బెట్టింగ్‌కు పోలీస్ కోటింగ్


సాక్షి, గుంటూరు

 రూరల్ జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ బంగార్రాజుల కోసం పోలీసులు వేట ప్రారంభించారు. క్రికెట్ బెట్టింగ్‌ల మాయలో పడి యువత పెడదోవ పడుతూ తమ జీవితాలను ఛిద్రం చేసుకుంటు న్నారని  ‘యువత గుల్ల’ శీర్షికన గత నెల 9న ‘సాక్షి' ప్రచురించిన కథనానికి రూరల్ ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ స్పందించారు.



     అప్పటి నుంచి వారానికో ప్రాంతంలో బెట్టింగ్ రాయుళ్లను పోలీస్ స్టేషన్‌లకు పిలిపిస్తున్నారు. వారి ద్వారా అసలు నిర్వాహకుల ఆచూకీ కనిపెట్టి వారినీ అదుపులోకి తీసుకుని బైండోవర్ చేయిస్తున్నారు.

     హైదరాబాద్ నుంచి జిల్లాకు క్రికెట్ బెట్టింగ్ లైన్ ఇచ్చే బుకీల ఫోన్ నంబర్ల ఆధారంగా వారిని పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.



     గతంలో బెట్టింగ్ నిర్వహిస్తూ దొరికిన వారితోపాటు కొత్తగా ఎవరున్నారనే సమాచారం సేకరించాలని ఆయా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓలకు ఎస్పీ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో బెట్టింగ్ నిర్వాహకులతో సంబంధాలు నెరుపుతున్న కొందరు పోలీస్ అధికారులు ఇరకాటంలో పడ్డారు.



     ఈ వ్యవహారాన్ని ఎస్పీ సీరియస్‌గా తీసుకోవడం,  క్రైం బ్రాంచ్ పోలీసుల నిఘా ఉందని తెలుసుకున్న సదరు పోలీస్ అధికారులు చేసేది లేక అందరిని స్టేషన్‌లకు పిలిచి బైండోవర్ చేస్తున్నారు. పెద్దపెద్ద బుకీలు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.



 బెట్టింగ్ లైన్ నిలిపిన బుకీలు....

     రూరల్ ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ దెబ్బకు బెట్టింగ్ రాయుళ్లు, నిర్వాహకులే కాకుండా బుకీలకు సైతం దిమ్మతిరిగి పోతోంది.

     ఇప్పటికే పలు పట్టణాల్లో బెట్టింగ్ నిర్వాహకులను స్టేషన్‌లకు పిలిచి వారి ద్వారా బుకీల ఫోన్ నంబర్లు తెలుసుకుని హెచ్చరికలు చేయడంతోపాటు వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.



     విషయం తెలుసుకున్న క్రికెట్ బుకీలు ఆయా పట్టణాలకు లైన్ ఇవ్వడం నిలిపివేశారు.

 దీంతో ఇప్పుడు గోప్యంగా కారుల్లో ల్యాప్‌టాప్‌లు పెట్టుకుని రోడ్లపై తిరుగుతూ లేదా మారుమూల ప్రాంతాల్లో బెట్టింగ్ కొనసాగిస్తున్నారు.



 బెట్టింగ్ మూలాలపై ఎస్పీ దృష్టి...

     బెట్టింగ్ కేంద్రాలపై దాడులు చేసినప్పుడు ఆడేవారిపై మాత్రం కేసులు నమోదుచేసి వదిలేయడం పోలీసులకు పరిపాటిగా మారింది. దీన్ని అలుసుగా తీసుకుని బెట్టింగ్ రాయుళ్లు మరింత రెచ్చిపోతున్నారు.



     పోలీస్ అధికారులకు మామూళ్లు ఇచ్చి ఎక్కడ బెట్టింగ్ నిర్వహించేది వారికి చెప్పి మరీ చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.



     ఈ వ్యవహారాన్ని క్షుణ్ణంగా గమనించిన రూరల్ ఎస్పీ రామకృష్ణ అసలు మూలాలను పెకిలించే చర్యలు చేపడుతున్నారు.



     దీనిలో భాగంగా ఆదివారం తెనాలి, కొల్లిపర, గురజాలతోపాటు పలు ప్రాంతాల్లో బెట్టింగ్  నిర్వహిస్తున్న వారిని, ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకుని ఆరా తీస్తున్నారు. అన్ని స్టేషన్‌ల నుంచి బెట్టింగ్ నిర్వాహకుల జాబితా తెప్పించుకుంటున్నారు.



     ఎస్పీ చర్యలతో బెట్టింగ్ రాయుళ్లతోపాటు వారికి సహకరించే పోలీస్ అధికారులు సైతం హడలిపోతున్నారు.



     అయితే హడావుడి చేసి వదిలేయకుండా ఎస్పీ రామకృష్ణ సీరియస్‌గా తీసుకుని అరికట్టగలిగితే  జిల్లా ఆదర్శంగా నిలవడంతోపాటు ఎంతో మంది జీవితాలను నిలబెట్టిన వారవుతారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top