ఉచిత విద్యుత్‌కు దశలవారీగా కత్తెరేద్దాం

ఉచిత విద్యుత్‌కు దశలవారీగా కత్తెరేద్దాం - Sakshi


విద్యుత్ శాఖపై సమీక్షలో సీఎం

 

హైదరాబాద్: రైతన్నకు మరో షాకిచ్చేందుకు సర్కారు సన్నద్ధమవుతోంది. ఉచిత విద్యుత్‌కు నియంత్రణ రేఖ గీయనుంది. విద్యుత్ శాఖపై రాష్ట్ర సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఉచిత విద్యుత్‌పై ప్రధానంగా చర్చ జరిగింది. పంపిణీ, సరఫరా నష్టాల్ని 10 నుంచి 9 శాతానికి ఎలా తగ్గించాలో ఈ సందర్భంగా సీఎం సూచించారు. ఉచిత విద్యుత్‌కు దశల వారీగా కత్తెర వేయడమే మార్గమని ఆయన పరోక్షంగా పేర్కొన్నారు. ఇందులో భాగంగా విద్యుత్ ఫీడర్లకు మీటర్లు బిగించాలని సూచించారు. అన్నిరకాల విద్యుత్ కనెక్షన్లకు ఆధార్ సంఖ్యను అనుసంధానించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని 15 లక్షల వ్యవసాయ విద్యుత్ పంపుసెట్ల స్థానంలో నాణ్యమైన పంపుసెట్లను అమరిస్తే ఎంత ఖర్చవుతుందో నివేదించాలని అధికారుల్ని కోరారు. దీనిని రైతులు వ్యతిరేకిస్తున్నారంటూ అధికారులు సీఎం దృష్టికి తెచ్చినట్టు సమాచారం.





పీఎల్‌ఎఫ్ బహు బాగు: జెన్‌కో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ప్రాజెక్టు లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్‌ఎఫ్) 81 శాతం వరకూ ఉందని విద్యుత్ అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ విద్యుత్ చౌర్యంపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు.



నైపుణ్యాభివృద్ధి వర్సిటీకి భూమి: సీఎం

రాష్ర్టంలో నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం, ఇండస్ట్రియల్ కన్సార్టియంలతోపాటు 13 శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు 300 నుంచి 500 ఎకరాల భూమిని కేటాయిస్తామని  చంద్రబాబు పేర్కొన్నారు. నైపుణ్యాభివృద్ధి సంస్థపై సచివాలయంలో సోమవారం జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. సమావేశంలో మంత్రులు కె. అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావుతదితరులు పాల్గొన్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.


సీఎంతో హ్యూస్టన్ ప్రతినిధి బృందం భేటీ

అమెరికాలోని హ్యూస్టన్ నగరానికి చెందిన వాణిజ్య ప్రతినిధి బృందం సోమవారం సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యింది. విద్యుత్, పోర్టులు, ఫార్మా రంగంలో తమ నగరం గణనీయమైన పురోగతి సాధించిందని వారు తెలిపారు. పట్టణాభివృద్ధి, మౌలికవసతుల రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఈ బృందం ఆసక్తి చూపింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, లాజిస్టిక్ హబ్‌గా రూపొందేందుకు ఏపీకి అన్ని వనరులున్నాయని తెలిపారు. పోర్టులు, విమానాశ్రయాలు, మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. సమగ్ర ప్రణాళికతో రావాలని హ్యూస్టన్ బృందాన్ని  సీఎం కోరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top