మమేకమై పనిచేస్తా..


కడప అర్బన్ : తాను ప్రజలతో మమేకమై పనిచేస్తానని, తద్వారా శాంతి భద్రతలను పటిష్టం చేస్తామని నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ నవీన్ గులాఠి చెప్పారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏఆర్ సిబ్బంది నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం తన ఛాంబరుకు చేరుకున్నారు. ఏఎస్పీ అడ్మిన్ చంద్రశేఖర్‌రెడ్డి, ఓఎస్‌డి ఆపరేషన్స్ ఏవి రమణ ఎస్పీకి పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. అనంతరం పోలీసు కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం తమవంతు శ్రమిస్తామన్నారు. మొదట జిల్లా నేరచరిత్రను అధ్యయనం చేస్తామన్నారు.

 

 టాఫిక్ నియంత్రణ కోసం చేపట్టాల్సిన చర్యలపై దృష్టి సారిస్తామన్నారు. ప్రజల శాంతియుతంగా జీవించటానికి తమవంతు బాధ్యతగా విధులు నిర్వర్తిస్తామన్నారు. పోలీసు, ప్రజల మధ్య సమన్వయం పెంపొందించే కార్యక్రమాలు చేపడతామన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారంపై ప్రత్యేక దృష్టిసారిస్తామన్నారు. ఎన్నికల కారణంగా దోపిడీ,  దొంగతనాల రికవరీ సరిగా జరగలేదనేది వాస్తవమేనన్నారు. పోలీసులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం ప్రస్తుతం ఉన్న కార్యక్రమాలను యదావిధిగా కొనసాగిస్తామన్నారు. ప్రజలు, మీడియా వారు తమకు తెలిసిన సమాచారాన్ని నేరుగా తనకు తెలుపవచ్చన్నారు.

 

 నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలి

 ప్రజలకు న్యాయం జరిగేలా పోలీసులు నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ డాక్టర్ నవీన్ గులాఠి పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం జిల్లాలోని పోలీసు అధికారులతో కాన్ఫరెన్స్ హాల్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కడప, ప్రొద్దుటూరు, రాజంపేట, మైదుకూరు, జమ్మలమడుగు, పులివెందుల సబ్ డివిజన్ల పరిధిలోని అధికారులతో మాట్లాడుతూ ఏవైనా సమస్యలుంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చేవారిని గౌరవంగా చూడాలన్నారు. అవినీతికి పాల్పడే పోలీస్ సిబ్బందిని ఎటువంటి పరిస్థితిలలో సహించేది లేదని హెచ్చరించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top