హత్యా..ఆత్మహత్యా..?

హత్యా..ఆత్మహత్యా..? - Sakshi


ఒంగోలు క్రైం : అనుమానాస్పదస్థితిలో మృతిచెందిన రాయపూడి మేరీలీల కేసు దర్యాప్తు ముందుకు సాగడం లేదు. సంఘటన జరిగి 50 రోజులైనప్పటికీ నేటికీ ఈ కేసు ఒక కొలిక్కిరాలేదు. ఆమెది హత్యా..ఆత్మహత్యా..? అనే విషయాన్ని పోలీసులు నిర్ధారించలేకపోతున్నారు. మేరీలీల మృతిపై నెలకొన్న అనేక సందేహాలను సైతం వారు నివృత్తి చేయలేకపోతున్నారు. చీమకుర్తి మండలం పాటిమీదపాలెం గ్రామానికి చెందిన మేరీలీలను నెల్లూరు జిల్లా వింజమూరుకు చెందిన వ్యక్తికిచ్చి వివాహం చేశారు.

 

అయితే, ఎన్నికల సందర్భంగా గత మే నెలలో పాటిమీదపాలెం వచ్చిన మేరీలీల కొద్దిరోజుల పాటు ఇక్కడే ఉండిపోయింది. జూన్ 11వ తేదీ అదృశ్యమై ఆ మరుసటి రోజు గ్రామ సమీపంలోని బావిలో మృతదేహమై తేలింది. మృతదేహాన్ని నెల్లూరు జిల్లా వింజమూరులోని అత్తగారింటికి తరలించి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఆ సమయంలో శరీరంపై గాయాలున్నట్లు మెట్టినింటివారు గుర్తించారు. అయినప్పటికీ అంత్యక్రియలు పూర్తిచేశారు. అనంతరం తమ కుమార్తె మృతిపై అనేక అనుమానాలున్నాయని ఆమె తల్లి చీదర్ల అరుణ జూన్ 14వ తేదీ చీమకుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో స్థానిక ఎస్సై వై.నాగరాజు అనుమానాస్పదస్థితి మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

దర్యాప్తులో డొల్లతనం...

మేరీలీల అనుమానాస్పదస్థితి మృతి కేసు దర్యాప్తులో డొల్లతనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. సంఘటన జరిగి 50 రోజులైనప్పటికీ ఆమెది హత్యా..ఆత్మహత్యా..? అనేదానిపై పోలీసులు చేపట్టిన విచారణ ఒక్కడుగు కూడా ముందుకు సాగలేదు. ఒకవేళ ఆత్మహత్య చేసుకుని ఉంటే ఆమె శరీరంపై ఉన్న బంగారు నగలు ఏమైనట్లు..? ఆమెకు సెల్‌ఫోన్ వాడే అలవాటుంది. ఆమె చనిపోయినప్పటి నుంచి ఆ సెల్‌ఫోన్ కూడా కనిపించడం లేదు. వీటన్నింటి ఆధారంగా మేరీలీలది హత్యేనని, కానీ, పోలీసు దర్యాప్తు సక్రమంగా లేదని ప్రజాసంఘాలు, దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి.

 

తొలుత మేరీలీల మృతిపై ఆమె తల్లిదండ్రులు నోరు మెదపలేదు. దళిత సంఘాలు, ప్రజాసంఘాలు నిజనిర్ధారణ కమిటీగా ఏర్పడిన అనంతరం వారు కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. బావిలో నుంచి మృతదేహాన్ని బయటకు తీసే సమయంలో ఆ గ్రామానికి చెందిన వీఆర్‌ఏ సంఘటన స్థలానికి చేరుకున్నారు. వీఆర్వోకు కూడా సమాచారం అందించారు. కానీ, వారిద్దరూ ఉన్నతాధికారులకుగానీ, పోలీసులకుగానీ సమాచారం అందించలేదు. మృతదేహాన్ని అంత్యక్రియల కోసం నెల్లూరు జిల్లాలోని ఆమె మెట్టినింటికి తరలిస్తుంటే చూస్తూ ఉండిపోయారు. దీనిపై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పి.నాయుడుపాలెం గ్రామానికి చెందిన పలువురికి మేరీలీల మృతితో సంబంధం ఉందని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి.

 

జూన్ 11వ తేదీ రాత్రి ఆమెతో కలిసి మరో మహిళ కూడా బయటకు వెళ్లినట్లు సమాచారం కాగా, పోలీసులు ఇలాంటి వాటన్నింటిపై పూర్తిస్థాయిలో దృష్టిసారించి దర్యాప్తు చేస్తున్న దాఖలాలు కనిపించడంలేదు. నెల్లూరు జిల్లా వింజమూరులో అంత్యక్రియలు నిర్వహించిన మేరీలీల మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బయటకు తీయించిన పోలీసులు.. ఫోరెన్సిక్ నిపుణులతో కాకుండా ఇద్దరు సాధారణ వైద్యులతో పోస్టుమార్టం చేయించారు. దీనిపై ప్రజాసంఘాలు, మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రీపోస్టుమార్టం చేయించి కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

 

పోలీసులు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా వారికిష్టం వచ్చినట్లుగా చేసుకుంటూ పోతుండటం, రెండు నెలలు గడుస్తున్నప్పటికీ కేసు దర్యాప్తులో ప్రాథమికస్థాయి అనుమానాలు కూడా నివృత్తికాకపోవడంపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీస్ ఉన్నతాధికారులైనా ఈ కేసును స్వయంగా విచారించి మేరీలీల మృతిపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని బాధితులు కోరుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top