గుడ్లు తేలేసిన పౌల్ట్రీ

గుడ్లు తేలేసిన పౌల్ట్రీ


పరిశ్రమదారులకు అందని పరిహారం

నడిరోడ్డున వేలాది మంది కార్మికులు

అప్పులు పుట్టక అల్లాడుతున్న రైతులు

గణనీయంగా తగ్గిన గుడ్లు, కోళ్ల ఉత్పత్తి


 

 పౌల్ట్రీ పరిశ్రమ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించడంలేదు. హుద్‌హుద్ దెబ్బకు కనివినీ ఎరుగని రీతిలో నష్టపోయిన పౌల్ట్రీ రైతులునష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. పూర్తిస్థాయిలో పరిహారమందక..నేలమట్టమైన ఫారాలను నిలబెట్టుకునేందుకు అప్పులు పుట్టక అల్లాడిపోతున్నారు. వేలాది మంది కార్మికులు జీవనోపాధి కోల్పోయి వలస బాట పడుతున్నారు.


సాక్షి, విశాఖపట్నం: హుద్‌హుద్ ధాటికి జిల్లాలో మూడువందలకు పైగా కోళ్లఫారాలు నేలమట్టమయ్యాయి. 16.17లక్షల బ్రా యిలర్, 15.21లక్షల లేయర్ కోళ్లు చనిపోయినట్టు అధికారులే లెక్క తేల్చారు. వీటిలో ఏ ఒక్క ఫారానికి సరైన బీమా సౌకర్యం లేకపోవడంతో ఏఒక్కరూ జరిగిన నష్టాన్ని పూడ్చుకోలేకపోతున్నారు. చనిపోయిన కోడికి రూ.500 చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేయగా, గుడ్డుపెట్టే కోడికి రూ.150లు, బ్రాయిలర్ కోడికి రూ.75ల చొప్పున పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. లేయర్ కోళ్ల ఫారానికి గరిష్టంగా రూ.15లక్షలు, బ్రాయిలర్ కోళ్ల ఫారానికి రూ.7.5లక్షల చొప్పున సీలింగ్ విధించారు. ఈ విధంగా రూ.120కోట్లు మంజూరు చేశారు. ఈమొత్తంలో ఇప్పటి వరకు 50 శాతం మాత్రమే రైతుల అకౌంట్లకు జమయింది. మిగిలిన 50శాతం మంది బాధిత రైతులు పరిహారం కోసం కళ్లల్లో ఒత్తులేకుసుని ఎదురు చూస్తున్నారు. పరిహారంవిషయంలో చాలా మంది అర్హులైన రైతులకు అన్యాయమే జరిగింది.  ఈ పరిహారం 25 శాతం నష్టాన్ని కూడా పూడ్చే పరిస్థితి లేదు. అయినప్పటికీ పరిహారం అందితే కాస్త కుదుటపడవచ్చునని రైతులు ఆశిస్తున్నారు. మళ్లీ నిలదొక్కుకునేందుకు అప్పుల కోసం ప్రైవేటు వ్యాపారుల చుట్టూ తిరుగుతున్నారు. నేలమట్టమైన ఫారాల్లో కేవలం 50 శాతమే తిరిగి నిలదొక్కుకోగలిగాయి. అదీ కూడా తాత్కాలిక షెడ్లలో రూ.10ల వడ్డీకి అప్పులు చేసి మరీ పెట్టుబడులతో ఫారాలను నిలబెట్టుకోగలిగారు. మిగిలినవి తుఫాన్‌కు సాక్ష్యాలుగానే  నేటికీ దర్శనమిస్తున్నాయి. తుఫాన్ దెబ్బకు జిల్లాలో గుడ్లు, కోళ్ల ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గిపోయింది. జిల్లాలో సాధారణంగా రోజుకు 60 లక్షల గుడ్లు ఉత్పత్తి అయ్యేవి. ప్రస్తుతం 35లక్షల నుంచి 40లక్షలకు మించడం లేదు. ఇక జిల్లాలో 20లక్షల వరకు బ్రాయిలర్ కోళ్ల ఉత్పత్తి జరిగేది. తుఫాన్ తర్వాత అది 13లక్షల నుంచి 15లక్షలకు పడిపోయింది.



 ఈ పరిశ్రమ టర్నో వర్ కూడా సగానికి పైగా తగ్గిపోయిందని పౌల్ట్రీ రంగ నిపుణులు చెబుతున్నారు. దీంతో జిల్లా అవసరాల కోసం ఉభయగోదావరి జిల్లాల నుంచి గుడ్లు,కోళ్లను దిగుమతి చేసుకుంటున్నారు.  ఫారం పునర్నిర్మాణం కోసం ఉపయోగించే ముడిసరుకుపై 14 శాతం వ్యాట్‌ను రద్దు చేయాలని, ఉమ్మడి రాష్ర్టంలో జారీ చేసిన జీవో మేరకు పౌల్ట్రీ పరిశ్రమకు యూనిట్ రూ.3.88లకే విద్యుత్ సరఫరా చేయాలని,  టర్మ్, వర్కింగ్ కాపిటల్ రుణాలపై వడ్డీరాయితీ ఇవ్వాలని పౌల్ట్రీ రైతులు కోరుతున్నారు.

 

రూపాయి పరిహారం ఇవ్వలేదు



నా కోళ్ల ఫారం తుఫాన్ దెబ్బకు నేలమట్టమైంది. 13వేల కోళ్లు చనిపోయాయి. షెడ్లు పూర్తిగా ధ్వంసమైంది. రూ.15లక్షలు పెట్టుబడి పెట్టాను. ఇందులో రూ.10 లక్షలు బ్యాంకు నుంచి అప్పు తెచ్చాను. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి నా ఫారాన్ని చూసిన పాపాన పోలేదు. దెబ్బతిన్న రైతుల జాబితాలో నా పేరు లేదు. ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వలేదు. అప్పు ఏ విధంగా తీర్చా లో అర్థం కావడం లేదు. ప్రస్తుతం ఫారం మూసి వేశాను. కుటుంబ పోషణ కష్టంగా ఉంది.



- జాన్, పౌల్ట్రీ రైతు పెదపీనార్ల, నక్కపల్లి మండలం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top