అభిమాన ‘పవనం'

అభిమాన ‘పవనం' - Sakshi


శ్రీజను పరామర్శించి కంటతడి పెట్టిన పవర్‌స్టార్

ఆమె కోలుకున్న తర్వాత మళ్లీ చూస్తానని నటుడు పవన్ హామీ


 

ఖమ్మం: ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ శుక్రవారం ఖమ్మం చేరుకొని, తనను అమితంగా అభిమానించే బాలిక శ్రీజ(13)ను పరామర్శించారు. బ్రెయిన్ ఫీవర్‌తో బాధ పడుతూ కోమాలో ఉన్న శ్రీజ పవన్‌ను చూడాలని కోరుకున్న విషయం విదితమే. దీంతో శుక్రవారం రాజమండ్రి నుంచి మధ్యాహ్నం రోడ్డుమార్గంలో ఖమ్మం చేరుకున్న ఆయన గంటకుపైగా శ్రీజ చికిత్స పొందుతున్న గదిలో ఉండి తల్లిదండ్రులను, శ్రీజను పరామర్శించారు. ఈ పరిస్థితిలోనూ శ్రీజ తనను చూడాలని కోరుకోవడం తన పూర్వజన్మ సుకృతమని, శ్రీజ పూర్తిస్థాయిలో ఆరోగ్యంగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఆమె తల్లిదండ్రులు నాగయ్య, నాగమణిలతో ఆప్యాయంగా మాట్లాడి కుటుంబ పరిస్థితులను, శ్రీజ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు. ఆమెకు చికిత్స చేస్తున్న డాక్టర్ అసాధారణ్‌ను శ్రీజకు సంబంధించిన కేస్‌షీట్‌ను, ఇతర రిపోర్టుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. శ్రీజ పరిస్థితిని చూసి చలించిన పవన్ కంటతడి పెట్టారు.



శ్రీజకు ఆత్మీయంగా దగ్గరకు వెళ్లి ఆమె తనను గుర్తు పట్టలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ అమ్మా.. నేను పవన్ కల్యాణ్‌ను వచ్చానంటూ చెవిలో పదేపదే చెప్పి ఉద్విగ్నతకు లోనయ్యారు. పవన్ కల్యాణ్ తన కూతురును పరామర్శించడానికి రావడం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. శ్రీజ పూర్తిగా కోలుకున్న తర్వాత మరోసారి వచ్చి కలుస్తానని చెబుతూ.. ఆమెకు వినాయకుడి వెండి ప్రతిమను అందజేశారు.



పవన్ వాహనాన్ని ఢీకొట్టిన మరో వాహనం..



 పవన్‌కల్యాణ్ ఖమ్మం వస్తుండగా కొణిజర్ల మండలం శాంతినగర్ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని కాన్వాయ్‌లోని మరో వాహనం ఢీకొట్టింది. దీంతో ఆ వాహనం స్వల్పంగా దెబ్బతినగా పవన్ కొద్ది నిముషాలపాటు ఆగి పరిస్థితిని సరిదిద్ది తిరిగి ప్రయాణమయ్యారు. పవన్ ఖమ్మం వస్తున్నారని ముందుగానే ప్రచారం కావడంతో అభిమానులు పెద్దఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఆస్పత్రిలో ఉన్న గోడ కూలి ఇద్దరికి స్వల్పంగా గాయాలవగా, మరో అభిమాని తలకు కూడా గాయమైంది. తనకోసం దాదాపు గంటసేపు ఆస్పత్రి వద్ద వేచి ఉన్న అశేష అభిమానులకు పవన్ అభివాదం  చేస్తూ ముందుకు కదిలారు. ఈ సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ అభిమానుల అత్యుత్సాహాన్ని అదుపు చేయలేకపోయారు. దీంతో కొందరు అభిమానులు పవన్ కల్యాణ్‌ను చూడలేకపోయినా పోలీసుల లాఠీ దెబ్బలను మాత్రం రుచిచూశారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top