మానవ అక్రమ రవాణాను అరికట్టాలి


ఒంగోలు క్రైం : మానవులను అక్రమంగా రవాణా చేయడం అత్యంత దారుణమని, దాన్ని పూర్తిగా అరికట్టాలని ఏఎస్పీ బి.రామానాయక్ పిలుపునిచ్చారు. బుధవారం మానవ అక్రమ రవాణా వ్యతిరేకదినం సందర్భంగా బాలల సంక్షేమ కమిటీ, హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాల్‌పోస్టర్‌ను స్థానిక జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో మంగళవారం ఆయన ఆవిష్కరించారు.



ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా వల్ల పలు ప్రాంతాల్లో బాలలు, మహిళలు బలైపోతున్నారని పేర్కొన్నారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగాల పేరిట ట్రాఫికింగ్ ఉచ్చులో పడి అనేక మంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

 

ఎన్నో ఆశలు చూపించి యువతులను ఇతర ప్రాంతాలకు తరలించి అమ్మకాలు, కొనుగోళ్లు జరుపుతున్నారని ఆవేదన చెందారు. చిన్నారులను కూడా తరలించి భిక్షాటన చేయిస్తున్నారని, యువతులను వ్యభిచారంలోకి దించుతున్నారని, పలువురి అవయవాలను కూడా అమ్ముతున్నారని ఏఎస్పీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు ముఖ్యంగా బాలలు, మహిళలను అప్రమత్తం చేయాలని కోరారు.

 

 అలాంటి ప్రయత్నంలో భాగంగా ఏర్పాటు చేసిన వాల్‌పోస్టర్ అనేకమందికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా బాలల సంక్షేమ సమితి, చైల్డ్‌లైన్ కృషిని అభినందించారు. కార్యక్రమంలో ఎస్‌బీ-2 సీఐ ఎన్.సత్యనారాయణ, డీసీఆర్‌బీ సీఐ రాయపాటి శ్రీనివాసరావు, ఎస్‌బీ-1 సీఐ టి.తిరుమలరావు, జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్మన్ బీవీ శివప్రసాద్, సభ్యులు ఎం.కిషోర్‌కుమార్, ఎం.బెంజిమన్, ఎం.ఆనంద్, ఎం.సంజనకుమారి, తదితరులు పాల్గొన్నారు.

 

నేడు ర్యాలీ...

ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలులో బుధవారం ర్యాలీ నిర్వహించనున్నట్లు బాలల సంక్షేమ సమితి, చైల్డ్‌లైన్ నిర్వాహకులు తెలిపారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టర్ విజయకుమార్ ప్రారంభిస్తారన్నారు. ర్యాలీ అనంతరం మిరియాలపాలెంలోని హెచ్‌సీఎం జూనియర్ కళాశాలలో సభ జరుగుతుందని వారు పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top