‘జన-ధన’తో పేదలకు లబ్ధి

‘జన-ధన’తో పేదలకు లబ్ధి - Sakshi


నెల్లూరు(పొగతోట): ప్రధానమంత్రి జన-ధన యోజన పథకం ద్వారా నిరుపేదలకు లబ్ధి కలుగుతుందని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం ప్రధానమంత్రి జన-ధన యోజన పథకాన్ని ప్రారంభించారు. అంతకు ముందు బ్యాంకింగ్ సేవలపై ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ మాట్లాడారు. గ్రామీణ నిరుపేదలు తమ అవసరాల కోసం అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుంటున్నారన్నారు.



అప్పులు కట్టలేక ఆస్తులను కోల్పోతున్నారని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. జన-ధన యోజన పథకంతో నిరుపేద ప్రజలకు బ్యాంకుల్లో రుణాలు మంజూరవుతాయన్నారు. ఈ పథకాన్ని అద్భుతంగా రూపొందించారన్నారు. పథకం ద్వారా ప్రతి కుటుంబానికి రెండు బ్యాంకు అకౌంట్లు తెరుస్తారని మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. అకౌంట్ ప్రారంభించిన ఖాతాదారులకు రూ.1.35 లక్షల ఇన్సూరెన్స్ లభిస్తుందన్నారు. ప్రజలతో త్వరగా బ్యాంకు అకౌంట్స్ ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.



ఆధార్, రేషన్‌కార్డు ఉంటే అకౌంట్ ప్రారంభించవచ్చన్నారు. కలెక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ గత 60 ఏళ్లలో బ్యాంకులు అమలు చేసిన పథకాల్లో జన-ధనయోజన పథకం కీలకమైందన్నారు. మూడు నెలల్లో అందరితో ఖాతాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎల్‌డీఎం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రధానమంత్రి జన-ధన యోజన పథకాన్ని దేశవ్యాప్తంగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ప్రారంభించారన్నారు. రెండు వేల జనాభా కలిగిన 221 గ్రామాల్లో బ్యాంక్ వ్యాపార ప్రతినిధులను నియమించామన్నారు.



1500ల లోపు జనాభా కలిగిన 895 గ్రామాల్లో బీసీలను నియమించి బ్యాంక్ అకౌంట్స్ ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ పధకంలో ఆరు స్థాయిలు ఉన్నాయన్నారు. అనంతరం అకౌంట్స్ ప్రారంభించిన ఖాతాదారులకు బ్యాంక్ బుక్స్, ఇన్సూరెన్స్ బాండ్లు, బీసీలకు కిట్స్ అందజేశారు. కార్యక్రమం ముగిసి అధికారులు వెళ్లిపోయిన తర్వాత నగర మేయర్ అబ్దుల్ అజీజ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, సిండికేట్ బ్యాంక్ డీజీఎం కె. శ్రీనివాసులు, నాబార్డు ఏజీఎం వివేకానంద, డీఎస్‌ఓ శాంతకుమారి, ఐటీడీఏ పీఓ వెంకటేశ్వరరావు, వివిధ బ్యాంక్ అధికారులు, వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top