అత్తారింటికి వెళ్లొచ్చినట్లు..

అత్తారింటికి వెళ్లొచ్చినట్లు.. - Sakshi


సాక్షి,  గుంటూరు/విజయవాడ : అంతా అనుకున్నట్లే జరిగింది. చిన్న చిన్న నేరాలు చేసిన వారిని అరెస్టు చేసి, హడావుడి సృష్టించి, మీడియా ముందు ప్రవేశపెట్టే పోలీసులు... కారు రేసులు నిర్వహిస్తూ ఓ విద్యార్థి మృతికి కారకుడైన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరావు తనయుడు సిద్ధార్థ, అతడి స్నేహితుడు శివరాం విషయంలో మాత్రం వల్లమాలిన ప్రేమను కురిపించారు. అధికార పార్టీ నేతల మెప్పు పొందేందుకు పడరాని పాట్లు పడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎమ్మెల్యే తనయుడు సిద్ధార్థను ఎవరికి కనిపించకుండా స్టేషన్ పై గదిలో దాచి ఉంచిన విషయం తెలిసిందే. అనంతరం సకల మర్యాదలతో అతడిని విజయవాడ పంపించేశారు. పైకి మాత్రం సిద్ధార్థ పరారీలో ఉన్నట్లు బొంకారు. నిషిద్ధ కారు రేసులు నిర్వహిస్తూ ఓ యువకుడి మృతికి కారకుడైన వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ 304 (కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్)  కింద కేసు నమోదు చేయాల్సి ఉంటుందని సీనియర్ పోలీసు అధికారులు చెబుతుండగా, అధికార పార్టీ ఎమ్మెల్యే తనయుడు కావడంతో బొండా సిద్ధార్థపై మాత్రం 304ఏ, 337 సెక్షన్ల కింద నామమాత్రపు బెయిలబుల్ కేసులు నమోదుచేశారు. 140 కిలో మీటర్ల వేగంతో రేసులు ఆడుతుండగా.. రెండు కార్లు ప్రమాదానికి గురయ్యూయని స్థానికులు చెబుతున్నా.. పోలీసులు మాత్రం కుక్క అడ్డురావడంతో ప్రమాదవశాత్తూ కార్లు ఢీకొన్నాయని కట్టు కథ అల్లి కేసును తప్పుదోవ పట్టించారు.

 

 రహస్యంగా కోర్టుకు

 

 రెండు రోజుల్లో నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తామని చెప్పిన పోలీసులు గురువారం ఉదయం 7 గంటల సమయంలో విజయవాడలో రైతు బజారు వద్ద నిందితులను అరెస్టు చేశామని చెబుతూ, వారిని రహస్యంగా కోర్టుకు హాజరుపరిచే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత బెయిల్ మంజూరైంది. ఉదయం 7 గంటలకు అరెస్టు అయిన ఎమ్మెల్యే తనయుడు అతడి స్నేహితులు మధ్యాహ్నం 3 గంటల వరకు ఎక్కడ ఉన్నారనే విషయం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

 

 పోలీసుల అత్యుత్సాహం

 

 కోర్టులో హాజరుపరిచే వరకు నిందితులను పోలీసులు వారి ఆధీనంలో ఉంచుకోవాల్సి ఉంది. ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తనయుడు సిద్ధార్థ, అతడి స్నేహితుడు శివరాం మాత్రం అత్తారింటికి వచ్చినట్లుగా.. మందీమార్బలంతో వారి కార్లలో దర్జాగా కోర్టు ప్రాంగణంలో దిగారు. అక్కడే ఉన్న విలేకరులు ఫొటోలు తీసేందుకు యత్నించగా.. ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకుని సిద్ధార్థ చుట్టూ వలయంలా ఏర్పడ్డారు. ఈ సమయంలో పోలీసులెవరూ అక్కడ లేకపోవడం గమనార్హం. కోర్టులో బెయిల్ పొందిన సిద్ధార్థ, శివరాం తమ అనుచరుల చక్రబంధంలో ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుని బయటకువచ్చి వారి కార్లలో వెళ్లిపోయూరు. గమనించిన స్థానికులు వీరు నేరం చేసి వచ్చారా.. పండగకు అత్తారింటికి చుట్టపుచూపుగా వచ్చారా.. అంటూ సందేహం వెలిబుచ్చారు. ఎమ్మెల్యే తనయుడి విషయంలో పోలీసులు చూపిన ప్రేమ చట్టం అధికారపార్టీ చుట్టం అన్నట్లుగా మారిందనే విమర్శలు గుప్పుమంటున్నారుు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top