‘ఉగ్ర’ లేఖలపై పోస్టల్ నిఘా..!

‘ఉగ్ర’ లేఖలపై పోస్టల్ నిఘా..! - Sakshi


సాక్షి, గుంటూరు: దేశంతోపాటు రాష్ట్రంలో సైతం ఉగ్రవాదుల కదలికలు కనిపిస్తుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇటీవల నల్గొండ జిల్లాలో సిమి ఉగ్రవాదులు పోలీసులపై జరిపిన కాల్పుల్లో ఓ ఎస్‌ఐ మృతి చెందడం, ఆతరువాత ముష్కరులను పోలీసులు మట్టుబెట్టిన విషయం తెలిసిందే.



ఈ ఘటనకు ముందు ముష్కర ముఠా గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో షెల్టర్ ఏర్పాటు చేసుకుని ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించడంతో అంతా ఉలిక్కిపడ్డారు. సెల్‌ఫోన్‌లు, ఇంటర్ నెట్ వంటి అత్యాధునిక విధానాలపై కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు పూర్తిస్థాయి నిఘా ఉంచడంతో సమాచారం చేరవేసుకునేందుకు ఉగ్రవాదులు పోస్టల్‌శాఖను ఎంచుకున్నారు. పోస్టాఫీస్‌ల ద్వారా ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తూ ఉగ్రవాదులు తమ సమాచారాన్ని చేరవేసుకుంటున్నట్లు గుర్తించిన నిఘా వర్గాలు ప్రభుత్వానికి సమాచారం అందించాయి. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖ ద్వారా రాష్ట్రపతికి లేఖ రాసింది.



దీంతో రాష్ట్రపతి ఆదేశాల మేరకు రాష్ట్రంలో కదలికలు అధికంగా ఉన్న రెండు ఉగ్ర సంస్థలకు సంబంధించి వచ్చే లేఖలను పోస్ట్‌మాస్టర్ చదవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు పోస్టల్ అధికారులకు స్వష్టమైన ఆదేశాలిచ్చారు. ఆయా చిరునామాలను కనుగొనడానికి సిబ్బందికి అంతర్గతంగా పలు సూచనలిచ్చినట్టు సమాచారం. ఆ లేఖల్లో దేశ, రాష్ట్ర భద్రతలకు సంబంధించిన అంశాలు ఉంటే వెంటనే జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్‌కు తెలియజేయాలన్నారు. ఒకవేల లేఖల్లో ఉగ్రవాదులు కోడ్ భాషను ఉపయోగించి ఉంటే విషయాన్ని అధికారులకు తెలియజేసి నిపుణులతో దాన్ని గుర్తించే విధంగా చూడాల్సి ఉంటుంది. దీని వల్ల ఉగ్రవాదుల కార్యకలాపాలు కనుక్కోవచ్చని ప్రభుత్వ భావన.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top