ఇసుక ధర నియంత్రణకు రవాణాపై దృష్టి

ఇసుక ధర నియంత్రణకు రవాణాపై దృష్టి


తాడేపల్లి రూరల్

 డ్వాక్రా మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడుస్తున్న ఉండవల్లి ఇసుక క్వారీని సెర్ఫ్ అదనపు సీఈవో వీరపాండ్యన్ (ఐఏఎస్) శుక్రవారం పరిశీలించారు. ఈ క్వారీకి వచ్చిన ఆయన తొలుత ఇసుక లోడింగ్, అన్‌లోడింగ్ విధానాన్ని పరిశీలించారు. ఇసుక సరఫరా విషయంలో అక్రమాలు, అవకతవకలకు పాల్పడితే ఎంతటి వారిపైనైనా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నిబంధనల ప్రకారం ఇసుకను సరఫరా చేస్తున్నామని డ్వాక్రా మహిళలు, అధికారులు అదనపు సీఈవోకు తెలిపారు.



రవాణా విషయమై లారీలు, ట్రాక్టర్‌ల యజమానులను.. మీరు ఎందుకు ఎక్కువ రేటుకు అమ్ముతున్నారని వీరపాండ్యన్ ప్రశ్నించారు. ఏం చేయాలిసార్, ఇసుక రీచ్‌కు వచ్చిన తర్వాత మూడు రోజులపాటు లోడింగ్ కోసం ఎదురు చూస్తున్నామని, డ్రైవర్, క్లీనర్‌ల ఖర్చులే రెండు వేలవుతున్నాయని, అదనంగా బేటా ఇవ్వాల్సివస్తోందన్నారు. ఇవన్నీ బేరీజు వేసుకుని ఇసుకను అధిక ధరకు చేరవేయాల్సివస్తోందని రవాణాదారులు వాపోయారు.



ఈ సందర్భంగా సీఈవో విలేకరులతో మాట్లాడుతూ ఇసుక క్వారీల్లో అక్కడక్కడ అవినీతి జరుగుతోందనే అరోపణలు వినిపిస్తున్నాయని, అవి తమ దృష్టికి రాలేదన్నారు. ఇసుక ధరను నియంత్రించేందుకు రవాణాను కూడా ప్రభుత్వమే చేపడుతుందన్నారు. ఇ ందుకుగాను వినియోగదారుని ఇంటికే ఇసుకను సరఫరా చేసేందుకుగాను టెండర్లు పిలిచామన్నారు. ఇకనుంచి ఆన్‌లైన్ ద్వారా ఇసుక సరఫరా చేస్తామన్నారు. దీంతో వినియోగదారుడు నష్టపోయే అవకాశంలేదన్నారు.



ఇక నుంచి ఇసుక కావలసిన వారు ఆన్‌లైన్‌తోపాటు మీ సేవలోనే నగదు చెల్లించాలని, రెండు మూడు రోజుల్లో ఈ విధానం అమల్లోకి వస్తుందని చెప్పారు. జిల్లాలో త్వరలో మరిన్ని ఇసుక క్వారీలు తెరవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. సెర్ఫ్ అదనపు సీఈవో వెంట డీఆర్‌డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ ప్రశాంతి, డీపీవో గ్లోరియా, ఏపీడీవో సుబ్రమణ్యం. మండల ఏపీవో సమాధానం, డ్వాక్రా మహిళలు తదితరులు ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top