బ్యాంకు ఖాతా ఉంటేనే కనెక్షన్: పీయూష్

బ్యాంకు ఖాతా ఉంటేనే కనెక్షన్: పీయూష్

హైదరాబాద్: కొత్తగా విద్యుత్ కనెక్షన్లు తీసుకునే వారికి బ్యాంక్ ఖాతాను తప్పనిసరి చేయాలని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్‌గోయల్ ఆంధ్రపద్రేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. 2017 సంవత్సరం నాటికి ఆంధ్రపదేశ్ 27 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని సాధిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అక్టోబర్ 2 నుంచి అమలు చేసే ‘అందరికీ విద్యుత్’ పథకానికి సంబంధించి మంగళవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పలు ఒప్పందాలు జరిగిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అన్ని రాష్ట్రాల్లోనూ విద్యుత్ నష్టాలు భారీగా ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్ మాత్రం అతి తక్కువగా ఉండటం అభినందనీయమని పేర్కొన్నారు. దీన్ని మరింత తగ్గించాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘జన్‌ధన్ యోజన’కు ఏపీ సర్కారు సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతా తీసుకునేందుకు వీలుగా, విద్యుత్ బిల్లులను సైతం బ్యాంకులోనే చెల్లించే ఏర్పాటు చేయాలని సూచించారు. దీనివల్ల సబ్సిడీలను నేరుగా అందించొచ్చని అభిప్రాయపడ్డారు. అందరికీ విద్యుత్ పథకం వెల్లడించిన 50 రోజుల్లోనే ఒప్పందాలు చేసుకోవడం హర్షణీయమని, రాష్ట్రాభివృద్ధికి బాబు పడుతున్న తపనకు ఇది నిదర్శనమని ప్రశంసించారు.  

 

 అందరికీ విద్యుత్‌పై కసరత్తు చేయాలి

 రాష్ట్రంలో కరెంట్ దొంగతనాలు జరగకుండా చూడాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ దిశగా ఇక నుంచి ఆన్‌లైన్ పద్ధతిని అమలులోకి తెస్తామన్నారు. అందరికీ విద్యుత్ ఎలా ఇవ్వాలనే విషయమై ఇంకా కసరత్తు చేయాల్సిన అవసరం ఉందని, అందుకే తేదీని ప్రకటించలేదని తెలిపారు. గతంలో విద్యుత్ సంస్కరణలు తానే తెచ్చానని, ఇప్పుడు అధికారంలోకి వచ్చేనాటికి 22 మిలియన్ యూనిట్లు విద్యుత్ లోటు ఉందన్నారు. దీన్ని అధిగమించేందుకు తిరిగి సంస్కరణలు చేపడుతున్నట్టు చెప్పారు. రాయలసీమలో పెద్ద ఎత్తున సోలార్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం సాహసోపేతమైన నిర్ణయంగా అభివర్ణించారు. రాష్ట్రంలో 9 వేల ఫీడర్లున్నాయని, వినియోగదారులు ఇక నుంచి ఇంట్లో కూర్చునే విద్యుత్ పరిస్థితిని తెలుసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోకగజపతిరాజు, ఎంపీలు సుజనాచౌదరి, సి.ఎం.రమేష్, సీఎస్ ఐ.వై.ఆర్.కృష్ణారావు, ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి రామ్మోహన్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వంద రోజుల పాలనపై రాష్ట్ర  కమ్యూనికేషన్ సలహాదారు పరకాల ప్రభాకర్ రూపొందించిన పుస్తకాన్ని బాబు ఆవిష్కరించారు. 

 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top