీర్‌కు బాలికను అప్పగించారు. దీంతో పూర్తిస్థాయి వివరాలను తెలుసుకున్న బషీర్ శనివారం సాయంత్రం బాలికతో పాటు గూడూరు ఆర్డీఓ రవీంద్ర, డీఎస్పీ శ్రీనివాస్, చిల్లకూరు రెవెన్యూ, పోలీసు అధికారులతో నర్రావారిపాళేనికి చేరుకున్నారు. అక్కడ వెట్టిచాకిరిలో ఉన్న నాలుగు కుటుంబాలను విచారించగా భూస్వామి కాల్తిరెడ్డి సుబ్రమణ్యం దౌర్జన్యం వెలుగులోకి వచ్చింది. బాలికపై లైగింక వేధింపులకు పాల్పడుతూ గూడూరులోని అతని ఇంటి వద్దే ఉంచుకున్నాడని భోరున విలపించారు. వెంటనే వారిని అక్కడి నుంచి గూడూరుకు తరలించారు. అయితే ఆ కుటుంబాల్లోని సుహాసిని, వెంకటేశ్వర్లు, బంగారి, రాములమ్మ అనే చిన్నారులను సుబ్రమణ్యం అక్కడి నుంచి వేరేచోటుకు తరలించాడని గిరిజనులు అధికారుల ఎదుట వాపోయారు. దీంతో వారిని కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేపట్టారు. వారి వెంట ఎస్సై అంకమ్మ, డీటీ రామ్మోహన్‌రావు, ఏఆర్డీ సంస్థ డెరైక్టర్ బషీర్ ఉన్నారు.

 

 భూస్వామిపై చట్టపరమైన చర్యలు

 ఆర్డీఓ రవీంద్ర తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ నర్రవారిపాళెంలో నాలుగు కుటుంబాల వారు వెట్టిచాకిరిలో మగ్గుతున్నట్లు ఏఆర్డీ సంస్థ ద్వారా తెలియడంతో అక్కడి వెళ్లి వారిని విడిపించామన్నారు. వెట్టిచాకిరిలో మగ్గుతున్న వెలుగు చెంచయ్య, ఉయ్యాలమ్మ, వెంకటమ్మ, గంగమ్మ, నాగమణి, పెంచలమ్మతో పాటు మానికల చెంచుకృష్ణయ్య అనే చిన్నారులను తీసుకొచ్చామన్నారు. వీరి పరిస్థితి దారుణంగా ఉండడంతో భూస్వామిపై వెట్టిచాకిరి, బాలకార్మికచట్టం, లైంగిక వేధింపులకు పాల్పడడంతో నిర్భయ చట్టాలను అమలు చేసేలా కేసులు నమోదు చేస్తామన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top