పోలీసు వేధింపులు ప్రారంభం

పోలీసు వేధింపులు ప్రారంభం - Sakshi


► టార్గెట్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ

►బెట్టింగ్‌ వ్యవహారంలో ఇద్దరు ఎమ్మెల్యేలకు నోటీసుల జారీ

►16న సిద్ధం చేసిన నోటీసులు  20వ తేదీన జారీ

► 22న నగర ఎమ్మెల్యే అనిల్, రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి హాజరు కావాలని నోటీసులు

► గతంలో రాజకీయ నేతలకు సంబంధంలేదని ప్రకటించిన ఎస్పీ

► ప్రకటనలకు భిన్నంగా నోటీసుల జారీ

► అధికారపార్టీ ఒత్తిడితోనే నోటీసులు




జిల్లాలో అధికార పార్టీ వేధింపుల పర్వానికి తెర లేపింది. ముఖ్యంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం పోలీసుల ద్వారా ఒత్తిడికి గురి చేస్తోంది. బెట్టింగ్‌ రాకెట్‌లో పాలకపక్ష, ప్రతి పక్ష ఎమ్మెల్యేలకు ఎవరికి సంబంధం లేదని తమ విచారణలో తేలిందని ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ ఒకటికి మూడు పర్యాయాలు ప్రకటించారు.



అయితే ఆదివారం ఉదయం నంద్యాల వెళ్లి మరీ నెల్లూరు నగర, రూరల్‌ ఎమ్మెల్యేలు పి.అనిల్‌కుమార్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి నోటీసులు అందజేశారు. ఈ నెల 22వ తేదీన ఎస్పీ కార్యాలయానికి హాజరై సమాచారం ఇవ్వాల్సిందిగా నోటీసులో సూచించారు. దీంతో పోలీసు చర్యపై జిల్లాలో తీవ్ర చర్చ మొదలైంది.




సాక్షి ప్రతినిధి, నెల్లూరు : నెల్లూరు నగరంలో, రూరల్‌ ప్రాంతంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి బలమైన క్యాడర్‌ ఉంది. ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి మంచి పేరు ఉంది. ఈ క్రమంలో అధికార పార్టీ వ్యూహాత్మక ఎత్తుగడకు తెర తీసింది. బెట్టింగ్‌ వ్యవహారంలో ఎమ్మెల్యేలను ఇరికించి ఇబ్బంది పెట్టాలని అమాత్యుల ద్వారా పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో పోలీసులు కూడా అదే రీతిలో వ్యవహరిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.



సమర్థవంతమైన అధికారిగా, ముక్కుసూటిగా వ్యవహరించే వ్యక్తిగా ఎస్పీకి మంచి పేరు ఉంది. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా చట్టానికి లోబడి పనిచేస్తారు. బెట్టింగ్‌ వ్యవహారంలోనూ అధికార పార్టీ ఒత్తిళ్లను పట్టించుకోకుండా వచ్చారు. అయితే కేసు ముగింపు దశలో ఉన్నప్పుడు మళ్లీ విచారణకు తెర లేపడం అనేక అనుమానాలకు తావిస్తోంది. బెట్టింగ్‌ రాకెట్‌ వ్యవహారంలో కీలకవ్యక్తి కృష్ణసింగ్‌తో పాటు 230 మందిని ఇప్పటికే అరెస్ట్‌ చేశారు.



వీరిలో ప్రధాన బుకీలపై గంజాయి, పోలీసులపై దాడి చేశారని నాన్‌బెయిల్‌బుల్‌ కేసులను నమోదు చేశారు. 230 మందిలో పలు రాజకీయ పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు ఇతరులు కూడా ఉన్నారు. బెట్టింగ్‌ రాకెట్‌ను మూలాలతో నిర్మూలించడంపై వైఎస్సార్‌సీపీ నాయకులు హర్షం ప్రకటించి పోలీసులు చర్యను సమర్థించారు. ఈ క్రమంలో ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ పలుమార్లు మాట్లాడుతూ బెట్టింగ్‌ వ్యవహారం ముగింపునకు వచ్చిందని దీనిలో ఎమ్మెల్యేలు, ఇతరులు ప్రమేయం లేదని నెల్లూరు, వెంకటగిరిలో ప్రకటించారు. పోలీసులు ప్రకటనలకు భిన్నంగా వ్యవహారం నడుస్తుండటం గమనార్హం.



నంద్యాలకు వెళ్లి మరీ నోటీసులు

పోలీసులు జారీ చేసిన నోటీసుల వ్యవహారం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ నెల 16వ తేదీన సిద్ధం చేసిన నోటీసులు నాలుగు రోజులు ఆలస్యంగా ఎమ్మెల్యేలకు అందజేశారు. 16వ తేదీన సిద్ధం చేసిన నోటీసుపై ఏఎస్పీ విఠలేశ్వరరావు 16న సంతకం చేసినట్లు ఉంది. సీఆర్‌పీ సెక్షన్‌ 160 ప్రకారం ఎస్పీ కార్యాలయానికి 22వ తేదీన హాజరు కా వాలని నోటీసులో పేర్కొన్నారు.



ఆదివారం ఉదయం నా యుడుపేట సీఐ రత్తయ్య, అతని బృందం కర్నూలు జిల్లాలోని నంద్యాల వెళ్లి ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి వ్యక్తిగతంగా అందజేశారు. అయితే ఈ వ్యవహరంలో పోలీసులు అడుగడుగునా పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు. ఈ నెల మూడో తేదీన క్రికెట్‌ ప్రధాన బుకీ కృష్ణసింగ్‌ను అరెస్ట్‌ చేసి విలేకరుల సమావేశం నిర్వహించారు. బెట్టింగ్‌ వ్యవహారంలో ఎమ్మెల్యేల పాత్ర ఏమిలేదని, తమకు ఎలాంటి ఆధారాలు లభించలేదని ప్రకటించారు.



ఆ తరువాత 14వ తేదీన రూరల్‌ ఎమ్మె ల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఎస్పీని కలిసి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు పాత్ర ఉంటే పేర్లు వెల్లడించి కేసు నమోదు చేయాలని, కొన్ని పత్రికల్లో తప్పుడు కథనాలు రాస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో  ఏ ఎమ్మెల్యే పాత్ర బెట్టింగ్‌లో లేదని స్పష్టం చేశారు. మళ్లీ 16వ తేదీన నోటీసులు సిద్ధం చేసిన క్రమంలో 18న వెంకటగిరిలో ఎస్పీ మాట్లాడుతూ బెట్టింగ్‌ వ్యవహారంలో ప్రజాప్రతిని«ధులకు సంబంధించి ఎలాంటి పాత్ర లేదని చెప్పారు. అలాగే రెండో పర్యాయం కృష్ణసింగ్, ఇతరులను కస్టడీలోకి తీసుకుని విచారించిన సందర్భంలోనూ కేసు ముగింపులో ఉందని మరో ముగ్గురిను అరెస్ట్‌ చేస్తే కేసు ముగిసినట్లేనని చెప్పారు. దానికి భిన్నంగా హడావిడిగా నంద్యాల వెళ్లి నోటీసులు జారీ చేశారు.



ఎలాంటి విచారణనైనా ఎదుర్కొంటా

తాను విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నాని కృష్ణసింగ్‌తో సహా ఎవరి వద్ద ఒక రూపాయి తీసుకున్నది కానీ, వారితో సంబంధాలు నాకు లేవు. మేము ఎటువంటి తప్పు చేయలేదు. నిజాయితీగా ఉండే ముము పోలీసు విచారణకు హాజరై వారికి పూర్తిస్థాయిలో సహకరిస్తాం. బెట్టింగ్‌ వ్యవహారంలో నాపై ఇంత వరకు ఎలాంటి ఆరోపణ రాలేదు. నాకు ఎవరి తోనూ సంబంధాలు, స్నేహాలు కూడా లేవు. ఏను క్రికెట్‌ బుకీ, పంటర్‌ని కాదు. అలాగే అసాంఘిక శక్తులను ప్రోత్సహించే వ్యక్తిని కాదు. కాబట్టే విచారణకు ధైర్యం గా వెళ్ళి అన్ని అంశాలపై మాట్లాడుతా. –అనిల్‌కుమార్, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే



విచారణ తరువాత అన్ని మాట్లాడుతా

22వ తేదీన ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరవుతా.  అనంతరం అన్ని విషయాలపై మాట్లాడుతా. ఎవరి ప్రమేయం లేదని పదే పదే ప్రకటించిన పోలీసులు నోటీసులు జారీ చేయడంపై అనుమానాలు ఉన్నాయి. నేను ఎలాంటి తప్పు చేయలేదు.

 –కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే



సాక్ష్యాలుగా మాత్రమే

బెట్టింగ్‌ విచారణ వ్యవహారంలో కొన్ని విషయాలపై సాక్ష్యాలు సేకరించడం కోసం ఇద్దరు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశాం. ప్రజాప్రతినిధులు కాబట్టి నోటీసులు ద్వారా హాజరుకావాలని కోరాం. ఇది రాజకీయపరమైన అం శం కాదు. మిగిలిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఇతరులకు సంబంధం లేదు.

–పీహెచ్‌డీ రామకృష్ణ, ఎస్పీ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top