వంతెనపై వసూల్ రాజాలు


- పోలీసుల ‘దారి’ దోపిడీ

- వాహనచోదకుల నుంచి

- భారీగా గుంజుడు


ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రారంభించకపోయినా.. గోదావరిపై నాలుగో వంతెనపై రాకపోకలకు ప్రజలు ఇప్పటికే శ్రీకారం చుట్టారు. అటు రోడ్ కమ్ రైలు వంతెనను మరమ్మతులకోసం మూసివేయడం.. రావులపాలెం, ధవళేశ్వరం బ్యారేజి మీదుగా రాజమండ్రి చేరుకోవడం దూరం కావడంతో.. లారీలు, కార్లు, ఇతర వాహనాలు నాలుగో వంతెన పైనుంచే అనధికారికంగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఇదే అదునుగా పోలీసు శాఖలోని వసూల్ రాజాలు చెలరేగిపోతున్నారు. వాహనానికింత అని రేటు నిర్ణయించి అక్రమంగా వసూళ్లు చేస్తున్నారు. డ్యూటీతో సంబంధం లేకుండా వంతెనపై యథేచ్ఛగా దందా సాగిస్తున్నారు.

 

రాజమండ్రి :గోదావరి నాలుగో వంతెనపై పోలీసుల వసూళ్లదందా పట్టపగ్గాల్లేకుండా సాగుతోంది. అనధికారికంగా వంతెనపై రాకపోకలు సాగిస్తున్న వాహనచోదకులను అడ్డుకుని భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. లారీలు, ద్విచక్ర వాహన చోదకుల నుంచి ప్రతి రోజూ వేలాది రూపాయలు దోపిడీ చేస్తున్నారు. రాజమండ్రి - కొవ్వూరు మధ్య ఉన్న రోడ్డు కమ్ రైలు వంతెనపై మరమ్మతుల కోసం ఈ నెల 2 నుంచి వాహనాల రాకపోకలు నిలిపివేశారు.



వంతెన పనులు 45 రోజులపాటు జరిగే అవకాశమున్నందున వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించారు. దీంతో వాహనదారులు ధవళేశ్వరం బ్యారేజ్ మీదుగా రాకపోకలు సాగించాల్సి వస్తోంది. దీనిపై కేవలం ద్విచక్ర, త్రిచక్ర వాహనాలతోపాటు బస్సులను మాత్రమే అనుమతించారు. దీంతో రావులపాలెం మీదుగా లారీలు ప్రయాణించాల్సి వస్తోంది. దీనివల్ల కనీసం 90 కిలోమీటర్లు చుట్టుతిరిగి వెళ్లాల్సి వస్తోంది. ఇదే సమయంలో రాజమండ్రి - కొవ్వూరు మధ్య దాదాపు నిర్మాణం పూర్తవుతున్న నాలుగో వంతెనపై నుంచి వాహనచోదకులు రాకపోకలు ఆరంభించారు. ఈ వంతెనను ప్రభుత్వం ఇంతవరకూ ప్రారంభించలేదు.



అయినప్పటికీ దాదాపు నిర్మాణం పూర్తి కావస్తున్న ఈ వంతెన పైనుంచి లారీలు, కార్లు, ద్విచక్ర వాహనదారులు రాకపోకలు సాగిస్తున్నారు. దీనివల్ల వారికి సమయంతోపాటు ఇంధనం ఆదా అవుతోంది. ముఖ్యంగా రావులపాలెం మీదుగాకంటే నాలుగో వంతెన మీద రాకపోకలు చేసేవారికి విశాఖ - విజయవాడ మధ్య సుమారు 45 కిలోమీటర్ల దూరం కలిసివస్తోంది. దీంతో వారు కూడా ఈ వంతెన పైనుంచే రాకపోకలు సాగిస్తున్నారు. రాజమండ్రి - కొవ్వూరు మధ్య వాహనదారులకు ధవళేశ్వరం బ్యారేజికంటే ఈ వంతెన మీదుగానే రాకపోకలు సులువవుతోంది. కాతేరువద్ద అప్రోచ్ రోడ్డు నుంచి కిందకు దిగి అక్కడ నుంచి నేరుగా రాజమండ్రి నగరంలోకి వస్తున్నారు. దీంతో వందలమంది ద్విచక్ర వాహనదారులు ఈ వంతెనమీదుగా రాకపోలు సాగిస్తున్నారు.



అనధికారికంగా సాగుతున్న ఈ రాకపోకలే పోలీసులకు కాసుల పంట పండిస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో సంబంధం లేకుండా ఎవరు పడితే వారు రోడ్డుమీద స్వతంత్రంగా బీటు వేసి అక్రమంగా డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారు. ముగ్గురు ట్రాఫిక్ పోలీసులను ఏర్పాటు చేసినా ఉపయోగం లేకుండా పోయింది. ఇక్కడ దందా సాగిస్తున్న పోలీసులు లారీకి రూ.300 నుంచి రూ.500 వరకు, కార్లు, ఇతర చిన్నవాహనదారుల నుంచి రూ.200, ద్విచక్ర వాహనదారుల నుంచి రూ.100 చొప్పున వసూలు చేస్తున్నారు.



రాజమండ్రి, రాజానగరం, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు స్టేషన్లకు చెందిన పోలీసులు వంతుల వారీగా ఎవరికి వారు డ్యూటీలు వేసుకున్నట్టుగా వసూళ్ల దందాకు పాల్పడుతుండడంతో వాహనచోదకులు బెంబేలెత్తుతున్నారు. వెను తిరిగే వీలు లేకుండా వంతెన మొదట్లో కాపు కాయడంతో అడిగినంతా పోలీసుల చేతిలో పెట్టాల్సి వస్తోంది. రాత్రి వేళల్లో అయితే పోలీసుల దోపిడీకి పట్టాపగ్గాల్లేకుండా పోతోంది.



నైట్‌బీట్ వేస్తే నగరంలో గస్తీ తిరగడం మాని ‘చలో నాలుగో వంతెన’ అంటూ పోలీసులు తరలిపోవడం వెనుక ఈ దందాయే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకసారి ఇక్కడ బీటు వేస్తే చాలు రోజుకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకూ అయాచితంగా వచ్చి పడుతోంది. దీంతో ఇక్కడ అనధికార డ్యూటీ చేసేందుకు పోలీసులు ఎగబడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ దారిదోపిడీని నిలువరించాలని వాహనచోదకులు కోరుతున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top