అంధకారం ముంగిట తెలంగాణ, ఆంధ్రప్రదేశ్

అంధకారం ముంగిట తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ - Sakshi


సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను విద్యుత్ సమస్య తరుముకొస్తోంది! తీవ్ర కొరతతో రెండు రాష్ట్రాలూ అంధకారం ముంగిటకు చేరుకుంటున్నాయి. విద్యుత్ ఉత్పత్తిలో కీలకమైన థర్మల్ కేంద్రాలన్నీ మూతపడే స్థితికి చేరుకున్నాయి. కారణం తీవ్ర బొగ్గు కొరత. దాదాపు అన్ని ప్లాంట్లలోనూ బొగ్గు నిండుకుంది. కనీసం పక్షం రోజులు నడిపేందుకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండాల్సిన విద్యుత్ కేంద్రాల్లో ఇప్పుడు ఒక్క రోజుకు సరిపోయే బొగ్గు కూడా ఉండటం లేదు. ఇరు రాష్ట్రాల్లోని చాలా వరకు థర్మల్ కేంద్రాల పరిస్థితి ఇంతే! దీంతో బొగ్గు వస్తేనే విద్యుత్ ఉత్పత్తి కొనసాగే అవకాశముంది. ఇప్పటికే పలు విద్యుత్ ప్లాంట్లలో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోగా.. సాంకేతిక సమస్యలతో మరికొన్నింటి నుంచి సరఫరా తగ్గింది.

 

 ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల పరిధిలో బొగ్గు కొరత కారణంగా ఇప్పటివరకు మొత్తం 930 మెగావాట్ల మేర విద్యుత్ ఉత్పత్తి తగ్గింది. పలు కారణాలతో మరో 125 మెగావాట్ల ఉత్పత్తికి అంతరాయం కలిగింది. ఈ క్రమంలో తెలంగాణకు రావాల్సిన వాటాలో ఏకంగా 12 మిలియన్ యూనిట్ల(ఎంయూ)కు కోత పడింది. ఆంధ్రప్రదేశ్‌కూ 10 మిలియన్ యూనిట్ల సరఫరా తగ్గింది. ఈ లోటును పూడ్చుకునేందుకు ఎక్కడికక్కడ అనధికారికంగా ఎడాపెడా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. మండుతున్న ఎండలకు తోడు కరెంట్ లేక పల్లె.. పట్నం తేడా లేకుండా జనం ఇక్కట్లు పడుతున్నారు.

 

 సరిపోని సరఫరా

 

 ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల పరిధిలోని విద్యుత్ ప్లాంట్లకు ఒప్పందం మేరకు బొగ్గు సరఫరా కాకపోవడమే పెద్ద సమస్యగా మారింది. ఉమ్మడి రాష్ర్టంగా ఉన్న సమయంలో మహానది కోల్‌ఫీల్డ్స్(ఎంసీఎల్)తో పాటు సింగరేణి నుంచి బొగ్గు దిగుమతికి  ఒప్పందాలు జరిగాయి. అయితే ఈ రెండు సంస్థల నుంచి బొగ్గు సరఫరా రానురానూ తగ్గిపోతోంది. వైఎస్సార్ కడప జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్(ఆర్‌టీపీపీ)కు సింగరేణి నుంచి ఏడాదికి 3.88 మిలియన్ టన్నుల బొగ్గు రావాల్సి ఉంది. అలాగే విజయవాడలోని నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్(ఎన్‌టీటీపీఎస్)కు ఎంసీఎల్ నుంచి ఏడాదికి 7.5 మిలియన్ టన్నుల బొగ్గు సరఫరా కావాలి. ఉదాహరణకు ఎంసీఎల్ నుంచి రోజుకు ఎనిమిది ర్యాక్‌ల(ఒక్కో ర్యాక్‌లో 3,800 టన్నులు) బొగ్గు రావాల్సి ఉండగా, కేవలం రెండు ర్యాకులే వస్తున్నాయి. సింగరేణి సంగతి కూడా ఇంతే! బొగ్గు సరఫరా చేసేందుకు అవసరమైన ర్యాక్‌లను రైల్వే శాఖ కేటాయించడం లేదని ఆ సంస్థలు చెబుతున్నాయి. ఈ విషయంలో రైల్వే శాఖపై ఒత్తిడి తేవడంలో ఇరు రాష్ర్ట ప్రభుత్వాలు విఫలమవుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి.

 

 కొన్ని మూత... కొన్నింటిలో కోత!

 

 బొగ్గు కొరత కారణంగా ఇప్పటికే కొన్ని ప్లాంట్లను మూసివేయగా, మరికొన్నింటిలో ఉత్పత్తి భారీగా తగ్గింది. ఆర్‌టీపీపీలో 210 మెగావాట్ల చొప్పున సామర్థ్యమున్న రెండు యూనిట్లు మూతపడ్డాయి. దీంతో ఈ ఒక్క ప్లాంట్ నుంచే 420 మెగావాట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఎన్‌టీటీపీఎస్‌లో 210 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఆరు యూనిట్లు ఉండగా, ప్రస్తుతం ఒక్కో యూనిట్‌లో 150 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ఇదే కేంద్రంలోని 500 మెగావాట్ల సామర్థ్యమున్న ఏడో యూనిట్‌లో కేవలం 350 మెగావాట్ల ఉత్పత్తి జరుగుతోంది. దీంతో ఏడు యూనిట్లూ కలిపి 510 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి తగ్గింది. ఈ కారణంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన 12 మిలియన్ యూనిట్ల(సుమారు 56 శాతం) విద్యుత్ నిలిచిపోయింది. ఖమ్మం జిల్లా పాల్వంచ వద్దనున్న కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్(కేటీపీఎస్)లో బాయిలర్ ట్యూబ్ లీకవడంతో 125 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. అయితే ఇక్కడ త్వరలోనే విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తామని తెలంగాణ జెన్‌కో వర్గాలు తెలిపాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికీ పది మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ సరఫరా తగ్గిపోయింది. దీంతో ఇరు రాష్ట్రాల్లోనూ  కోతలు తీవ్రమయ్యాయి.


 




 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top