పోలీస్ వేట !

పోలీస్ వేట ! - Sakshi


క్రికెట్ బెట్టింగ్‌పై రూరల్ ఎస్పీ సీరియస్

పందెంరాయుళ్లను అదుపులోకి తీసుకుని విచారణ

ప్రధాన నిర్వాహకులు, బుకీల కోసం అంతటా గాలింపు

వారి జోలికివెళ్లవద్దంటూ టీడీపీ ఎమ్మెల్యేల ఆదేశాలు


 

జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు, బుకీల కోసం పది రోజులుగా జిల్లా పోలీసులు వేట కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికే అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో బెట్టింగ్‌లు కాసే పందెం రాయుళ్లను అదుపులోకి తీసుకుని నిర్వాహకులు, బుకీల వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. వారిచ్చిన సమాచారం మేరకు ‘పట్టివేత’కు పోలీసులు పరుగులు తీస్తున్నారు. బెట్టింగ్‌ల నిర్వహణపై కఠినంగా వ్యవహరిస్తున్న రూరల్ ఎస్పీ  పహెచ్‌డీ రామకృష్ణ ‘నిర్వాహకుల పట్టివేత’ బాధ్యతను  సీసీఎస్ పోలీసులకు అప్పగించారు. దీంతో ఏఎస్పీ శోభా మంజరి, డీఎస్పీ సుధాకర్‌ల నేతృత్వంలోని పోలీస్ బృందాలు జిల్లాలో బెట్టింగ్ నిర్వాహకుల జాబితా రూపొందిస్తున్నారు.



జిల్లాలో వేళ్లూనుకున్న క్రికెట్ బెట్టింగ్ మహమ్మారిని కూకటివేళ్లతో పెకిలించి వేసేందుకు రూరల్ ఎస్పీ రామకృష్ణ సీరియస్‌గా దృష్టి సారించారు.



ఇప్పటికే  పందాలు కాసే వారిని అదుపులోకి తీసుకుని బైండోవర్ చేయిస్తున్నారు. వారి నుంచే  ప్రధాన నిర్వాహకులు, బుకీల వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.



జిల్లా వ్యాప్తంగా బెట్టింగ్ నిర్వాహకులు వంద మంది వరకు ఉండగా, పెద్ద బుకీలు 10 మంది ఉన్నారు. వీరందరిని గుర్తించి కఠిన చర్యలు చేపడితే జిల్లాలో క్రికెట్ బెట్టింగ్‌ల జాఢ్యాన్ని రూపుమాపవచ్చనేది ఎస్పీ ఆలోచనగా తెలుస్తోంది.

 

మామూళ్లు అందుకుంటున్న అధికారులపై ఒత్తిళ్లు



క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుల నుంచి నెల నెలా రూ.లక్షల్లో  మామూళ్లు అందుకుంటున్న పోలీస్ అధికారులు రూరల్ ఎస్పీ చర్యలతో హడలిపోతున్నారు.



దొంగచేతికి తాళాలు ఇచ్చినట్టు ఆయా పోలీస్ స్టేషన్‌ల పరిధిలో బెట్టింగ్ నిర్వాహకులను అదుపులోకి తీసుకునే బాధ్యతను వారికే అప్పజెప్పారు.



ఓ వైపు ఎస్పీ ఆదేశాలు మరో వైపు బెట్టింగ్ నిర్వాహకుల ఒత్తిళ్లతో సదరు పోలీస్ అధికారులకు కంటిపై కునుకులేకుండా పోతుంది.



నిర్వాహకులను పట్టుకుని విచారిస్తే తమ పేర్లు ఎక్కడ బయటకు వస్తాయోననే భయం మూమూళ్లు అందుకుంటున్న పోలీస్ అధికారులో నెలకొంది.



మామూళ్లు అందుకుంటూ మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటూ బెట్టింగ్ నిర్వాహకులు నిలదీస్తుండటంతో ఉన్నతాధికారుల ఒత్తిడి అర్థం చేసుకోవాలని అవినీతి పోలీస్ అధికారులు బతిమాలుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.



ఇదిలా ఉంటే కీలక బుకీలకు వారే సమాచారం అందించి అజ్ఞాతంలోకి వెళ్లమని సలహా కూడా ఇస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో జరుగుతున్న హడావుడి చూసి  నిర్వాహకులు పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది.

 అధికారపార్టీ నేతల ఒత్తిడి..



   జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వాహ కులను పట్టుకునేందుకు గాలింపు చేపడుతుండగా, వారిజోలికి వెళ్లవద్దంటూ పోలీస్ ఉన్నతాధికారులపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం.



ఇప్పటికే బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకుని అప్పులపాలైన అనేక కుటుంబాలు రోడ్డున పడ్డారు. కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇన్ని అనర్థాలకు కారణమైన బెట్టింగ్‌ను రూపుమాపేందుకు పోలీసులు చేపడుతున్న చర్యలకు అధికారపార్టీ నేతలు అడ్డు తగలడం పట్ల పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.



సమాజానికి ఉపయోగపడే ఇలాంటి విషయాల్లోనైనా ఒత్తిళ్లకు లొంగకుండా తమ విధులు నిర్వహించాలని పోలీస్ ఉన్నతాధికారులను ప్రజలు కోరుతున్నారు.

 

 

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top