తప్పెవరిదైనా కానిస్టేబుళ్లే బలి!


 ఖాకీ బాస్‌ల తప్పులకు కానిస్టేబుళ్లు బలైపోతున్నారు. మిలట్రీ తర్వాత బాసిజం ఎక్కువగా కనిపించేది పోలీస్ శాఖలోనే. బాస్‌లు ఏం చెబితే అది కళ్లు మూసుకుని చేసే కానిస్టేబుళ్లే ఎక్కువమంది ఉంటారు. సార్లు తప్పు చేసినా.. లేదా చేయకున్నా వాళ్లపై ఆరోపణలు వచ్చినా.. ఏదేమైనా వాటి నుంచి బయటపడాల్సింది అధికారులే. కానీ.. మన జిల్లాలో అధికారుల తప్పిదాలకు కానిస్టేబుళ్లు బలిపీఠం ఎక్కుతున్నారు. అధికారులకు కనీసం మెమో కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నతాధికారులు కానిస్టేబుళ్లను మాత్రం సస్పెండ్ చేసేస్తున్నారు. భీమవరం టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఇటీవల చోటుచేసుకున్న కస్టోడియల్ డెత్ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. నక్కా దుర్గారావు (28) అనే యువకుడు పోలీస్ స్టేషన్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు వేధించడం వల్లే ఇతను స్టేషన్ బాత్‌రూమ్‌లో ఉరిపోసుకుని మరణించినట్టు పౌరహక్కుల సంఘం నేతలు, న్యాయవాదులు ఆరోపిస్తున్నారు.

 

 చనిపోయిన తర్వాతే కేసు?

 నిబంధనలకు విరుద్ధంగా దుర్గారావును స్టేషన్‌లో నిర్బంధించిన పోలీసులు అతని మృతి తర్వాతే కేసుల మీద కేసులు నమోదు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. సెక్షన్ 41ఏ సీఆర్‌పీసీ ఎమెండెంట్ యాక్ట్ ప్రకారం.. ఏడేళ్లలోపు శిక్షలకు సంబంధించిన అన్ని కేసుల్లోని నిందితులకు ముందుగా నోటీసులు ఇవ్వాలి. ఆ తర్వాతే అరెస్ట్ చేసి 24గంటల వ్యవధిలో కోర్టుకు హాజరుపరచాలి. అరెస్ట్ సమాచారం ఎస్‌హెచ్‌వోకు, సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్‌కు, ఎస్పీకి, కంట్రోల్ రూమ్‌కు అందజేసి.. విషయాన్ని జీడీలో ఎంట్రీ చేయాలి. కానీ దుర్గారావు కేసులో ఇవెక్కడా ముందుగా నమోదు కాలేదు. దుర్గారావు చనిపోయిన తర్వాతే హడావుడిగా కేసులు నమోదు చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ కేసుపై నరసాపురం ఆర్డీవో మెజిస్టీరియల్ విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు పోలీసు అధికారులను విడిచిపెట్టి జి.రాజబాబు, ఎన్.కనకరాజు అనే కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. బాధ్యులైన ఎస్‌హెచ్‌వో ఇతర అధికారులను పక్కనపెట్టి చిరుద్యోగులైన కానిస్టేబుళ్లపై చర్యలేమిటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

 నిబంధనలు ఏం చెబుతున్నాయ్

 సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లాకప్ డెత్ జరిగితే సంబంధిత స్టేషన్ అధికారులను ముందుగా  తప్పిం చాలి. 1994లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన జోగేందర్‌కుమార్ లాకప్ డెత్ కేసులో నాటి సుప్రీంకోర్టు  ప్రధాన న్యాయమూర్తి ఎంఎన్ వెంకటాచలయ్య సంచలన తీర్పునిచ్చారు. కస్టోడియల్ డెత్, లాకప్ డెత్ ఘటనలపై డీఎస్పీ లేదా పై స్థాయి అధికారి విచారణ చేప ట్టాలని, ఆ డివిజన్ అధికారి కాకుండా మరో డివి జన్‌కు చెందిన అధికారే విచారణ సాగించాలని పేర్కొన్నారు. అదేవిధంగా సాక్ష్యాలు తారుమారు కాకుండా కేసు విచారణ పూర్తయ్యే వరకు సంబంధిత స్టేషన్ ఎస్‌హెచ్‌వోను, అధికారి సేవలను తాత్కా లికంగా నిలుపుదల చేయాలని పేర్కొన్నారు. లాకప్, కస్టోడియల్ డెత్ చోటుచేసుకున్న స్టేషన్ల ఆఫీసర్లను ముందుగా విధుల నుంచి తప్పించి.. విచారణ పూర్తయిన తర్వాత తప్పు లేదని తేలితే తిరిగి పోస్టింగ్‌లు ఇచ్చిన దాఖలాలు మన జిల్లాలోనూ ఉన్నాయి.

 

 గతంలో అలా.. ఇప్పుడెందుకు ఇలా

 ఏడాది కిందట జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్‌లో లాకప్ డెత్ జరిగిన దరిమిలా ముందుగా అక్కడి అధికారులనే సస్పెండ్ చేశారు. పెరవలిలో పోలీసుల దెబ్బలకు తట్టుకోలేక ఆసుపత్రిలో  ఓ వ్యక్తి చనిపోయిన ఘటన నేపథ్యంలో కూడా ముందుగా సీఐని సస్పెండ్ చేశారు. కానీ భీమవరం ఘటనలో మాత్రం అధికారుల జోలికి వెళ్లకపోవడం గమనార్హం. కేవలం సామాజిక వర్గాల కోణంలోనే ఉన్నతాధికారులు సదరు అధికారులను వెనకేసుకు వస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికితోడు అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి ఒత్తిళ్ల నేపథ్యంలోనూ ఉన్నతాధికారులు సదరు అధికారుల జోలికి వెళ్లడం లేదని అంటున్నారు.

 

 ఇప్పటికే భీమవరం వన్‌టౌన్ పోలీసుల వేధింపులతోనే గాజుల వెంకటరత్నం అనే వ్యక్తి చనిపోయారని అతని బంధువులు పోలీస్ స్టేషన్‌ను ముట్టడించడం, వీరవాసరం పోలీస్ స్టేషన్‌లో పోలీసులు సృష్టించిన భయానక పరిస్థితులు తట్టుకోలేక ఓ యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని మృతి చెందడం తదితర ఘటనలు జిల్లా పోలీస్ యంత్రాంగానికి మచ్చతెచ్చాయి. ఇటువంటి పరిస్థితుల్లో నిబంధనల ప్రకారం నిక్కచ్చిగా వ్యవహరించి పోలీసులకునైతిక స్థైర్యం కల్పించాల్సిన ఉన్నతాధికారులు పెద్దోళ్ల జోలికి పోకుండా చిన్నోళ్లను బలిచేయడమే ఇప్పుడు పోలీసు వర్గాల్లోనే చర్చకు తెరలేపింది.

 - జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top