వైఎస్సార్‌సీపీపై కక్ష... టీడీపీపై మమకారం

వైఎస్సార్‌సీపీపై కక్ష... టీడీపీపై మమకారం - Sakshi


రైతుల పక్షాన నిలబడటం తప్పా? ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన చేయడం నేరమా? ప్రజల తరఫున పోరాడితే ప్రతిపక్షాలకు సంకెళ్లు తొడుగుతారా? ప్రశాంత వాతావరణంతో ఆందోళనలు చేస్తే కేసులు బనాయిస్తారా? కేసుల నమోదులో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తారా?  వారికొక రూల్...ప్రతిపక్షానికి రూలా? అంటూ పోలీసుల తీరుపై ప్రజాస్వామ్యవాదులు తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నారు. అయినా వారు వెనక్కి తగ్గడం లేదు. ఆందోళనలతో ప్రజలకు ఇబ్బంది కల్గించారని వైఎస్‌ఆర్ సీపీ నేతలపై కేసులు బనాయించారు. అయితే వైఎస్సార్‌సీపీకి పోటీగా ఆందోళనలు చేసిన టీడీపీ నాయకులపై మాత్రం ఎటువంటి కేసులు నమోదు చేయలేదు. తద్వారా ప్రజల పక్షాన పోరాడితే ఉక్కుపాదంతో అణగదొక్కుతామని  సంకేతాలు ఇస్తున్నారు.  

 

 సాక్షి ప్రతినిధి, విజయనగరం :అటు రైతులు, ఇటు డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గద్దెనెక్కగానే కప్పదాటు ధోరణి అవలంబిస్తున్నారు. దీంతో మహిళలు, రైతుల పక్షాన పోరాడేందుకువైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చి న పిలుపు మేరకు ఆ పార్టీ  శ్రేణులు జూలై 24, 25, 26వ తేదీల్లో ‘నరకాసుర వధ’ పేరుతో నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ఈ ఆందోళన కార్యక్రమాల్లో రైతులు, మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు. శాంతియుతంగా ధర్నా లు, మానవహారాలు, రాస్తారోకోలు చేసి నిరసన తెలి యజేశారు. ఈ నిరసన కార్యక్రమాలకొచ్చిన స్పందన చూసీ టీడీపీ కలవరపడింది. అప్పుడే ఇంత వ్యతిరేకత ఉందా అని అంతర్మథనంలో పడింది. దీన్ని అణగదొక్కకపోతే భవిష్యత్‌లో మరింత ప్రతికూలత వస్తుందేమోనన్న భయంతో పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసులు బనాయించే కార్యక్రమానికి దిగింది. ఇంకేముంది అధికార పార్టీ నాయకులు చెప్పినట్టే పోలీసులు తలాడించారు  

 

 ప్రజా జీవనానికి ఇబ్బంది కల్గించారని..

 వైఎస్సార్‌సీపీ శ్రేణులు, రైతులు, మహిళలు చేసిన నిరసన కార్యక్రమాలతో ప్రజలకు ఇబ్బంది కల్గించారన్న అభియోగంతో కేసులు నమోదు చేశారు. విజయనగరం, బొబ్బిలి, చీపురుపల్లి, గజపతినగరం తదితర ప్రాంతాల్లో సెక్షన్ 283 (ప్రజా రవాణా అడ్డుకోవడం, రహదారుల దిగ్బంధించడం), సెక్షన్ 341 (ట్రాఫిక్‌కు ఇబ్బందు లు సృష్టించడం), సెక్షన్ 145(రహదారి దిగ్బంధం చేయవద్దని చెప్పినా వినకపోవడం), సెక్షన్ 143(గుమిగూడి ఉండటం, అక్రమంగా సంఘంగా ఏర్పడటం), 3 క్లాజ్ (మైకుకు అనుమతి తీసుకోకపోవడం) కింద కేసులు నమోదు చేశారు. విజయనగరంలో కోలగట్ల వీరభద్రస్వామి, బొబ్బిలిలో ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు, చీపురుపల్లిలో బెల్లాన చంద్రశేఖర్‌తో పాటు మరికొంతమందిపై ఈ కేసులు నమోదు చేశారు.

 

 టీడీపీ నాయకులకు ఆ సెక్షన్లు వర్తించవా!

 తిండిలేక ఒకరు, తిన్నది అరక్క మరొకరు అన్నట్టుగా రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ ఆందోళన చేయగా, ఇందుకు పోటీగా టీడీపీ ఆందోళనలు చేసింది. జగన్‌మోహన్‌రెడ్డిని లక్ష్యంగా, ప్రజల ఆశలకు భిన్నంగా  ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఆ పార్టీ శ్రేణులు ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు, ర్యాలీలు  నిర్వహించాయి. అనుమతి లేకుండా మైకులు వినియోగించాయి. కానీ పోలీసులకు ఇవేవీ కన్పించలేదు. ఒక్క వైఎస్సార్‌సీపీ చేసిన నిరసన కార్యక్రమాలు మాత్ర మే వారికి కనిపించాయి.  దీంతో వారిపై మాత్రమే కేసులు నమోదు చేసి,  టీడీపీ నేతల జోలికి   వెళ్లలేదు.  దీన్నిబట్టి కేసుల బనాయింపు వెనుక ఎవరి హస్తం ఉందో అర్థం చేసుకోవచ్చు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top