‘తపాలా’కు సాఫ్ట్‌వేర్ రక్షణ కవచం..!

‘తపాలా’కు సాఫ్ట్‌వేర్ రక్షణ కవచం..! - Sakshi


సాక్షి, హైదరాబాద్: తపాలా కోశాగారం, అన్ని కార్యకలాపాలకు సంబంధించిన పూర్తి సమాచారం నిక్షిప్తమైన సర్వర్‌కు భద్రత కల్పించేందుకు పోస్టల్ శాఖ సాఫ్ట్‌వేర్‌తో రక్షణ కవచం ఏర్పాటు చేసుకుంది. కోట్ల రూపాయల నిధులు, ఎస్‌బీఐలాంటి భారీ బ్యాంకింగ్ సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాల నేపథ్యంలో అత్యంత విలువైన సాఫ్ట్‌వేర్ సమాచారం వీటిలో నిక్షిప్తమైనందున.. చౌర్యానికి వీలు లేకుండా ఫేస్ రిజిస్ట్రేషన్ సాఫ్ట్‌వేర్‌తో సాంకేతిక నిఘాను ఏర్పాటు చేసుకుంది. దేశంలోనే తొలిసారి ఏపీ తపాలా సర్కిల్(తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పరిధి) దీన్ని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చింది.

 

కేవలం ముగ్గురికే అనుమతి...

ఇటీవల తపాలా శాఖ ఆదాయం భారీగా పెరిగింది. వచ్చే ఆర్థిక సంవత్సరం లాభాలబాట పట్టేందుకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో తపాలా కోశాగారంలో వందల కోట్ల నిధులు చేరతాయి. రోజువారీ కార్యకలాపాల నిధులు ఇక్కడి నుంచే బట్వాడా అవుతున్నాయి. పైగా బ్యాంకింగ్ రంగంపై తపాలా శాఖ దృష్టి సారించింది. పొదుపు ఖాతాలు పెంచుకోవటంతోపాటు ఎస్‌బీఐ లాంటి సంస్థలతో ఒప్పం దాలు కుదుర్చుకుంటోంది. అంతర్జాతీయ కొరియర్ సంస్థలతోనూ ఒప్పందాలు చేసుకుంటోంది.



ఫలితంగా అత్యంత విలువైన సమాచారం సర్వర్‌లో నిక్షిప్తమవుతోంది. అయితే ఖజానాకు, సర్వర్‌కు రక్షణ తపాలా శాఖకు సవాల్‌గా మారింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో నిధులు, సమాచార చౌర్యం తరచుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఫేస్ రిజిస్ట్రేషన్ సాఫ్ట్‌వేర్‌ను తపాలా శాఖ  ఏర్పాటు చేసుకుంది. సొంతంగానే ఈ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించుకున్న పోస్టల్ విభాగం.. దానికి అవసరమైన పరికరాలను ప్రైవేటు సంస్థ నుంచి కొనుగోలు చేసింది. కోశాగారం, సర్వర్ గదులకు దీనిని అనుసంధానించింది.



ముగ్గురు అధికారుల ముఖాల (ఫేస్)ను ఇందులో రిజిస్టర్ చేశారు. ఫేస్ రిజిస్ట్రేషన్‌తోపాటు బొటనవేలి ముద్రలనూ తీసుకున్నారు. సంబంధిత పరికరాలను ఆ గదుల తలుపుల వద్ద ఏర్పాటు చేశారు. పరికరంలో గుర్తులు నమోదైన అధికారులు ఉన్నప్పుడు.. అందులో నిక్షిప్తమైన చిత్రంతో సరిపోలితేనే అది గ్రీన్‌సిగ్నల్ ఇస్తుంది. ఆ తర్వాత బొటనవేలి ముద్ర సరిపోలితే తలుపు దానంతట అదే తెరుచుకుంటుంది.



అనుమతి ఉన్న అధికారులు లోనికి వెళ్లినప్పుడు సెకన్లతో పాటు సమయం, చిత్రం రికార్డవుతుంది. దాన్ని ప్రింట్ రూపంలో పొందే వెసులుబాటు ఉంది. ఫలితంగా అనుమతి ఉన్న వ్యక్తులు తప్పు చేసినా సులభంగా దొరికిపోతారు. ఇక ఫేస్ రిజిస్ట్రేషన్ టెక్నాలజీ వల్ల ఇతరులు లోనికి ప్రవేశించేందుకు అవకాశమే లేదని అధికారులు చెపుతున్నారు. దీని వల్ల తపాలా శాఖ నిధులు, కీలక సమాచారానికి పూర్తి భద్రత కలిగినట్టయ్యింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top