తాడో..పేడో!


సాక్షి ప్రతినిధి, కడప : ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్లు. వారికి అనుగుణంగానే పాలకుల చర్యలు ఉండాలి. ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధులు, తుదకు అధికారులను సైతం ఒక్కటే సమస్య వేధిస్తోంది. అదే కలెక్టర్ నియంతృత్వం. తుదకు అధికార పార్టీలో సైతం ఒకరిద్దరు మినహా తక్కినవారంతా ఆవేదన చెందుతున్నారు. ఆయా వర్గాలు మూకుమ్మడిగా కలెక్టర్ కెవి రమణకు వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేశారు. సీఎం సమర్థిస్తుండటం వల్లే ఆయనిలా.. అంటూ పలువురు వాపోతున్నారు. జిల్లా క లెక్టర్‌గా కెవి రమణ ఏడాది కిత్రం బాధ్యతలు చేపట్టారు.

 

 నాటి నుంచి నేటి వరకు విద్యార్థులు, అధ్యాపకులు, ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రజా ప్రతినిధులు రాజకీయ పార్టీలు.. తుదకు రైతులు సైతం ఆయన శైలికి వ్యతిరేకంగా ఉద్యమించారు. ఎవరెంతగా విమర్శించినా ‘నా రూటు సపరేటు’ అన్నట్లుగానే కలెక్టర్ ధోరణి ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఒక కలెక్టర్ పట్ల జిల్లాలో ఇంతటి వ్యతిరేకత ఇదే తొలిసారి అని పలువురు చెప్పుకొస్తున్నారు. టీడీపీకి చెందిన ఒకే ఒక్క ఎంపీ మద్దతు మినహా మిగతా వారెవ్వరూ ఆయన పట్ల సుముఖంగా లేరని తెలుస్తోంది.

 

 సమన్వయ కమిటీలో తీర్మానం.....

 జిల్లా స్థాయిలో అధికార పార్టీలో సమన్వయ కమిటీ ఏర్పాటైంది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీ, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలున్న ఈ కమిటీ.. జిల్లా పరిస్థితులను ప్రతినెలా సమీక్షించి పరిస్థితిని సీఎం దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇటీవల కమలాపురం ఇన్‌ఛార్జి పుత్తా నరసింహారెడ్డి ఇంట్లో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికార పార్టీ నేతలు మూకుమ్మడిగా జిల్లా కలెక్టర్ శైలిపై చర్చించినట్లు తెలుస్తోంది. ఒకదశలో ఎంపీ సీఎం రమేష్‌ను మీ వరకు బాగుంటే సరిపోతుందా? అంటూ కొందరు నేతలు నిలదీసినట్లు సమాచారం. ‘అధికార పార్టీ అని పేరుకు చెప్పుకోవడం తప్ప కలెక్టర్  నుంచి ఎంపీకి మినహా మరెవ్వరికైనా ఆశించిన స్పందన ఉందా? గుండెల మీద చేయి వేసుకొని చెప్పండ’ని ఓ నాయకుడు నిలదీసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ‘మీ అందరికి అంత వ్యతిరేకత ఉన్నప్పుడు నాకేం బంధువు కాదు, సీఎం ృష్టికి సమస్యను తీసుకెళదా’మని ఎంపీ రమేష్ సూచించినట్లు నిఘా వర్గాలు వివరిస్తున్నాయి. అవకాశం ఉంటే శుక్రవారం గండికోట ప్రాజెక్టు వద్ద ముఖ్యమంత్రికి పరిస్థితి వివరించేందుకు సిద్ధమయ్యారని సమాచారం. అలా కుదరకపోతే హైదరాబాద్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలనే తలంపుతో ఉన్నట్లు తెలుస్తోంది.   కలెక్టర్ శైలి కారణంగా ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని, ఈ విషయమై సీఎంకు ఫిర్యాదు చేసేందుకు సన్నద్ధమయ్యామని టీడీపీ సీనియర్ నేత ఒకరు సాక్షికి ధ్రువీకరించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top