మాజీ మంత్రి పీఆర్ కేసు తీర్పుపై ఉత్కంఠ


జమ్మలమడుగు:

 మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి జంట హత్యకేసులకు సంబంధించిన తీర్పుపై ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గత నెల 21వతేదీన సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణలో తీర్పు వెలువడుతుందని భావించారు. కానీ సెప్టెంబర్18కి వాయిదా వేశారు. గురువారం సుప్రీంకోర్టులో విచారణతోపాటు తీర్పు వెలువడుతుందని అందరూ భావించారు. అయితే కోర్టు ఈ కేసును తిరిగి నవంబర్ 12,13వతేదీలకు వాయిదా వేసింది.పట్టణంలో భారీగాపోలీసు బలగాల మోహరింపు..మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డికి సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో విచారణకు రావడంతో పట్టణంలో భారీగా పోలీసు బలగాలతోపాటు సబ్‌డివిజన్‌లోని ఎస్‌ఐలు పట్టణంలో మోహరించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లు సంజామలమోటు, పలగాడివీధి, పాతబస్టాండ్, మోరగుడి మూడు రోడ్లు తదితర ప్రాంతాల్లో పోలీసులను మోహరించారు. పట్టణంలో ఎటువంటి సంఘటనలు జరగకుండా ఏఎస్పీ వెంకట అప్పలనాయుడు పట్టణంలో తిరుగుతూ పహారా కాశారు. ముందస్తుగా బాష్ఫవాయువు ప్రయోగించే వజ్ర వాహనాన్ని తీసుకొచ్చారు. వంద మందికి పైగా స్పెషల్ పోలీసులు, చుట్టూ పక్కల పోలీసు స్టేషన్‌లనుంచి సివిల్ పోలీసులను బందోబస్తుకు ఏర్పాటు చేశారు.

 1990 లో జడ్చర్లలోని షాద్‌నగర్‌లో దేవగుడి శంకర్‌రెడ్డి,లక్కిరెడ్డి గోపాల్‌రెడ్డిలను హత్య చేశారు. ఈహత్య కేసులో11మంది నిందితులుగా ఉన్నారు. అందులో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి నిందితుడుగా ఉండటంతో 2004లో నాంపల్లి కోర్టు జడ్జి దోషిగా పేర్కొంటూ తీర్పునిచ్చారు. దీంతో మాజీ మంత్రి హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఇద్దరు జడ్జిలతో కూడిన ధర్మాసనానికి అప్పగించింది. జడ్జిలు భాను,మినాకుమారిలతో కూడిన ధర్మాసనం తీర్పును చెరోరకంగా ఇచ్చారు. దీంతో హైకోర్టు జడ్జి బిలాల్ న క్వీ రామసుబ్బారెడ్డి హత్యకేసులో నిర్దోషి అంటూ తీర్పు నిచ్చారు. దీనిపై స్థానిక శాసనసభ్యుడు  ఆదినారాయణరెడ్డి 2008లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2009 లో ప్రత్యేక ధర్మాసనంలో పిటిషన్ అడ్మిట్ అయింది. అప్పటి నుంచి ఈ కేసు నడుస్తోంది.







 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top