టపాసులు లేని దీపావళి

టపాసులు లేని దీపావళి


విజయనగరం కంటోన్మెంట్: దీపావళి ఆనందాన్ని హుదూద్ చిదిమేసింది. మేలుకోబోతే మరో ప్రమాదాన్ని ఆహ్వానించినట్టే అవుతుంది. అందుకే ఈ దీపావళిని జిల్లా దీపాలతోనే సరిపెట్టుకోబోతోంది. తుపాను కారణంగా నిండామునిగిన చాలా మంది పండగచేసుకునే పరిస్థితిలో లేరు. మరో పక్క ఎక్కడికక్కడ చెట్లు విరిగిపడ్డాయి. దీంతో చాలా ప్రాంతాల్లో మోడువారిన చెట్లు, ఎండిన ఆకులతో నిండిపోయాయి. చిన్న నిప్పు వీటికి అంటుకుంటే పెద్ద ప్రమాదమే సంభవిస్తుంది. దీంతో బాణసంచా విక్రయించరాదన్న అధికారుల ఉత్తర్వులతో తుపాను ప్రభావం పెద్దగాలేని మిగతా ప్రాంతంలోనూ ఉత్సాహం తగ్గిపోయింది.  

 

 దీపావళి పండగను టపాసులు లేకుండా దీపాలతోనే జరుపుకోవాలని,  కనీసం కాల్చడం కూడా వద్దని  కలెక్టర్ ఎంఎం నాయక్ ప్రజలకు సూచించారు.  బాణసంచా విక్రయాలు చేయరాదని,   దుకాణాలను మూసేయాలని కూడా ఆదేశాలిచ్చారు. రెండు డివిజన్లలోని సబ్ కలెక్టర్, ఆర్డీఓలకు ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు.  బాణసంచా విక్రయాలు చేయనీయకుండా కేసులు నమోదు చేసి, విక్రయాలు చేస్తున్న దుకాణాలను సీజ్ చేసి, యజమానులపై కేసులు పెట్టాలని పోలీసు, ఫైర్ శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. ఇలా ఆదేశాలు ఇవ్వడం జిల్లా చరిత్రలో ఇదే ప్రథమం.  దీంతో ఈ ఏడాది వెలుగు విరజిమ్ముతూ తిరిగే భూ చక్రాల భ్రమణాలు, విష్ణు చక్రాల విశ్వరూపాలు, కాకరపువ్వొత్తుల వెన్నెల వెలుగులు, వెలుగు పూలు విరజిమ్మే చిచ్చుబుడ్డుల అందాలు, బాంబుల మోతలు లేకుండానే దీపావళి జరగనుంది.

 

 కీలక సమయం...

 దీపావళికి ముందు రోజు బాణసంచా వ్యాపారులకు కీలక సమయం. గత ఏడాది సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా విక్రయాలు సరిగా సాగలేదు. ఈ ఏడాది తుపాను కారణంగా మారోమారు వారి వ్యాపారాలు డీలా పడ్డాయి. జిల్లాలో ఏటా దాదాపు రూ.ఎనిమిది కోట్ల మేర బాణసంచా విక్రయాలు జరుగుతుంటాయి. జిల్లా ప్రజలే కాకుండా సమీప రాష్ట్రాలయిన ఒడిశా, చత్తీస్‌గఢ్ ప్రాంతాల నుంచి కూడా వచ్చి బాణసంచాను టోకున కొనుగోలు చేస్తారు. దీంతో చాలా వరకూ విక్రయాలు జరిగిపోయినా జిల్లాకు సంబంధించి విక్రయాలు జరిగిపోయినా  దాదాపు రూ.5 కోట్ల రూపాయల వరకూ విక్రయాలు నిలిచిపోయాయి. ఇప్పటికే చాలా మంది వద్ద అడ్వాన్సులు తీసుకుని సరుకులు తీసుకువెళ్లే సమయంలో నిషేధం అమలు కావడంతో బాణసంచా వ్యాపారులు జేసీ, కలెక్టర్ వద్దకు వెళ్లి కలిసేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినా అవేవీ సఫలం కాలేదు. అధికారులు కనీసం వీరిని కలిసేందుకు కూడా ఇష్టపడకపోవడంతో నిరాశతో వెనుతిరిగారు. మంగళవారం రాత్రి కూడా చివరకంటా ప్రయత్నాలు చేసిన వ్యాపారులు ఇక చేసేదేం లేక మిన్నకుండి పోయారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top