చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి


విజయనగరం (బొబ్బిలి): విజయనగరం జిల్లా బొబ్బిలి పురపాలక సంఘం మరో ప్రయోగం చేసి విజయం సాధించింది. ఇప్పటికే చెత్తను సద్వినియోగం చేయడంలో రాష్ట్రంలో ముందంజలో ఉండగా... అదే చెత్తతో గ్యాస్ తయారు చేసి దాని ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపట్టింది. గత కొద్ది రోజులుగా ప్రయోగాత్మకంగా చేపట్టిన విద్యుత్ ఉత్పత్తి విజయవంతం కావడంతో ఇప్పుడు సమీపంలో ఉన్న గిరిజన గ్రామాన్ని దత్తత తీసుకొని విద్యుత్ సరఫరా చేయాలన్న యోచనలో అధికారులున్నారు. 13వ ఆర్థిక సంఘ నిధులతో 2010లో బొబ్బిలి పురపాలక సంఘంలో చెత్తశుద్ధి పార్కును నిర్మించారు. ఆ పార్కులో పట్టణం నుంచి వచ్చిన వ్యర్థాల ద్వారా వర్మీకంపోస్టు, గోబర్ గ్యాస్ తయారు చేయడంతో పాటు వ్యర్థాల అమ్మకం ద్వారా ఆదాయం పొందుతున్నారు. ఇక్కడ ఏడు పిట్‌ల ద్వారా గోబర్ గ్యాస్ ఉత్పత్తిని ఐదేళ్ల కిందటే ప్రారంభించారు. ఆ గ్యాస్‌తోనే అక్కడ కార్మికులు వంటా వార్పులు చేస్తుండేవారు.



ఇప్పుడు అదే గ్యాస్‌కు డీజిల్‌ను అనుసంధానం చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఒక్కొక్క పిట్‌లో 50 కేజీల పేడ, 50 కేజీల వ్యర్థాల నీటిని కలిపి వేస్తారు. ఈ రకంగా ఉత్పత్తి అయిన గ్యాస్‌లో 70 శాతానికి డీజిల్‌ను అనుసంధానం చేయడం ద్వారా 1600 వాట్స్ విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. డీజిల్ వినియోగ పరంగా లెక్కకడితే.. గోబర్‌గ్యాస్‌తో పాటు ఒక లీటరు డీజిల్ ద్వారా మూడు గంటల పాటు విద్యుత్ సరఫరా చేయవచ్చు. ఈ విధంగా ఉత్పత్తి అయిన విద్యుత్ ద్వారా 40 లైట్లను వినియోగించడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం సోలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంటు పార్కులో 14 వరకూ లైట్లు ఉన్నాయి. వాటికి పూర్తి స్థాయిలో విద్యుత్‌ను అందిస్తూనే మరో వైపు మిగులు విద్యుత్‌ను పక్కనున్న రామందొరవలస గిరిజన గ్రామానికి ఇవ్వాలని యోచిస్తున్నారు. ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేస్తే విద్యుత్ ఆదా పెరిగి గిరిజన గ్రామంలో ఇళ్లకు కూడా విద్యుత్తు ఇవ్వవచ్చని మునిసిపల్ అధికారులు భావిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top