కుందువానిపేటలో ఉద్రిక్తత!


శ్రీకాకుళం రూరల్: మండలంలోని కుందువానిపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. మా కుటుంబాలకు జీవనాధారంగా ఉన్న ఉన్న జీడి చెట్లను తొలగించి, కటే ్ట ఇళ్లు మాకోద్దంటూ ఇటీవల ఈ గ్రామస్తులు జీడిమామిడి తోటల తొలగింపు ప్రక్రియను అడ్డుకున్న విషయం విదితమే. అయితే ఇటీవల అధికారులు చర్చల పేరుతో కాలయాపన చేసి తీరా శుక్రవారం ఉదయం ఐదు గంటలకే భారీ బందోబస్తు మధ్య గ్రామాన్ని ముట్టడించడంతో ఈ పరిస్థితి నెలకుంది. ఆర్డీవో, తహశీల్దారు, సీఐ, ముగ్గురు ఎస్సైల సమక్షంలో విచక్షణా రహితంగా ప్రవర్తించి అడ్డుకున్న వారందరినీ పశువుల మాదిరిగా లాక్కువచ్చి జీపుల్లోకి ఎక్కించి ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు.

 

 57 మందిని అరెస్టు చేశారు. దీంతో మహిళలంతా పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. వివరాల్లోకి వెళితే.. గత ఏడాది ఆక్టోబర్ 12వ తేదీన సంభవించిన హుద్‌హుద్ తుపాను సమయంలో సీఎం చంద్రబాబు ఈ గ్రామాన్ని సందర్శించారు. మత్స్యకారులందరికీ తుపాన్లను తట్టుకునే ఇళ్లు కట్టిస్తామని, మోడల్ విలేజ్‌గా మారుస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగా ఇప్పిలి రెవెన్యూ గ్రామ పరిధిలో సర్వే నంబరు 219లోని ఐదు ఎకరాల 46 సెంట్లను గయాలు(పోరంబోకు)గా రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు గుర్తించారు. ఈ భూమిలో ఉన్న జీడిమామిడి తోటలను తొలగించేందుకు అధికారులు పలుమార్లు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు.

 

 దీంతో గురువారం వరకు చర్చల పేరుతో కాలం చేసిన ఆర్డీవో బలివాడ దయానిధి, ఇన్‌చార్జి తహశీల్దారు పూజారి రాంబాబు, సీఐ అప్పలనాయుడు, ఎస్సైలు, సుమారు 70 మంది పోలీసులు, 30 మంది రెవెన్యూ సిబ్బంది ఉదయం ఐదు గంటలకే కుందువానిపేట గ్రామాన్ని ముట్టడించారు. జీడి తోటలను ఏసీబీలతో తొలగించేందుకు అధికారులు ప్రయత్నించగా..ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు అడ్డుకున్నారు. అవసరమైతే ప్రాణాలర్పిస్తాం కానీ తోటలను తొలగించకనీయమంటూ స్పష్టం చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. దీంతో అధికారులు, పోలీసులు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ఈనేపథ్యంలో పోలీసులు అడ్డుపడిన వారినీ, అడిగినా వారందరినీ ఇష్టారాజ్యంగా అరెస్టులు చేశారు.

 

 ఇప్పటి వరకూ అధికారులు సానుకూలంగా మాట్లాడారని, తీరా ఈ రోజున ఇలా ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తూ అరెస్టులు చేయడం దారుణమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ అధికారులు వారి మాటలను పట్టించుకోకుండా అధికార పక్ష నాయకుల ఒత్తిడుల నేపథ్యంలో ఆ స్థలాన్నే కేటాయించడానికి పూనుకుని, అడ్డుపడిన వారందరినీ అరెస్టు చేసి శ్రీకాకుళం ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు. 57 మందిని అరెస్టు చేసి..వీరందరిపైనా కేసులు నమోదు చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. దీంతో గ్రామంలోని మహిళలంతా పోలీసు స్టేషన్‌కు చేరుకుని బైఠాయించి నిరసన తెలిపారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top