ఇకపై పోలీసు పరీక్షల్లో ప్రిలిమ్స్, మెయిన్స్

ఇకపై పోలీసు పరీక్షల్లో ప్రిలిమ్స్, మెయిన్స్ - Sakshi


పరీక్షలూ ఆబ్జెక్టివ్ తరహాలోనే

5 కిలోమీటర్ల పరుగు రద్దు




హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అమల్లోకి తీసుకువచ్చిన పోలీసు ఎంపిక ప్రక్రియలో సమూల మార్పులు తీసుకు వస్తున్నారు. ఇందులో భాగంగా ఇకపై పోలీసు ఎంపిక పరీక్షల్లో స్క్రీనింగ్ టెస్ట్‌గా ఉన్న 5 కిలోమీటర్ల పరుగు పందాన్ని తొలగించాలని రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్ణయించింది. దీని స్థానంలో ప్రిలిమ్స్‌ను నిర్వహించనున్నారు. దీంతో పాటు అనేక కీలక సంస్కరణలతో కూడిన ఫైలు హోం శాఖ నుంచి సాధారణ పరిపాలన విభాగానికి చేరింది. వీటిపై ప్రభుత్వానికి ఉన్న సందేహాలను తీర్చడం కోసం ఎంపిక బోర్డు చైర్మన్ అతుల్ సింగ్ మంగళవారం సచివాలయంలో జీఏడీ అధికారులతో భేటీ అయ్యారు. ప్రభుత్వ ఆమోదం లభిస్తే ఇకపై జరిగే అన్ని రిక్రూట్‌మెంట్స్‌ను ఇదే తరహాలో చేపట్టనున్నారు.



రిక్రూట్‌మెంట్‌లో స్క్రీనింగ్ పరీక్షగా ఉన్న 5 కిలోమీటర్ల పరుగు అనేక విమర్శలకు తావిస్తోంది. ఇందులో పాల్గొన్న అనేక మంది అభ్యర్థులు గాయపడటం, మరణించడం వంటి అపశ్రుతులు చోటు చేసుకున్నారు. వీటిని పరిగణలోకి తీసుకున్న అధికారులు దీన్ని పూర్తిగా తొలగించాలని నిర్ణయించారు.

ఆబ్జెక్టివ్ తరహాలో ఉండే ప్రిలిమ్స్‌ను స్క్రీనింగ్ పరీక్షగా నిర్వహించిన తర్వాత దేహదారుఢ్య పరీక్షలతో పాటు ఈవెంట్స్ నిర్వహిస్తారు. వీటిలో క్వాలిఫై అయిన వారికి మెయిన్స్ పరీక్ష పెడతారు. ప్రిలిమ్స్, మెయిన్స్ రెండూ ఆబ్జెక్టివ్ తరహాలోనే ఉంటాయి.

కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకు వచ్చిన విధానంతో పాటు రాష్ట్రంలో నెలకొన్న మహిళా అధికారిణుల కొరత నేపథ్యంలో ఇకపై జరిగే పోలీసు రిక్రూట్‌మెంట్స్‌లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కచ్చితంగా అమలు చేయాలని, ఎంపిక విధానంలోనూ మహిళలకు కొన్ని వెసులుబాట్లు ఇవ్వాలని నిర్ణయించారు.

కేవలం శరీర దారుఢ్యమే కాకుండా మానసిక పరిపక్వత, సమస్యల్లో స్పందించే గుణాలను బేరీజు వేసేలా ఎంపిక ప్రక్రియను మారుస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చిన మానవహక్కులు, మహిళల రక్షణ తదితరాలకు రాతపరీక్షల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. సిలబస్‌లో పెద్దగా మార్పులు లేకుండా ఎంపిక విధానాల్లోనే మార్పులు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఫిజికల్ ఈవెంట్స్‌గా పిలిచే 100 మీటర్లు, 800 మీటర్ల పరుగు, హైజంప్, లాంగ్ జంప్ వంటి పరీక్షల్లోనూ పలు మార్పుచేర్పులు చేయనున్నారు. వీటిలో కొన్నింటిని తొలగించడంతో పాటు మరికొన్ని పరిధి తగ్గించాలని యోచిస్తున్నారు.

ఈ పరీక్షల్లో మానవ ప్రమేయం తగ్గించడం కోసం ఆర్‌ఎఫ్‌ఐడీ తరహా టెక్నాలజీలు వాడాలని నిర్ణయించారు. పరుగు మొదలు ప్రతి అంశాన్నీ సాంకేతికంగానే పరిశీలించి క్వాలిఫై అయ్యారా? లేదా? అనేది నిర్థారించనున్నారు.

టెక్నికల్ విభాగాలుగా పిలిచే పోలీసు కమ్యూనికేషన్స్, రవాణా విభాగం, వేలి ముద్రల విభాగాల్లో ఎంపిక ప్రక్రియను సాధారణ, ఆర్డ్మ్ రిజర్వ్ విభాగాల ఎంపిక ప్రక్రియలకు పూర్తి భిన్నంగా డిజైన్ చేస్తున్నారు. ఆయా టెక్నికల్ అంశాల్లో అభ్యర్థులకు ఉన్న సాంకేతిక అర్హతలు, సమకాలీన అంశాలపై ఉన్న పట్టును బేరీజు వేసేలా ఈ విభాగాల ఎంపిక ప్రక్రియ ఉండనుంది.

పోలీసు విభాగంలో డ్రైవర్‌గా ఎంపిక కావడానికి ప్రస్తుతం అభ్యర్థి లెసైన్స్ కలిగి ఉన్నా, లేకపోయినా వయోపరిమితి మాత్రం 18 నుంచి 21 ఏళ్ళుగా ఉంది. దీన్ని సవరించి 21 నుంచి 25 ఏళ్లకు మార్చుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top