బీమాతో పేదల కుటుంబాలకు భరోసా


ఒంగోలు: ప్రధానమంత్రి ఇటీవల ప్రవేశపెట్టిన మూడు రకాల పథకాలు పేదల కుటుంబాలకు అతిపెద్ద భరోసాగా నిలుస్తాయని బీమా సంస్థలే కాదు...బ్యాంకర్లూ చెబుతున్నారు. అయితే అవకాశం ఉన్నా సరైన అవగాహన లేకపోవడంతో ప్రజలు వీటిని వినియోగించుకునేందుకు దృష్టి సారించడం లేదు. చాలామంది ఏదో ఒక స్కీమును వినియోగించుకుంటే సరిపోతుంది కదా అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి  కనీసం రెండు బీమా పథకాలను ఉపయోగించుకున్నా ఆపద వేళల్లో ఆ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోకుండా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. అంటే ఈనెల 31వ తేదీ వరకు బ్యాంకుల్లో దరఖాస్తులను స్వీకరిస్తారు.



జూన్ ఒకటో తేదీ నుంచి బీమా పథకాలు అమలులోకి వస్తాయి. మే 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకునేందుకు ఎటువంటి మెడికల్ చెకప్‌లు అవసరం లేదు. కేవలం ఫారం పూర్తిచేసి ఇస్తే సరిపోతుంది.

 

ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన:

ఇది పూర్తిగా ప్రమాద బీమా. ఈ బీమాలో సభ్యత్వం పొందాలంటే బ్యాంకులో ఖాతా ఉన్న ప్రతి ఒక్కరూ కనీసంగా నెలకు రూపాయి చొప్పున ప్రతి ఏడాది ఏకమొత్తంగా రూ.12  చెల్లించాలి. ఈ మొత్తం కూడా జూన్ ఒకటో తేదీ నాటికి బ్యాంకు ఖాతాలో నిల్వ ఉండాలి. మిగిలిన రోజుల్లో ఎలా ఉన్నా ప్రతి ఏడాది జూన్ ఒకటో తేదీ నాటికి నిల్వ ఉంచుకునేలా చూసుకోవాలి. దీనికి 18 నుంచి 70 ఏళ్ల వయస్సు వరకు అందరూ అర్హులే. ఏదైనా ప్రమాదవశాత్తు సంబంధిత పాలసీదారుడు మరణిస్తే అతను పేర్కొన్న నామినీకి రూ.2 లక్షలు అందుతుంది. ఒక వేళ  పాలసీదారుడు తీవ్రంగా గాయపడి ఎటువంటి పనిచేసుకోలేని నిస్సహాయ స్థితికి లోనైతే అతనికి  లక్ష రూపాయలు అందుతుంది.

 

ప్రయోజనం

 

ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన:

ఇది పూర్తిగా జీవిత బీమా. మరణం ఏ రూపంలో సంభవించినా పాలసీదారుడు సూచించినా నామినీకి రూ.2 లక్షలు అందుతుంది. దీనికి ఏడాదికి రూ.330లు ప్రీమియం చెల్లించాలి. దీనికి దరఖాస్తు చేసుకోవాలంటే 18 నుంచి 50 సంవత్సరాలలోపు వారు మాత్రమే అర్హులు. పాలసీ 5 వరుస సంవత్సరాలు అమలులో ఉంటుంది. దీనికి కూడా ప్రీమియం రూ.330లు ప్రతి ఏడాది జూన్ ఒకటో తేదీ నాటికి బ్యాంకు ఖాతాల్లో నిల్వ ఉండేలా చూసుకోవాలి. జూన్ ఒకటో తేదీ నుంచి బీమా అమలులోకి వస్తుంది. వ్యవసాయ కూలీలు, డ్రైవర్లు, ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులు, అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేసే ప్రతి ఒక్కరికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఒక వేళ ఎవరైనా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన రెండింటికీ ప్రీమియం చెల్లించిన పాలసీదారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీకి రెండు పథకాల నుంచి రూ.4 లక్షలు పరిహారం అందుతుంది.

 

అటల్ పెన్షన్ యోజన:

ఇది కేవలం భవిష్యత్తులో పెన్షన్ పొందేందుకు ఉద్దేశించిన పథకం. పెన్షన్ కనీసంగా వెయ్యి రూపాయల నుంచి రూ.5 వేల వరకు పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే పెన్షన్ 60 సంవత్సరాలు దాటిన తరువాతే అందుతుంది. పథకంలో చేరాలంటే 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు మాత్రమే అర్హులు. అసంఘటిత రంగంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. వెయ్యి రూపాయల పెన్షన్ పొందాలంటే 18 సంవత్సరాల వయస్సు ఉన్నవారు ప్రతినెల రూ.42 చొప్పున చెల్లించాలి. రూ.2 వేలు పెన్షన్ పొందాలంటే రూ.84, రూ.3 వేలు పెన్షన్ పొందాలంటే రూ.126, రూ.4 వేలు పెన్షన్ పొందాలంటే రూ.168, రూ.5 వేలు పెన్షన్ పొందాలంటే రూ.210లు చొప్పున ప్రీమియం చెల్లించాలి. అయితే ప్రీమియం వయస్సు పెరిగేకొద్దీ పెరుగుతూ ఉంటుంది. అయితే వేరే పెన్షన్ సౌకర్యం పొందుతున్నవారు ఈ పథకంలో దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులు. పాలసీదారుడు మరణిస్తే నామినీకి రూ.1.70 లక్షలు చెల్లించడంతోపాటు పెన్షన్ కూడా ప్రతినెలా ప్రభుత్వం చెల్లిస్తుంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top