ఖర్చు కోటిన్నర..ఫలితం అరకొర


 విజయనగరం మున్సిపాలిటీ : జిల్లాలో తుపాను ప్రభావంతో నిలిచిపోయిన విద్యుత్ సరఫరాను నేటికీ పునరుద్ధరించలేదు. నష్ట నివారణ చర్యల్లో భాగంగా విద్యుత్ శాఖ సోమవారం నాటికి సుమారు కోటిన్నర రూపాయలు ఖర్చు చేసింది. అయినా ఆశించిన మేర ఫలితం కనిపించటం లేదు. ఇప్పటికీ జిల్లా వాసులు అంధకారంలోనే మగ్గుతున్నారు. భారీ ఎత్తున యంత్ర పరికరాలు, ఇతర జిల్లాల నుంచి సిబ్బందిని, పనివారిని తెప్పిస్తున్నా కొన్ని ప్రాంతాలకు మాత్రమే సరఫరాను పునరుద్ధరించగలిగారు. దీంతో జిల్లా వాసులు ప్రభు త్వ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.  

 

 ముఖ్యులందరూ జిల్లాలోనే...

 ఓ వైపు రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, పలు శాఖలకు చెందిన రాష్ట్ర మంత్రులు, ట్రాన్స్‌కో, ఏపీఈపీడీసీఎల్ సీఎండీలు, వివిధ జిల్లాలకు చెందిన ఎస్‌ఈలు, డీఈలు గత నాలుగు రోజులుగా జిల్లాలోనే మకాం వేసినా ప్రయోజనం కనిపించటం లేదు. ఇదే విషయంపై ఏపీఈపీడీసీఎల్ సీఎండీపై మంత్రులు ఆదివారం రాత్రి జరిగిన సమీక్షలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తుపాను బారిన పడిన విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో ఆశించిన స్థాయిలో పునరుద్ధరణ పనులు జరుగుతున్నా విజయనగరం జిల్లాలో ఎందుకు జరగటం లేదని నిలదీశారు.

 

 సమాచారం చెప్పేందుకూ నిరాకరణ...

 సోమవారం నాటికి జిల్లా వ్యాప్తంగా అసలు ఎంతవరకు సరఫరాను పునరుద్ధరించగలిగారన్న సమాచారాన్ని తెలియజెప్పేందుకు జిల్లా అధికారులు నిరాకరిస్తున్నారు. కార్యాలయాలకు వెళితే అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లారని పలువురు సిబ్బంది చెబుతుండగా.. ఫోన్లు చేసినా స్పందించని పరిస్థితి ఉంది. అంధకారంలో నరకయాతన భరించలేక పట్టణంలోని అయ్యకోనేరు వాసులు సోమవారం సాయంత్రం అధికారులు నిలదీసేందుకు స్థానిక దాసన్నపేట విద్యుత్ భవనం వద్దకు వెళ్లినా అక్కడ ఒక్కరూ కనిపించలేదు.

 

 11 రోజులుగా చీకట్లోనే...

 ఈ నెల 11వ తేదీ అర్ధరాత్రి నుంచి నిలిచిపోయిన విద్యుత్ సరఫరా ఇప్పటివరకు కొన్ని ప్రాంతాలకే పునరుద్ధరించారు. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలతో పాటు పలు మండల కేంద్రాల్లో సరఫరాను పునరుద్ధరించినట్లు తెలుస్తోంది. విజయనగరం పట్టణంలో 50 శాతం ప్రాంతాలకే సరఫరా పునరుద్ధరించారు. అధికారులు మాత్రం పునరుద్ధరణ పనులు 70 శాతం వరకు పూర్తయ్యాయని చెబుతున్నారు. జిల్లాలో 921 పంచాయతీల్లో ఇదే పరిస్థితి నెలకొనటంతో జనం ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయి.

 

 నిధుల వినియోగంపై ఆరోపణలు...

 విద్యుత్ శాఖ అధికారులు చేపడుతున్న నష్ట నివారణ చర్యల్లో భాగంగా నిధుల వినియోగంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పనుల కోసం గత ఐదు రోజుల వ్యవధిలో కోటిన్నర రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం. వివిధ ప్రాంతాల నుంచి తెప్పించిన వాహనాలు, సిబ్బంది భోజనాలు, కూలీల వేతనాలకు ఈ ఖర్చు అయినట్లు తెలుస్తోంది. నిధులు ఖర్చు చేసే బాధ్యతను క్షేత్రస్థాయిలో నోడల్ అధికారులకు అప్పగించారు.

 

 ఇంతవరకు బాగానే ఉన్నా తక్కువ కూలీలను పెట్టి ఎక్కువ చూపించటం, ఓవైపు తిరుగుతున్న వాహనాలకు ఇంకో ప్రాంతంలోనూ బిల్లులు పెట్టడం, తక్కువ మంది సిబ్బంది పనిచేసినా ఎక్కువ మంది చేస్తున్నట్లు చూపించటం వంటి అవకతవకలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top