విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల రిలేదీక్షలు .

విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల  రిలేదీక్షలు  . - Sakshi


గుణదల సబ్‌స్టేషన్ వద్ద ప్రారంభం

 రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల మద్దతు

 కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్


 

విజయవాడ : గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు రోడ్డెక్కారు. రెండు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న వీరు బుధవారం గుణదల ట్రాన్స్‌కో  నిలయం వద్ద ఏలూరు రోడ్డుపై బైఠాయించారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ సామూహిక రిలేదీక్షలు చేపట్టారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన కాంట్రాక్టు కార్మికులు ఈ దీక్షల్లో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. ఏపీ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర కన్వీనర్ కాశీ మధుబాబు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 20 వేల మంది కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్నారని, జిల్లాలో 1200 మంది విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. విద్యుత్ శాఖలో థర్డ్‌పార్టీ కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులందరినీ పర్మినెంటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 

చంద్రబాబూ.. మోసం చేయొద్దు...



ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు ఎంప్లాయీస్ ఐక్య కార్యాచరణ కమిటీ చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి సీపీఎం మద్దతు ప్రకటించింది. గుణదల సబ్‌స్టేషన్ వద్ద చేపట్టిన ఆందోళన కార్యక్రమం వద్దకు ఆ పార్టీ నగర కార్యదర్శి సీహెచ్ బాబూరావు వెళ్లి తమ మద్దతు ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీని గాలికొదిలి కార్మికుల పొట్టలు కొడుతున్నారని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేసే కాంట్రాక్టు కార్మికులను దశలవారీగా తొలగించేందుకు యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలను మోసం చేయొద్దని, ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. నిరవధిక సమ్మెకు దిగిన కాంట్రాక్టు కార్మికులకు అండగా ఉండి పోరాటంలో పాల్గొంటామని చెప్పారు.



కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలి...



న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులందరినీ వెంటనే పర్మినెంటు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ దుట్టా రామచంద్రరావు డిమాండ్ చేశారు. గుణదల సబ్‌స్టేషన్ వద్ద రిలేదీక్షా శిబిరంలో కూర్చుని వారికి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్ కాంట్రాక్టు కార్మికులకు తమ పార్టీ అండగా నిలిచి పోరాటం చేస్తుందన్నారు. టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను దుయ్యబట్టారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసి.. కార్మికులకు న్యాయం జరిగేవిధంగా కృషిచేస్తారని చెప్పారు. అనంతరం తొలిరోజు రిలేదీక్షలను ఆయన విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మాదల శివరామకృష్ణ, జిల్లా జేఏసీ నాయకులు టీఎన్ బసవేశ్వరరావు, కన్వీనర్ ఆర్.ప్రవీణ్, జిల్లా నాయకుడు బీపీకే చంద్రం, సీఐటీయూ జిల్లా కార్యదర్శి డీవీ కృష్ణ మద్దతు ప్రకటించారు.

 

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top