ప్రతిపనికీ కమీషన్

ప్రతిపనికీ కమీషన్ - Sakshi


సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అందులేదని..ఇందు వలదని..సందేహంబు వలదు. ఎందెందు వెతికినా అందందే కలదు అవినీతి. అన్న చందంగా నెల్లూరు నగరపాలక సంస్థలో అవినీతి రాజ్యమేలుతోంది. అందుకు శుక్రవారం వెలుగుజూసిన ఘటనే నిదర్శనం. నెల్లూరుకు చెందిన రాఘవేంద్ర అనే వ్యక్తి వద్ద లంచం తీసుకుని బతికున్నా చనిపోయినట్టు ధ్రువీకరణపత్రం జారీ చేయడం అధికారుల అవినీతికి పరాకాష్టగా మారింది. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో ఎటువంటి విచారణ జరుపకుండా.. మనిషి అవసరాన్ని బట్టి డబ్బులు తీసుకుని బతికున్న వారు మరణించినట్లు.. మరణించిన వారు బతికే ఉన్నట్లు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేస్తున్నారు.



ఎవరినైనా హత్యచేసి తప్పించుకోవాలంటే నెల్లూరు కార్పొరేషన్‌లో కొందరు అధికారులకు పెద్ద ఎత్తున ముడుపులు ముట్టజెబితే నిర్దోషిగా తప్పించుకోవచ్చనడానికి తాజా ఘటనే నిదర్శనం. ఇదొక్కటే కాదు సుమా.. పారిశుధ్య పనుల్లోనూ పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందనే ప్రచారం జరుగుతోంది. పారిశుధ్య కార్మికులకు ఇచ్చే వేతనాలను సైతం కొందరు అధికారులు జేబుల్లో వేసుకుంటున్నట్లు రాజేం ద్రబాబు (పేరు మార్చాము) అనే కార్మికుడు ‘సాక్షి’ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.



తనకు ఐదునెలలుగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని బోరుమన్నాడు. అదే విధంగా చెత్తను తరలించే ట్రాక్టర్ల ఖర్చు లెక్కల్లో చేతివాటం ప్రదర్శిస్తూ.. ఒకటి, రెండు ట్రక్కులతో తరలించి ఐదారు ట్రాక్టర్లతో తరలించినట్లు లెక్కలు చూపి సొమ్ముచేసుకుంటున్నట్లు అతని వివరించారు. అదే విధంగా కొందరు సిబ్బంది వాహనాలకు కొనుగోలు చేస్తున్న డీజిల్‌ను సైతం చోరీ చేస్తున్నట్లు తెలిసింది.



 టౌన్ ప్లానింగ్‌లో ఇష్టారాజ్యం

 టౌన్‌ప్లానింగ్‌లో అవినీతికి హద్దే లేకుండా పోతోందనే ఆరోపణలు ఉన్నాయి. ఎవరైనా ఇల్లుకట్టుకోవాలనుకుని దరఖాస్తు చేసుకుంటే.. దరఖాస్తు చేసుకున్న మొద లు ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు స్థాయిని బట్టి ప్రతి అధికారి వసూలు చేసుకుంటున్నట్లు సమాచారం. అపార్ట్‌మెంట్ల అనుమతుల కోసం వచ్చే బిల్డర్ నుంచి ఏకంగా ప్లాట్లు డిమాండ్ చేస్తున్నట్లు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్లాటు బినామీ పేరుతో రాయించుకుని అనుభవిస్తున్నట్లు తెలిసింది. ఇకపోతే ఆస్తుల మార్టిగేజ్‌ను విడిపించటానికి నిబంధనలను పక్కని పెట్టి పెద్ద ఎత్తున ముడుపులు తీసుకుని జేబులు నింపుకుంటున్నారే ప్రచారం జరుగుతోంది.



ఇంజనీరింగ్ విభాగం విషయానికి వచ్చే సరికి... అభివృద్ధి పనుల్లో నాణ్యతకు తిలోదకా లు వదిలి పెద్ద ఎత్తున కమీషన్లు దండుకుంటున్నారు. నిధులు మంజూరు చేయాలంటే పర్సెంటేజీలు ఇచ్చుకోవాలి. ముఖ్యంగా రోడ్లు నిర్మాణాల్లో పెద్ద ఎత్తున అవి నీతి జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రోడ్ల నిర్వహణ పేరుతో రూ.లక్షలు దోచుకుంటున్నట్లు విమర్శలున్నాయి.



నెల్లూరు కార్పొరేషన్‌లో ప్రతి పనికీ కమిషన్... డబ్బులు ముట్టాక బిల్లులు మంజూరు చేస్తున్నారని ఇటీవల నగరంలో రోడ్డు మరమ్మతు పనులు చేపట్టి చేతులు కాల్చుకున్న ఓ బాధితుడు ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేషన్‌లో అవసరం లేకున్నా కాంట్రాక్ట్ పద్ధతిన పెద్ద ఎత్తున నియామకాలు జరిగినట్లు సమాచారం. అయితే సిబ్బందిని నియమించుకుని జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారు నెల్లూరు కార్పొరేషన్లో సుమారు 20 మందికిపైగా ఉన్నారు. కొత్తగా వచ్చిన కమిషనర్ అవినీతిని కట్టడి చేసే విషయంలో గట్టి చర్య లు తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది.



 బీసీ సంక్షేమ శాఖలో బదిలీలు

 నెల్లూరు (సెంట్రల్): జిల్లా బీసీ సంక్షేమ శాఖలో పని చేస్తున్న ఇద్దరిని బదిలీ చేశారు. గూడూరులో పనిచేస్తున్న ఏబీసీడబ్ల్యూఓ రమేష్‌ను నెల్లూరులోని బీసీ జిల్లా కార్యాలయానికి బదిలీ చేశారు. గుంటూరులో బీసీ సంక్షేమ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా ఉన్న షర్మిలను నెల్లూరుకు, నెల్లూరులో ఉన్న రామారావును ఒంగోలుకు బదిలీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.



 విద్యార్థులపై క్రిమినల్ కేసులు

 నెల్లూరు(క్రైమ్): స్కాలర్‌షిప్, ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసిన విద్యార్థి నేతలపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. కలెక్టరేట్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించారని, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారని తదితర కారణాలను కేసులో పేర్కొన్నారు. అరెస్ట్ చేసిన పి. కిరణ్, సుధీర్, రవి, ప్రసాద్, నాని, జనార్దన్, రాము, అశోక్, నందకిరణ్‌ను శనివారం కోర్టులో హాజరుపరచనున్నట్లు ఒకటో నగర ఇన్‌స్పెక్టర్ మద్ది శ్రీనివాసరావు తెలిపారు.



 ఉప రవాణా కమిషనర్ బదిలీ

 నెల్లూరు (దర్గామిట్ట): నెల్లూరులో రవాణాశాఖ ఉపకమిషనర్(డీటీసీ)గా పనిచేస్తున్న ఎ.మోహన్ కాకినాడకు బదిలీ ఆయ్యారు. ఆయన స్థానంలో కర్నూలు డీటీసీ శివరామ్‌ప్రసాద్ నియమితులయ్యారు. శుక్రవారం రాత్రి జిల్లా రవాణా శాఖ కార్యాలయానికి ఉత్తర్వులు అందాయి. శివరామ్ ప్రసాద్ రెండు రోజుల్లో నెల్లూరులో బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top