పోలీసుల ‘దేశం’ భక్తి

పోలీసుల ‘దేశం’ భక్తి - Sakshi


నమస్తే సాబ్... బాగున్నా సాబ్... నాకేంటి సార్.. మీరు అధికారంలో ఉన్నారు.. నేను సేఫ్ అంతా మీ చలవ సార్....చెప్పండి సార్... ఫోన్ చేశారు...ఓ..మన వాళ్లేనా..ఐతే ఓకే సాబ్..మీరింతగా ఫోన్‌చేసి చెప్పాలా...నాకు తెల్వదా ఏంది సార్... నో ప్రాబ్లం.... నేనున్నాగదా సాబ్. ...నే చూసుకుంటా...మీరు మీ పనుల్లో ఉండండి...మీరు ఫోన్ పెట్టేలోపు మీ వాళ్లాంతా మీ ముందుంటారు.... ఠీక్‌హై సాబ్...అచ్చా సాబ్..నమస్తే సాబ్.

 

 సాక్షి, గుంటూరు

 ఫోన్‌కు ముందో నమస్కారం....చివర్లో మరో నమస్కారం....మధ్యలో వంగి వంగి సలాములు...అధికార పార్టీ ఎమ్మెల్యేలకు పోలీసులు చేస్తున్న ‘రాజ సేవ’ఇది..పెట్టీ కేసు నుంచి పెద్ద కేసు వరకు ఆ ఎమ్మెల్యేలకు వంత పాడటం జిల్లాలో పోలీస్ అధికారులకు నిత్యకృత్యంగా మారింది. ఈ క్రమంలోనే వైఎస్సార్ విగ్రహం ధ్వంసం కేసులో ముఖ్య నిందితులను తప్పించి తమ స్వామి భక్తిని చాటుకున్నారు.



  అమరావతి మండలం మండెపూడి గ్రామంలో అక్టోబరు 23 రాత్రి కొందరు టీడీపీ కార్యకర్తలు పాత పంచాయతీ కార్యాలయం సెంటర్‌లోని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా విగ్రహాన్ని ఊరుబయట మురుగు కాలువలో పడవేశారు.



  ఈ సంఘటనపై అదేరోజు పెదకూరపాడు వైఎస్సార్ సీపీ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు, పార్టీ నాయకుడు కోటా హరిబాబులు కలిసి టీడీపీకి చెందిన సుమారు 20 మందిపై అమరావతి సీఐ హనుమంతరావుకు ఫిర్యాదు చేశారు.



  అదే రోజు సాయంత్రం పార్టీ జిల్లా  అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితర జిల్లా నాయకులు సంఘటన స్థలానికి చేరుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఒకటి రెండు రోజులలో నిందితులను అరెస్ట్ చేస్తామని సీఐ హనుమంతరావు హమీ  ఇచ్చారు.



  కేసు నమోదు చేసిన అమరావతి పోలీసులు అధికారపార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గి10 మంది ముఖ్యుల పేర్లు తొలగించి వారి అనుచరులు 10 మందిపై తూతూ మంత్రంగా కేసు నమోదు చేసి మంగళవారం అరెస్ట్‌చేసి కోర్టులో హాజరుపర్చారు. బెయిలబుల్ కేసు కావటంతో వెంటనే బయటకు వచ్చారు.



  ఈ కేసులో అమరావతి పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఈ విషయమై అమరావతి సీఐ హనుమంతరావును ‘సాక్షి’ వివరణ కోరగా కేసుకు సంబంధం లేదని నిర్ధారించుకుని 10 మంది పేర్లు తొలగించామని, చట్ట ప్రకారమే సెక్షన్లు నమోదు చేశామని చెప్పారు.

 

 పోలీసుల వైఖరే కారణం..

  ఇదిలావుంటే... గ్రామాల్లో విగ్రహ ధ్వంసాలు, గొడవలు జరిగినప్పుడు  పోలీస్ అధికారులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకుంటే శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడదని గ్రామస్తులు చెబుతున్నారు. అలా కాకుండా అధికారపార్టీ నేతల ఒత్తిడితో కేసులు నీరుగార్చడం, తప్పు చేసిన వారిని రక్షించే ప్రయత్నం చేస్తుండటంతో గ్రామాల్లో కక్షలు, కార్పణ్యాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



   చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే అధికారపార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తుండటంతో గ్రామాలు ఉద్రిక్తంగా మారుతున్నాయని వాపోతున్నారు.



  అధికారపార్టీ వర్గీయులకు కొమ్ముకాస్తూ వారికి రక్షణ కల్పించడంతోపాటు, వారు చెప్పినట్లుగా ఇతరపార్టీ నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి.



   టీడీపీ అధికారంలోకి రాగానే అమరావతి మండలం మండెపూడి గ్రామంలో

 వైఎస్సార్ పార్టీ నాయకుడు కోట హరిబాబుపై తప్పుడు కేసు బనాయించి వారం రోజుల పాటు జైల్లో ఉండేలా చేశారు. ఏదేమైనా పోలీసులు చట్టప్రకారం వ్యవహరించి గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొనేలా చూడాలని పలువురు కోరుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top