చిన్నానే హంతకుడు

చిన్నానే హంతకుడు


ఒంగోలు క్రైం : భార్యతో ఏకాంతానికి అడ్డుగా మారిందన్న కక్షతో 19 నెలల చిన్నారిని తన బాబాయే హత మార్చి మానవత్వానికి కొత్త భాష్యం చెప్పాడు. నగరంలోని రాజాపానగల్ రోడ్డులో నివాసం ఉండే కుండా శ్రీధర్, సాహితీ దంపతుల కుమార్తె ఆరాధ్య మంగళవారం మధ్యాహ్నం అదృశ్యమై సాయంత్రానికి హత్యకు గురైన విషయం తెలిసిందే. పోలీసుల సమర్థ దర్యాప్తుతో హంతకుడు చిన్నారి బాబాయేనని గంటల వ్యవధిలో తేల్చారు.



ఈ కేసు వివరాలను స్థానిక ఒన్‌టౌన్ పోలీసుస్టేషన్లో డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు బుధవారం వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. సాహితీ, శ్రీధర్‌ల ఏకైక కుమార్తె ఆరాధ్యను తొలుత ఆడిస్తున్నట్లు సాహితీ చెల్లెలు విశ్వసింధూజ భర్త కొండ్రు లక్ష్మీనారాయణ నటించాడు. అనంతరం తన ద్విచక్ర వాహనంపై బయటకు తీసుకెళ్లాడు. కొద్ది సేపటి తర్వాత ఒక్కడే ఇంటికి వచ్చాడు. పాప ఏమైందని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తే తనకేం తెలుసని బుకాయించాడు. బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులతో పాటు తాత వడ్డిబోయిన నాగేంద్రరరావులు నగరమంతా అన్వేషించారు.



ఎంతకీ పాప ఆచూకీ తెలియకపోవడంతో తన చిన్నల్లుడు లక్ష్మీనారాయణతో కలిసి నాగేంద్రరరావు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన మనుమరాలు అదృశ్యమైందని ఫిర్యాదు చేశాడు. సీఐ రవిచంద్ర ఆదేశాల మేరకు ఎస్సైలు రాములునాయక్, నాయబ్ రసూల్‌లు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. కొద్ది సేపటికే పాప హత్యకు గురైందని పోలీసులు తేల్చడంతో ఆరాధ్య కుటుంబ సభ్యులు ధుఃఖ సాగరంలో మునిగిపోయారు. చిన్నారికి అప్పుడే నూరేళ్లూ నిండాయా.. అని కన్నీటిపర్యంతమయ్యారు. ఆరాధ్య తల్లిని ఓదార్చేందుకు ఎవరి తరం కాలేదు.



 అసలేం జరిగిందంటే..

 మూడు నెలల క్రితమే టంగుటూరు మండలం పొందూరుకు చెందిన లక్ష్మీనారాయణతో సాహితీ చెల్లి విశ్వసింధూజకు ప్రేమ వివాహమైంది. విశ్వసింధూజ తన అక్క సాహితి కుమార్తె ఆరాధ్యను ఎంతో ప్రేమగా చూసుకునేది. పాపను రోజులో ఎక్కువ సేపు లక్ష్మీనారాయణ దంపతులు తమ వద్దే ఉంచుకునేవారు. ఆరాధ్య తల్లిదండ్రులు ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. కుమార్తెను పగలు తన చెల్లెలు విశ్వసింధూజ వద్దే వదిలి వెళ్లేది సాహితీ.



ఈ నేపథ్యంలో నెల నుంచి ఆరాధ్య విషయంలో లక్ష్మీనారాయణ కొంత అసహనంగానే ఉంటున్నాడు. దీనికి తోడు పాప ఎర్రగా ఉందని, తాను నల్లగా ఉన్నానని లక్ష్మీనారాయణ తరచూ భార్యతో అనేవాడు. ఎవరూ లేని సమయంలో పాపను కొట్టడం, తిట్టడం చేస్తుండేవాడు. చివరకు తమ ఏకాంతానికి భంగంగా ఉందని ఆరాధ్య పట్ల లక్ష్మీనారాయణ కోపం పెంచుకున్నాడు. అనంతరం ఒంటరిగా ఆడుకుంటున్న పాపను తప బైకుపై తీసుకెళ్లి సర్వేరెడ్డిపాలెం సుబాబుల్ తోటలో గొంతు నులిమి చంపి ఆపై ఆనవాళ్లు కనపడకుండా ఉండేందుకు పెట్రోలు పోసి నిప్పంటించాడు.



 పాపను చంపిన తర్వాత ఏమి తెలియనట్లే ఇంటికి వచ్చి అందరితో పాటు లక్ష్మీనారాయణ కూడా వెతకడం ప్రారంభించాడు. ఆరాధ్యను మోటారు సైకిల్‌పై తీసుకెళ్లడం కొందరు చూశారు. పాప లేకుండా ఒంటరిగా ఇంటికి రావడాన్నీ మరికొందరు గమనించారు. ఈ విషయం పోలీసుల దర్యాప్తులో తేలడంతో అతడిని అదుపులోకి తీసుకోని విచారించారు. ఖాకీలు తమదైన శైలిలో విచారించడంతో లక్ష్మీనారాయణ నేరం అంగీకరించాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్లు డీఎస్పీ తెలిపారు. కేసును త్వరితగతిన చేధించిన పోలీసులను ఆయన అభినందించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top