చదువు‘కొనాల్సిందే’

చదువు‘కొనాల్సిందే’ - Sakshi


* నిరుపేద విద్యార్థులపై రూ.62 లక్షల భారం

* జూన్ 2 తర్వాత తీసుకున్న నివాస పత్రాలే ఇవ్వాలని తిరకాసు

* ఏడేళ్ల బోనఫైడ్ మెలిక

* తల్లిదండ్రుల ఆధార్‌తో ముడిపెట్టడంతో ఆందోళన

* మీసేవ కేంద్రాలకు పెరగనున్న గిరాకీ


కర్నూలు(అర్బన్): రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలోని లక్ష మంది బడుగు, బలహీన వర్గాల విద్యార్థులపై రూ.62 లక్షల భారం పడనుంది. జూన్ 2వ తేదీ తర్వాత తీసుకున్న నివాస, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతోనే ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లకు అర్హులైన ఫ్రెష్, రెన్యూవల్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలనే నిర్ణయం విస్మయాన్ని కలిగిస్తోంది. నిరుపేద విద్యార్థులంతా ఉన్నత చదువులు అభ్యసించాలని ఆశించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయం నీరుగారుతోంది. పేదలకు ఉన్నత విద్యను దూరం చేసేందుకు సర్కారు రోజుకో మెలిక పెడుతుండటం విమర్శలకు తావిస్తోంది. గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి అనేక ఆంక్షలతో నిరుపేద విద్యార్థులకు ఫీజును దూరం చేస్తే.. ప్రస్తుతం చంద్రబాబునాయుడు మరికొన్ని నిబంధనలు తెరపైకి తీసుకొచ్చి పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు.



గతంలో ఎలాంటి నిబంధనలు లేకుండానే ఇంటర్మీడియట్ నుంచి పీజీ, మెడిసిన్, ఇంజనీరింగ్ తదితర ఉన్నత చదువులకు అర్హులైన వారందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలు విడుదల చేశారు. అయితే టీడీపీ ప్రభుత్వం ఫీజు పొందేందుకు అనేక షరతులు విధించడం జిల్లాలోనే వేలాది విద్యార్థుల భవిష్యత్‌పై ప్రభావం చూపనుంది. మారిన నిబంధనలతో ప్రతి ఒక్కరూ నివాస ధ్రువీకరణ పత్రాల కోసం మీసేవ, తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ పరుగెత్తాల్సి వస్తోంది. రెన్యూవల్ విద్యార్థులు ఇప్పటికే అన్ని ధ్రువీకరణ పత్రాలతో ఫీజును పొందుతుండగా.. వీరంతా తిరిగి కొత్త ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం గమనార్హం. ఫలితంగా ఒక్కో విద్యార్థిపై రూ.50 అదనపు భారం పడటంతో పాటు సమయం కూడా వృథా కానుంది.



ఎన్నికల సమయంలో ఆధార్‌తో సంబంధం లేకుండా విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలు విడుదల చేస్తామన్న బాబు ప్రస్తుతం విద్యార్థులకు ఫీజు, స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలంటే తల్లిదండ్రులకు ఆధార్ తప్పనిసరి అని చెప్పడం గందరగోళానికి తావిస్తోంది. ఇప్పటికీ అధిక శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఆధార్ ప్రక్రియ కొలిక్కి రాకపోవడంతో అనేక మంది విద్యార్థులు ఫీజుకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఇకపోతే ఫీజుకు అర్హులైన విద్యార్థులు ఏడేళ్లు తక్కువ కాకుండా వరుసగా చదివిన స్టడీ, బోనఫైడ్ సర్టిఫికెట్లను దరఖాస్తు దశలోనే సమర్పించాలనే నిబంధన మొదటికే మోసాన్ని తీసుకొస్తోంది. 1 నుంచి 5 వరకు, 5 నుంచి 10వ తరగతి వరకు వేర్వేరు ప్రాంతాల్లో చదివిన విద్యార్థులు ఏడు సంవత్సరాలు ఒకే చోట చదివినట్లు ధ్రువీకరణ పత్రం తీసుకురావడం ఎలా సాధ్యమో ప్రభుత్వానికే తెలియాలి.

 

ఏదేమైనా ప్రభుత్వ కొత్త నిబంధనలు మీసేవ కేంద్రాలకు వరంగా మారుతోంది. కొన్ని మీసేవ కేంద్రాలు స్థానిక తహశీల్దార్ కార్యాలయంతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని అధిక మొత్తం ముట్టజెబితే తప్ప ధ్రువీకరణ పత్రాలను నిర్ణీత సమయం లోపు అందించకపోవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.

 

బాడుగ కారున్నా.. స్కాలర్‌షిప్ కట్

ఓ వ్యక్తి బ్యాంక్ రుణంతో కారు కొనుగోలు చేసి బాడుగకు నడుపుతున్నా అతని పిల్లలకు ఫీజు, ఉపకార వేతనం అందని పరిస్థితి కనిపిస్తోంది. దరఖాస్తులో నాలుగు చక్రాల వాహనం ఉంటే వివరాలను నమోదు చేయాలనే నిబంధన విద్యార్థుల ఫీజు ఆశలను గల్లంతు చేస్తోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top