‘పవర్’ఫుల్ సాగెప్పుడో?


కర్నూలు(రాజ్‌విహార్): జిల్లాలో రైతులకు ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు అందని ద్రాక్షలా మారింది. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా జిల్లాకు అవసరమైన కోటాను ప్రభుత్వం ఇప్పటి వరకు కేటాయించలేదు. మరో నెల రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో జిల్లా రైతుల్లో తీవ్ర అందోళన నెలకొంది.

 

 ఆచరణకు సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు సంక్షేమాన్ని విస్మరిస్తున్నారు. రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ భారాన్ని తగ్గించుకునేందుకు అనేక మార్గాలు అనుసరిస్తున్నారు. మరొకవైపు అర్హులైన రైతులు ఉన్నప్పటికీ కొత్త వారికి కనెక్షన్లు మంజూరు చేయడం లేదు. అధికారంలోకి వచ్చి 8 నెలలు పూర్తయినా జిల్లా కోటా ఊసే లేదు. దరఖాస్తు చేసుకొని ఏడాది గడిచినా కనెక్షన్లు అందక 13 వేల మంది రైతులు నిరీక్షిస్తున్నారు. బోరు, బావుల్లో నీరు ఉన్నా పంటలు వేసుకొని పండించుకోలేని దయనీయ స్థితిలో రైతులున్నారు.

 

 కోటా విడుదలలో జాప్యం

 2014-15 సంవత్సరంలో అర్హులైన రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ జిల్లా కోటాను ప్రభుత్వం విడుదల చేయలేదు. సాధారణంగా ప్రతి ఏటా జనవరి- ఫిబ్రవరి నెలల్లో పెండింగ్ దరఖాస్తులు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రిలీజ్ చేయాల్సిన కోటాను కోరుతూ జిల్లా అధికారులు సీఎండీకి ప్రతిపాదనలు పంపుతారు.

 

 ఆ సంస్థలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన మొత్తం సంఖ్య ఆధారంగా మొత్తం కోటా విడుదల చేయాలని సీఎండీ ప్రభుత్వానికి నివేదికలు పంపుతారు. ఈక్రమంలో ఈ ఏడాది పెండింగ్ దరఖాస్తులకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు 12 వేల కనెక్షన్లు మంజూరు చేయాలని 2014 మార్చిలో ప్రతిపాదనలు పంపించారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభం ఏప్రిల్‌లో కోటాను విడుదల చేయాల్సి ఉండగా ఎన్నికల కోడ్ కారణంగా ఆగిపోయింది. టీడీపీ అధికారంలో వచ్చాక ఫైళ్లకు కదలిక లేకుండా పోయింది.

 

  దీంతో ఇప్పటికే డీడీల రూపంలో రూ.5,625  చెల్లించిన 8,766 మంది రైతులు కనెక్షన్ల కోసం ఎదురుచూస్తున్నారు. డబ్బులు కట్టకుండా కేవలం దరఖాస్తు చేసుకున్న మరో 4512 మంది రైతులు కూడా నిరీక్షిస్తున్నారు. సాధారణంగా ఏ సంవత్సర కోటాను ఆ సంవత్సరంలో రైతులకు మంజూరు చేయాల్సి ఉంది. మార్చి 31వ తేదీతో ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో రైతులు బాబు వైఖరిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కోటా వస్తుందనే ఆశతో విద్యుత్ అధికారులు ఇప్పటి వరకు 5,662 కనెక్షన్లు రీలీజ్ చేశారు. 2004లో జిల్లాకు 5,085 కనెక్షన్లు మంజూరు చేయగా.. ప్రతి ఏడాది కోటా పెంచుతూ రెండున్నర ఎకరాల్లోపు పొలం ఉన్న రైతులకు కనెక్షన్లు మంజూరు చేశారు. జిల్లాలో ఇప్పటికి దాదాపు 1.20 లక్షల కనెక్షన్లలో 1.02 లక్షల కనెక్షన్లకు ఉచిత విద్యుత్ అందుతోంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top