బందరు పోర్టుకు 3 నెలల్లో పూలింగ్ పూర్తి


సాక్షితో కలెక్టర్ బాబు.ఎ

 

కలెక్టర్‌గా కృష్ణా జిల్లాకు ఒక టర్నింగ్ పాయింట్ సమయంలో వచ్చాను. కొత్త రాష్ట్రం ఏర్పడడం, కొత్తగా రాజధాని రావడం, విజయవాడ నగరానికి పెద్ద ప్రాజెక్టులు తేవాలనే ప్రభుత్వ సంకల్పానికి అధికారుల సహకారం తీసుకోవడం పెద్ద సవాల్‌గా చెప్పవచ్చు. నాలుగు హైవేలు, ఒక పోర్టు, ఎయిర్‌పోర్ట్, గ్రామస్థాయిలో రోడ్లు వేయడం, విద్యుదీకరణ వంటి మంచి పనులు చేసేందుకు అవకాశం కలిగింది. కనకదుర్గ ఫ్లైవోవర్, మెట్రో రైలు ప్రాజెక్ట్, ఇన్నర్ రింగ్‌రోడ్డు పనులను త్వరితగతిన పూర్తిచేయించడం నాకో చాలెంజ్. బందరు పోర్టుకు మూడు నెలల్లో ల్యాండ్ పూలింగ్ పూర్తిచేస్తాం. టీమ్ కృష్ణా పేరుతో పరిపాలనలో సంస్కరణలు తీసుకొస్తున్నాం.. అని కలెక్టర్ బాబు.ఎ. చెప్పారు. బుధవారం ఆయన సాక్షి ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు సంగతులు చెప్పారు.

 

 సాక్షి: జిల్లా గురించి ఏం చెప్పదలుచుకున్నారు?


 కలెక్టర్: కొత్తగా రాష్ట్రం ఏర్పడింది. కొత్త రాజధాని వచ్చింది. కృష్ణాజిల్లాను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి పథకాల అమలు, పరిపాలనాపరమైన సంస్కరణలు తీసుకురావాలని సీఎంగారు చెప్పారు. ఆ దిశగా ముందుకు సాగుతున్నాను. టీమ్ వర్క్ ద్వారా మంచి ఫలితాలు సాధిస్తున్నాం.  

 

సాక్షి:  ఈ-పోస్ విధానం అమలుపై మీ స్పందన?

 కలెక్టర్: ఈ విధానాన్ని దేశంలోనే తొలిసారిగా కృష్ణా జిల్లాలో ప్రారంభించాం. అనుకున్నది సాధించాం. అంగన్‌వాడీ సరకులు కూడా ఈ-పోస్ విధానంలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం ద్వారానే ఇస్తున్నాం. ఈ సంవత్సరం రూ.56 కోట్ల విలువైన సరకులు అక్రమార్కుల చేతుల్లోకి పోకుండా కాపాడాం.

 

సాక్షి: పింఛన్లు సరిగా అందడం లేదనే దానిపై ఏమంటారు?

 కలెక్టర్:  పింఛన్లు అందలేదనేది అవాస్తవం. ప్రతి నెలా ఒకటి నుంచి ఐదో తేదీలోపు 90 శాతం మందికి పింఛన్లు ఇస్తున్నాం.

 

సాక్షి:  ఈ-వైద్యం మాటేమిటి?

 కలెక్టర్: ఈ-వైద్యం చాలా ముఖ్యమైనది. జీజీహెచ్, ఇతర వైద్యశాలల్లో  దీనిపై కసరత్తు జరుగుతున్నది. ఇప్పటికే కంప్యూటర్‌లో పేషంట్ వివరాలు పొందుపరిచాము. ఇన్‌పేషంట్ వివరాలు పూర్తిస్థాయిలో ఉంటాయి. అవుట్ పేషంట్ వివరాలు కూడా ఎప్పటికప్పుడు పొందుపరుస్తున్నాం. ఇన్‌పేషంట్ విషయంలో అన్ని రకాల టెస్ట్‌లు, ట్రీట్‌మెంట్‌కు సంబంధించిన వివరాలు ఉంటాయి. ఆ పేషంట్ పేరు నమోదు చేయగానే గతంలో చేసిన వైద్యం, టెస్ట్‌ల వివరాలన్నీ కంప్యూటర్‌లో చూపిస్తాయి. దీనిని బట్టి తగిన వైద్యం అందించేందుకు సులువవుతుంది. అన్నిచోట్ల త్వరలోనే పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

 

సాక్షి: జీజీహెచ్‌లో ఉన్న సమస్యలపై ఏమంటారు?

 కలెక్టర్:  జీజీహెచ్‌లో సౌకర్యాలకు రూ.86 కోట్లు అవసరమని ప్రభుత్వాన్ని కోరగా, రూ.4 కోట్లు రిలీజ్ చేసింది. ఆస్పత్రిలో నూరుశాతం ప్రక్షాళన జరగలేదు.

 

సాక్షి:  మచిలీపట్నం అభివృద్ధి గురించి ఏమి చెప్పదలుచుకున్నారు?

 కలెక్టర్: మచిలీపట్నాన్ని చూడగానే జిల్లాస్థాయిలో దిగజారుతున్నట్టుగా అనిపిస్తుంది. అందుకే పోర్టును అభివృద్ధి చేయాల్సి ఉంది.

 

సాక్షి:  పుష్కర ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి?

 కలెక్టర్: ఈ పుష్కరాలకు పెద్దఎత్తున భక్తులు వస్తారని భావిస్తున్నాను. డిసెంబరులో పనులు మొదలు పెడుతున్నాం.

 

సాక్షి:  మెట్రో రైల్ ప్రాజెక్టు, ఎయిర్‌పోర్టు విస్తరణ పనులు ఎంతవరకు వచ్చాయి?

 కలెక్టర్: మెట్రోకు సర్వే పూర్తయింది. ప్రజలకు ఇబ్బంది లేకుండా స్పీడ్‌గా పనులుచేయిస్తాం. ఎయిర్‌పోర్టులో టెర్మినల్ పనులు పూర్తి కావచ్చాయి. ల్యాండ్ పూలింగ్‌కు నోటిఫికేషన్ ఇచ్చాం.

 

సాక్షి: జిల్లాలో రబీ పరిస్థితి ఏమిటి?

కలెక్టర్: రబీ పంటకు సాగునీరు వస్తుంది. ఈ ఏడాది వర్షాలు సరిగ్గా లేనందున 40వేల హెక్టార్లలో రైతులు ఖరీఫ్ పంట వేయలేకపోయారు. జిల్లాలో 14  కరువు మండలాలను ప్రభుత్వం ప్రకటించింది.

 

సాక్షి: రైతుల ఆత్మహత్యలపై మీ స్పందన ఏమిటి?

 కలెక్టర్: వారి ఆత్మహత్యలకు పంటలు పండకపోవడం ఒక్కటే కారణం కాదు. అయినా వారిలో చైతన్యం నింపేందుకు ఎప్పటికప్పుడు కౌన్సెలింగ్ ఇస్తున్నాం.

 

సాక్షి:  మీకోసంలో వస్తున్న అర్జీల పరిష్కారం సరిగ్గా లేదని ఆరోపణ ఉంది?

 కలెక్టర్: ఈ ఏడాది ఇప్పటివరకు మీకోసం, జన్మభూమి కార్యక్రమాల ద్వారా ఐదున్నర లక్షల అర్జీలు వచ్చాయి. వీటిలో 65 వేలు మినహా మిగిలిన అర్జీలన్నీ పరిష్కరించాం.

 

సాక్షి:  ఇసుక దందాను అరికట్టడంలో విఫలమయ్యారనే విమర్శ ఉంది?

కలెక్టర్: ఇసుక రీచ్‌లలో ఇంటర్నెట్ ద్వారా సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి కంట్రోల్ పాయింట్ విజయవాడలో పెట్టాం. సత్ఫలితాలనిస్తోంది.  

 

సాక్షి:  రాజధాని పనులు ఎలా జరుగుతున్నాయి?


కలెక్టర్: ఇది ఒక్క రోజుతో అయ్యేది కాదు. ‘టీమ్ కృష్ణా’ పేరుతో ఒక టీమ్‌ను ఏర్పాటుచేసి పనులను వేగవంతంగా ముందుకు తీసుకుపోతున్నాం.  

 

సాక్షి:  పరిపాలనా విధానంలో తీసుకొచ్చిన మార్పులేమిటి?


 కలెక్టర్: ఈ-ఆఫీస్ విధానాన్ని అమల్లోకి తెచ్చాం. ఇంకా పూర్తి కాలేదు. అన్ని కార్యాలయాల్లో జవాబుదారీతనాన్ని పెంచేందుకు ఈ పద్ధతి ఉపయోగపడుతుంది.

 - సాక్షి ప్రతినిధి, విజయవాడ

 

సాక్షి:  పోర్టు భూసేకరణను స్థానికులు వ్యతిరేకిస్తున్నారు కదా?

కలెక్టర్: ల్యాండ్ పూలింగ్ ద్వారానే భూములు తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాం. రాజధానికి ఇచ్చినట్లుగానే ఇక్కడ కూడా ఒక ప్యాకేజీ అమలు చేస్తే బాగుంటుందనే ఆలోచనకు వచ్చాం. మూడు నెలల్లో ల్యాండ్ పూలింగ్ పూర్తవుతుంది.

 

 సాక్షి:  కనకదుర్గ వద్ద ఫ్లైవోవర్ పుష్కరాలకు పూర్తవుతుందా?

 కలెక్టర్: తప్పకుండా. పుష్కరాలకు ముందే ఫ్లైవోవర్‌పై నుంచి రాకపోకలు జరుగుతాయని నూరు శాతం నమ్మకం నాకుంది.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top