టీటీడీలో టెండర్ల గోల


తిరుమలలో ఖాళీ దుకాణాలకు టెండర్లు ఆహ్వానం

టెండర్లతో తమ దుకాణాలకే ఎసరు పెడతారని పునరావాస బాధితుల్లో ఆందోళన

టెండర్‌కు, స్థానిక దుకాణాలకు సంబంధం లేదని స్పష్టం చేసిన టీటీడీ


 

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో టెండర్ల రచ్చ మొదలైంది. ఖాళీగా ఉన్న దుకాణాలకు టెండర్లు పిలిచింది. తద్వారా తమ దుకాణాలకే ఎసరు వస్తుందని దుకాణదారుల్లో ఆందోళన ప్రారంభమైంది. తిరుమల నాలుగు మాడ వీధులు, సన్నిధి వీధి, కల్యాణకట్ట, ఇతర నివాస ప్రాంతాల్లో దుకాణాలు ఉండేవి. భక్తుల సంఖ్య పెరగడంతో సౌకర్యాలు పెంచేందుకు టీటీడీ మాస్టర్ ప్లాన్ రూపొందించింది. 1980 నుంచి 2003 వరకు దశలవారీగా మాస్టర్‌ప్లాన్ అమలు చేసి ఇళ్లు, దుకాణాలు తొలగించారు. ప్రత్యామ్నాయంగా బాధితులకు తిరుమలతో పాటు తిరుపతిలో కేటాయించారు. ప్రస్తుతం తిరుమలలో వివిధ ప్రాంతాల్లో 1,456 దుకాణాలు, 735 హాకర్ లెసైన్సులు ఉన్నాయి. తిరుమలలో 76కి పైగా టెండర్ దుకాణాలున్నాయి. 1985 ప్రాంతంలో వాటిని స్థానికులకే కేటాయించారు. మరో 17 దాకా జనతా హోటళ్లు కేటాయించారు. ఇందులో 80 శాతం స్థానికేతరులే ఉన్నారు. ప్రస్తుతం తిరుమలలో 70 దుకాణాలకు టీటీడీ టెండర్లు పిలిచింది. ఈనెల 17వ తేదీ వరకు షీల్డ్ టెండర్ దరఖాస్తులు స్వీకరిస్తారు. 18న టెండర్లు ఖరారు చేస్తారు.

 

స్థానికుల వాదన ఇలా ఉంది..

టీటీడీ వాగ్దానం ప్రకారం ఖాళీగా ఉన్న దుకాణాలను పునరావాస బాధితులకు మాత్రమే కేటాయించాలి. దీనివల్ల టీటీడీ ఆదాయం పెరుగుతుంది. స్థానికులే ఉండటంతో భద్రతకు ఎలాంటి ఢోకా ఉండదు.టెండర్ దుకాణాల కోసం ఇతర ప్రాంతాల వారితో పోటీ తీవ్రంగా ఉంటుంది. అద్దెలు ఊహించని విధంగా పెరుగుతాయి. దాని ప్రభావం పునరావాసం కింద కేటాయించిన స్థానికుల దుకాణాలపై పడుతుంది. టీటీడీలో టెండర్ విధానం పెరిగితే భవిష్యత్‌లో స్థానిక దుకాణాలకు ఎసరు పడుతుంది.ఇతర ప్రాంతాల టెండర్‌దారులకు తిరుమలలో స్థిర నివాసం ఉండదు. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా తప్పులు చేసే అవకాశం ఎక్కువ. వారి తప్పులను స్థానికుల ఖాతాలో వేసే అవకాశం ఉంది. వాటి ప్రభావం స్థానిక ఇళ్లపై పడుతుంది.టెండర్‌లో పాల్గొనే ఇతర ప్రాంతాల వ్యక్తులు రోజువారి ఆదాయం పెంచుకునేందుకు వ్యాపారంలో పోటీ పెంచుతారు. హోటళ్లలో పనిచేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి కార్మికులను తిరుమలకొండకు రప్పిస్తారు. దీనివల్ల భద్రత పరంగా ఇబ్బందులు ఉంటాయి.

 

టీటీడీ వాదనిది..

తిరుమలలో ఏడేళ్లుగా దుకాణాలు ఖాళీగా ఉన్నాయి. తద్వారా శ్రీవారి ఆదాయానికి రూ.లక్షల్లో గండిపడింది. ఖాళీగా కొనసాగిస్తే మరింత నష్టం వాటిల్లే అవకాశముంది. టెండర్ షెడ్యూల్‌లో ప్రకటించిన ఆ 70 దుకాణాలకు టెండర్ అమలు చేస్తాం.తిరుమల పునరావాస బాధితులు సంప్రదిస్తే వారికి సంబంధించి పెండింగ్‌లోని ఇళ్లు, దుకాణాల సమస్యలను పరిష్కరిస్తాం. అవసరమైతే కొత్తగా దుకాణాలు నిర్మించి కేటాయిస్తాం.టెండర్ దుకాణాల వల్ల ఇతర ప్రాంతాల వారు తిరుమలకు వస్తే వారి వల్ల భద్రతాపరమైన అంశాలను పోలీసులు, టీటీడీ విజిలెన్స్ చూసుకుంటుంది. ఆ సమస్య స్థానికుల పరిధిలో ఉండదు.కొత్త టెండర్ల వల్ల పెరిగే అద్దెలకు, గతంలో పునరావాసం కింద కేటాయించిన దుకాణాలకు ఎలాంటి సంబంధమూ ఉండదు. అద్దెలను స్థానిక దుకాణాలకు అమలు చేసే ప్రసక్తే లేదు.    

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top